Share News

13 ఏళ్లుగా ఎన్నికల ఊసే లేదు

ABN , Publish Date - Mar 30 , 2025 | 12:06 AM

నియోజకవర్గం పరిధిలో పంచాయతీ, మండలాలకు సంబంధించి ఎన్నికలు జరిగి సుమారు 13 ఏళ్లు అవుతుంది. 2013లో ఎన్నికలు జరిగి పాలనా సాగింది. అనంతరం 2018లో ఎన్నికలు జరగాల్సి ఉండగా అప్పటి కొన్ని అనివార్య కారణాలతో ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. అదే సమయంలో పంచాయతీ ఎన్నికలకు వెళ్లేందుకు, పరిపాలనా సౌలభ్యం కోసం పునర్విభన నిర్వహించాలని అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఈక్రమంలో 2019లో అధికారంలో ఉన్న గత వైసీపీ బైఫర్‌కేషన్‌(విభజన, కలుపుకోవడం)ప్రక్రియను ప్రారంభించింది.

13 ఏళ్లుగా ఎన్నికల ఊసే లేదు
కీర్తివారి పాలెం వ్యూ

నిధులు లేక గ్రామాల్లో సమస్యల గగ్గోలు

2013లో జరిగిన ఎన్నికలు

2018లో జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో ఆటంకం

2019లో వైసీపీ బైఫర్‌కేషన్‌తో అడ్డగోలు ప్రక్రియ

మూడు ముక్కలైన కొత్తపేట,

5కిలో మీటర్ల దూరంలోని బుర్లవారిపాలెంలో

కలిసిన కీర్తివారిపాలెం

పాత పద్ధతిలో కొనసాగాలని కోర్టును ఆశ్రయించిన

రెండు ప్రాంతాల ముఖ్య నాయకులు, గ్రామస్థులు

నేటికీ ఎలక్షన్‌ జరగక సుమారు రూ.100కోట్ల నిధులకు నష్టం

చీరాల, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గం పరిధిలో పంచాయతీ, మండలాలకు సంబంధించి ఎన్నికలు జరిగి సుమారు 13 ఏళ్లు అవుతుంది. 2013లో ఎన్నికలు జరిగి పాలనా సాగింది. అనంతరం 2018లో ఎన్నికలు జరగాల్సి ఉండగా అప్పటి కొన్ని అనివార్య కారణాలతో ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. అదే సమయంలో పంచాయతీ ఎన్నికలకు వెళ్లేందుకు, పరిపాలనా సౌలభ్యం కోసం పునర్విభన నిర్వహించాలని అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఈక్రమంలో 2019లో అధికారంలో ఉన్న గత వైసీపీ బైఫర్‌కేషన్‌(విభజన, కలుపుకోవడం)ప్రక్రియను ప్రారంభించింది. దీంతో అప్పటి పాలకులు, గ్రామస్థాయి నాయకులు తోడై వారివారి స్వలాభాల కోసం తీర్మానాలు చేసి, కొన్ని గ్రామాలను సుదూరంగా ఉన్న పంచాయతీల్లో కలిపారు. ఈక్రమంలో పట్టణానికి సమీపంలో ఉండే కొత్తపేట మూడు ముక్కలయ్యాయి. ఈక్రమంలో కొత్తపేటలోని ప్రసాద్‌నగర్‌లో కొంతభాగం, రోశయ్య కాలనీ, ప్రతిభభారతినగర్‌, వడ్డె సంఘం ప్రాంతాలు సుదూర ప్రాంతమైన పాపాయిపాలెంలో కలిపారు. భౌగోళికంగా వాడరేవు పంచాయతీలో ఉన్న కీర్తివారి పాలెంను సుమారు 5కిలో మీటర్లు దూరంలో ఉన్న బుర్లవారి పాలెంలో అరకొర తీర్మానాలతో అనుసంధానం చేశారు. అందుకు సంబంధించి అప్పటి అధికారులు 2019 డిసెంబర్‌లో ఉత్తర్వులు జారీ చేశారు. 2020లో ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ కూడా జారీ అయింది. దీంతో ఆగ్రహించిన కీర్తివారిపాలెం పీడీసీసీ బ్యాంక్‌ మాజీ డైరక్టర్‌ గడ్డం శ్రీనివాసరావు, కొత్తపేట మాజీ సర్పంచ్‌ చుండూరి వాసు వేర్వేరుగా రిట్‌ పిటిషన్‌ 642/2020ను, మరో నెంబర్‌ను కోర్టులో దాఖలు చేశారు. అప్పటి ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమే్‌షను కూడా కలిసి సమస్యను వివరించగా ఆయన జోక్యంతో ఎన్నికలు నిలిచాయి. అయితే వేటపాలెం మండలం రామన్నపేటపై బైఫర్‌కేషన్‌ ప్రభావం లేకపోవడంతో ఆ పంచాయతీలో మాత్రమే ఎన్నికలు జరిగాయి. అంతేకాకుండా అనూహ్యంగా వీరి పిటిషన్‌ను సమర్థిస్తూ కోర్టు నాలుగు నెలలకే తీర్పు వెలువడించింది. దీంతో పాత పద్ధతిలో గ్రామాలను ఉంచి ఎన్నికలు జరపాల్సి ఉండగా, అప్పటి పాలకులకు గెలుపు ధీమా లోపించడంతో ఎన్నికలకు వెళ్లలేకపోయారు. పైగా కొవిడ్‌ ప్రభావంతో చాలా వరకు అన్ని వ్యవస్థలకు పూర్తి స్థాయిలో ఆటంకం ఏర్పడింది. అనంతర పరిస్థితులు సాధారణ స్థితికి చేరినా కూడా పాలకులు ఎన్నికలు నిర్వహించేందుకు మక్కువ చూపలేదు.

నిధులు లేక గ్రామాలు అవస్థలు

నియోజకవర్గంలో ఇప్పటికే రూ.100కోట్ల నష్టం

ఈక్రమంలో 2013 తరువాత నుంచి ఎన్నికలు జరగక పోవడంతో ప్రస్తుతం ఎన్నికలు జరిగి సుమారు 13 ఏళ్లకు సంఖ్య చేరింది. అయితే పంచాయతీ, మండలాల పాలన లేకపోవడంతో అప్పట్లోనే కొంత వరకు 14వ ఆర్థిక సంఘం నిధులు అందలేదు. కాలక్రమేణా నియోజకవర్గంలో మేజర్‌ పంచాయతీలు. చిన్న పంచాయతీలు అన్ని కలుపుకుని సుమారు రూ.100కోట్లు నిధులు గాలిలో కలిశాయి. అయితే నిధులు లేకపోవడంతో తాగునీటి వసతులతో సహా అన్నిరకాల వసతులు సైతం కనుమరుగయ్యాయి. రహదారులు సరి లేవు. విద్యుత్‌ దీపాల వెలుగు లేదు. ఇక మరీ చిన్న గ్రామాల పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి.

ఎన్నికలు జరపాలని కోర్టు ఆదేశం

ఎన్నికలు జరపాలని సుమారు మూడు నెలల కిందట కోర్టును ఆశ్రయించాం. అందుకు కోర్టు సమర్థిస్తూ పాత పద్ధతిలో ఎన్నికలు ఆరు మాసాల్లో జరపాలని ఆదేశాలు ఇచ్చింది. అయినా పాలకులు, అధికారులు తమకేమీ పట్టనట్లు ఉంటున్నారు. 14వ సంఘం నిధులు అసలు రాకపోయినా, కనీసం ఇప్పటికైనా ఎన్నికలు జరిగితే 15వ ఆర్థిక సంఘం నిధులొచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు నిర్వహించి అభివృద్ధికి సహకరించాలి.

- చుండూరి వాసు, మాజీ సర్పంచ్‌, కొత్తపేట

ప్రజాభిప్రాయం లేకుండా విభజన

సాధరణ సమావేశంలో అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంతో గ్రామం విభజన జరగడంతో కోర్టును ఆశ్రయించాం, ప్రజాభిప్రాయం సేకరిస్తే అప్పట్లోనే సమస్యకు పరిష్కారం ఉండేది. కోర్టు మాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కానీ ఎన్నికలు ఆగడంతో గ్రామాల్లో అభివృద్ధి లేక అధ్వానంగా ఉంటున్నాయి. ఇప్పటికైనా ఎన్నికలు జరిగితే ప్రయోజనం.

- గడ్డం శ్రీనివాసరావు, పీడీసీసీ బ్యాంక్‌ మాజీ డైరెక్టర్‌

ఉన్నతాధికారుల ఉత్తర్వుల కోసం వేచిచూస్తున్నాం

అప్పట్లో స్టే ఉండడంతో ఎన్నికల ప్రక్రియ నియోజకవర్గంలో జరగలేదు. ప్రస్తుతం కోర్టు స్టేని తొలగించింది. ఈక్రమంలో ఎన్నికలకు ఇబ్బంది లేకపోవడంతో విషయాన్ని ఉన్నతాధికారులకు పంపాం. వీలయినంత త్వరగా ఉత్తర్వులు రాగానే ఎన్నికలు నిర్వహిస్తాం.

- కేఎల్‌ ప్రభాకరరావు, గ్రామ పంచాయతీ అధికారి

Updated Date - Mar 30 , 2025 | 12:06 AM