Share News

నష్టాల బాటలో పసుపు రైతు

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:58 AM

పసుపు సాగు చేసిన రైతులకు ఈ ఏడాది నష్టాల ఘాటు తప్పేలా లేదు. పసుపు ఆశించినమేర దిగుబడి లేకపోవడం, అదేసమయంలో మార్కెట్‌లో గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదు.

నష్టాల బాటలో పసుపు రైతు

కంభం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): పసుపు సాగు చేసిన రైతులకు ఈ ఏడాది నష్టాల ఘాటు తప్పేలా లేదు. పసుపు ఆశించినమేర దిగుబడి లేకపోవడం, అదేసమయంలో మార్కెట్‌లో గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదు. మార్కెట్‌లో పసుపు క్వింటా 7-8వేలు పలుకుతుండడంతో రైతులు ఆందోళన చెందు తున్నారు. మార్కాపురం డివిజన్‌లో పత్తి, మిర్చి పంటలు వేసిన రైతులు నష్టాలబాట పట్టినట్లే పసుపు రైతుకు అదే పరిస్థితి ఏర్ప డింది. ప్రకాశం జిల్లాలో పసుపు ఎక్కువగా పశ్చిమ ప్రాంతమైన గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లోని కంభం, గిద్ద లూరు, కొమరోలు, బేస్తవారపేట, అర్థవీడు, రాచర్ల, సీఎస్‌పురం, దర్శి మండలాల్లో సుమారు 1500 ఎకరాలకు పైగా పసుపు సాగు చేశారు. అయితే అనుకున్న స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఈ ప్రాంత రైతులు బోర్లపైనే ఆధారపడాల్సి ఉంది. పంట బాగా పండితే అప్పులు తీరుతా యని ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం 20 రోజుల నుంచి పసుపుపై తవ్వకాలు ప్రారంభమయ్యాయి. అయితే దిగుబడి సగానికిపైగా తగ్గడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎకరాకు 50-60 క్వింటాళ్ళ దిగుబడి రావలసి ఉండగా కనీసం 28 క్వింటాళ్లు కూడా రాకపోవడంతో పంటపై చేసిన అప్పులు ఎలా తీర్చాలని ఆందోళన చెందుతున్నారు.

ఎకరాకు రూ.1.50లక్షల పెట్టుబడి

పసుపు పంటకు పెట్టుబడి అధికంగా ఉంటుంది. విత్తనం కొనుగోలు, రసాయనిక ఎరువులు, పురుగుల మందులు, కలుపు తీయడం, నీటి పారుదలకు 1 లక్ష, పసుపు పంట తవ్విన తరువాత నూర్పిడికి, పాలిసింగ్‌కు 25వేలు, ట్రాక్టర్‌తో దున్ని కూలీలతో గ్రేడింగ్‌ చేసేందు కు రూ.30వేలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది.

సగానికి పడిపోయిన ధరలు

గత ఏడాది పసుపు క్వింటా రూ.13వేలు పలుకగా ప్రస్తుతం రూ.7-8వేల మధ్య పలుకుతోంది. ఇటు దిగుబడులు లేక, పంట ధరలు లేక తాము నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండిన పంటలు నిలువ ఉంచుకుని అప్పు పెంచుకో వడం ఇష్టం లేక వచ్చిన ధరలకే దళారులకు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 12:58 AM