Share News

Drug Safety Alerts: ఆ ఔషధాలతో జాగ్రత్త

ABN , Publish Date - Apr 16 , 2025 | 03:53 AM

ఆల్ట్రా-లాంగ్ వాడకం సమయంలో ఐరన్‌ సుక్రోజ్‌ ఇంజెక్షన్లతో బొబ్బలు, డైక్లో ఏక్యూ వాడినప్పుడు శరీరంపై దురదలు, దద్దుర్లు ఏర్పడుతున్నాయి. ఈ దుష్ప్రభావాలను గుర్తించిన వైద్యులు డ్రగ్ సేఫ్టీ న్యూస్‌లెటర్‌ను విడుదల చేశారు

Drug Safety Alerts: ఆ ఔషధాలతో జాగ్రత్త

  • ఐరన్‌ సుక్రోజ్‌ ఇంజెక్షన్లతో ఒంటిపై బొబ్బలు

  • డైక్లో ఏక్యూ వాడితే శరీరంపై దురద, దద్దుర్లు

  • గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో గుర్తించిన వైద్యులు

  • ప్రతి వైద్య కళాశాలలో ఫార్మకోవిజిలెన్స్‌ విభాగాలు

  • రాష్ట్రంలో తొలిసారి డ్రగ్‌ సేఫ్టీ న్యూస్‌ లెటర్‌ విడుదల

గుంటూరు మెడికల్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): దీర్ఘకాలంగా మూత్రపిండాల సమస్య (సీకేడీ)తో బాధపడే రోగుల్లో రక్తహీనతను తగ్గించేందుకు వినియోగించే ఐరన్‌ సుక్రోజ్‌ ఇంజెక్షన్ల వల్ల దుష్ప్రభావాలు ఎదురవుతున్నాయి. ఇవి చేయించుకున్న రోగుల శరీరంపై ఎర్రటి మచ్చలు, బొబ్బలు ఏర్పడుతున్నాయి. నొప్పుల నివార ణకు వాడే డైక్లో ఏక్యూ మందు వల్ల కూడా శరీరంపై దురదలు, దద్దుర్లు వస్తున్నాయి. ఇటీవల గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి (జీజీహెచ్‌)లో ఈ మందులు వాడినప్పుడు రోగుల్లో కనిపించిన దుష్ప్రభావాలను వైద్యులు ఆరోగ్యశాఖ దృష్టికి తెచ్చారు. ఇటీవల కొన్ని మందుల వల్ల దుష్ప్రభావాలు వస్తుండడంతో వీటిని గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి వైద్య కళాశాలలో ఫార్మకోవిజిలెన్స్‌ విభాగాలను ఏర్పాటు చేసింది. ఇవి వైద్య కళాశాలలోని ఫార్మకాలజీ విభాగానికి అనుబంధంగా పనిచేస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యరంగంలో గుర్తించిన మందుల దుష్ప్రభావాల వివరాలను ఘజియాబాద్‌లోని సెంట్రల్‌ పార్మకోవిజిలెన్స్‌ కేంద్రానికి పంపుతాయి. ఈ మందుల పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ వైద్యులను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైతే ఆయా మందుల నిషేధానికి సిపారసు చేస్తాయి.


డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలి..

ఇటీవల గుంటూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో డ్రగ్‌ రియాక్షన్స్‌ను వైద్యులు గుర్తిస్తున్నారు. పలురకాల బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్ల చికిత్సకు వాడే మెట్రోనిడజోల్‌ యాంటీ బయోటిక్‌ వాడిన కొందరు రోగుల్లో చర్మం వాయడం, ఎరుపు రంగులోకి మారడం, తెల్లటి చీముతో కూడిన చిన్న పొక్కులు ఏర్పడడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. తామర, దురద వంటి పలు ఫంగల్‌ వ్యాధుల చికిత్సల్లో వాడే లులికొనజోల్‌ వల్ల ముఖంపై మంగు (మెలస్మా) మచ్చలు ఏర్పడుతున్నాయి. గుండె జబ్బు, డీప్‌వీన్‌ థ్రాంబోసిస్‌ రోగులకు వాడే దాల్లీపెరిన్‌ వల్ల కండరాల నొప్పులు వేధిస్తున్నాయి. మధుమేహ రోగుల్లో రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించేందుకువాడే గ్లిక్లాజైడ్‌ వల్ల చర్మంపై దద్దుర్లు, పొక్కులు, గడ్డలు ఏర్పడుతున్నట్టు గుర్తించారు. నొప్పుల నివారణకు వాడే ట్రమడాల్‌ ట్యాబ్లెట్ల వల్ల ఒంటిపై బొబ్బలు వస్తున్నట్టు గుర్తించారు. అలర్జీ, వికారానికి ప్రొమెథాజైన్‌ మందును పిల్లలకు సూచించవద్దన్నారు.


ఇకపై ప్రతినెలా డ్రగ్‌ సేఫ్టీ న్యూస్‌ లెటర్‌

రాష్ట్ర ప్రభుత్వ వైద్య బోధన రంగంలో తొలిసారిగా గుంటూరు వైద్య కళాశాల ఫార్మకాలజీ విభాగం మంగళవారం డ్రగ్‌ సేఫ్టీ న్యూస్‌లెటర్‌ను విడుదల చేసింది. ఇందులో పలు రకాల ఔషధాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, వాటి వినియోగంలో పాటించాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఫార్మకాలజీ విభాగాధిపతి డాక్టర్‌ సాల్మన్‌ రాజు ఆధ్వర్యంలో రూపొందించిన డ్రగ్‌ సేఫ్టీ న్యూస్‌లెటర్‌ను గుంటూరు వైద్య కళాశాల (జీఎంసీ) ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్‌వీ సుంద రాచారి ఆవిష్కరించారు. ఇకపై ప్రతినెలా న్యూస్‌లెటర్‌ను విడుదల చేస్తామని, ఇది ప్రైవేటు డాక్టర్లకూ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

Updated Date - Apr 16 , 2025 | 03:53 AM