PM Modi: ఏపీకి ప్రధాని మోదీ.. ఎప్పుడంటే..
ABN , Publish Date - Apr 15 , 2025 | 03:29 PM
PM Modi: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారు అయింది. మే 2వ తేదీన రాజధాని అమరావతికి ప్రధాని మోదీ రానున్నారు. రాజధాని పునర్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు వెల్లడించారు.

అమరావతి, ఏప్రిల్ 15: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతిలో పర్యటించనున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాజధాని అమరావతి పునర్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభిస్తారని తెలిపారు. మూడు ఏళ్లలో అసెంబ్లీ, హైకోర్ట్, సచివాలయం, అమరావతి పనులు మొత్తం పూర్తయి తీరాల్సిందేనని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన పనులకు టెండర్లు పిలిచామని ఆయన చెప్పారు. దీంతో మోదీ శంకుస్థాపన అనంతరం రాజధాని అమరావతి పనులు ఊపందుకొన్నున్నాయి.
మరోవైపు ఇప్పటికే రాజధాని నిర్మాణ పనులు జరుగుతోన్నాయి. ఈ మాసాంతం నుంచి అవి మరింత శరవేగంగా జరుగుతాయని ఇప్పటికి మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ సోమవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. మంగళవారం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీ పర్యటనపై వివరాలను వెల్లడించారు.
2015, అక్టోబర్ 22వ తేదీన రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. దీంతో అందుకు సంబంధించిన పనులు శరవేగంగా ప్రారంభమైయ్యాయి. ఆ యా పనులకు కొనసాగుతోండగా.. ఇంతలో 2019 అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు వైసీపీ పట్టం కట్టాడు. దీంతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
అయితే ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్.. రాజధాని అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు ప్రకటించారు. కానీ ఆయన సీఎం పీఠాన్ని అధిరోహించిన అనంతరం ఏపీకి మూడు రాజధానులు ఉండాలంటూ కీలక ప్రకటన.. అది కూడా అసెంబ్లీ సాక్షిగా చేశారు. దీంతో రాజధానికి 33 వేల ఎకరాల భూమినిచ్చిన రైతులు ఆందోళనకు దిగారు. ఆ క్రమంలో వారు నిరసనలు, ఆందోళనలు, దీక్షలు చేపట్టారు.
అంతేకాకుండా.. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు, అలాగే అమరావతి నుంచి అరసవల్లి వరకు రైతులు పాదయాత్రలు చేపట్టారు. వాటికి సైతం సీఎంగా వైఎస్ జగన్ అడ్డంకులు సృష్టించారు. ఇంతలో 2024 అసెంబ్లీ ఎన్నికలు రానే వచ్చాయి. ఈ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీలు కలిసి కూటమిగా ఏర్పడి బరిలో దిగాయి. ఈ ఎన్నికల్లో కూటమి 175కి 164 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది.
ఇక కూటమిలో భాగస్వామ్య పక్షమైన బీజేపీ సైతం రాష్ట్రాభివృద్ధికి సహాయ సహాకారాలు అందిస్తామని ఎన్నిక ప్రచారంలో ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టమైన హామీ ఇచ్చిన విషయం విధితమే. అందులోభాగంగా రాజధాని అమరావతి నిర్మాణంతోపాటు రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సైతం కేంద్రం తన వంతు సహాకారాన్ని అందిస్తోన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్‌తోపాటు రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయడానికి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నిర్ధిష్ట్య లక్షాన్ని నిర్దేశించుకొన్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ
For AndhraPradesh News And Telugu News