Share News

Telugu Fire Buzz: అచ్చ తెలుగు అగ్ని

ABN , Publish Date - Apr 16 , 2025 | 06:35 AM

రాజమండ్రిలోని అగ్నిమాపక కేంద్రం భాషా ప్రేమను చాటుతూ ప్రతి పదాన్నీ అచ్చతెలుగులో అందించింది. చిచ్చు గోళ్లు నుంచి మించుమొన వరకు నూతన పదప్రయోగాలతో భాషాభిమానులను ఆకట్టుకుంది

Telugu Fire Buzz: అచ్చ తెలుగు అగ్ని

  • ఇంగ్లీషులో చదివి అర్థం చేసుకోగలరు

  • రాజమండ్రి అగ్నిమాపక కేంద్రం తెలుగు మయం

(రాజమహేంద్రవరం - ఆంధ్రజ్యోతి)

తెలుగును ప్రేమించాలి. తెలుగు భాషను కాపాడుకోవాలి. సరైన తెలుగు పదం అందుబాటులో ఉంటే... అన్యభాషా పదాన్ని పరిహరించాలి. అయితే... తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఇన్నీసుపేట అగ్నిమాపక సేవల కేంద్రంలో అడుగు పెడితే... తెలుగు మరీ ఎక్కువగా, పండితులకు కూడా అర్థంకాని స్థాయిలో ‘వెలుగుతూ’ కనిపిస్తుంది. ఇక్కడ పని చేస్తున్న జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి శ్రీనివాస్‌ ఘనత ఇది! సోమవారం నుంచి అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముద్రించిన కరపత్రం, అక్కడి నోటీసు బోర్డు, ఇతర అన్ని చోట్లా అచ్చ తెలుగును ఉపయోగించారు. అక్కడ... ‘కాపాడుటయే మా ఉడిగము’ అనే నినాదం కనిపిస్తుంది. అర్థమైతే సరే! తెలుగులో అర్థంచేసుకోలేని వాళ్లు అక్కడే ఇంగ్లీషులో చదివి అర్థం చేసుకోవచ్చు. అది... ‘వుయ్‌ సర్వ్‌ టు సేవ్‌’కు తెలుగు రూపం! ‘అగ్నిమాపక వారోత్సవాలు’ అని అర్థమయ్యేలా చెప్పే అవకాశమున్నా ‘మంటమాపు ఏడునాళ్ల వేడుకలు’ అని అచ్చ తెలుగును ప్రయోగించారు. వెంపైలపు భారతమ్ము-వెలిగింపగ కలిసిరమ్ము అని మరో నినాదం. అగ్నిప్రమాదాలు లేని దేశం కోసం కలిసి కృషి చేద్దాం... అని దీని అర్థం. ఎల్పీజీని ఈద అని, డీజిల్‌ను ‘మంచి చమురు’ అని, పెట్రోలును ‘వాడ చమురు’ అని, లైటర్‌ను ‘చిచ్చు గోళ్లు’ అని తెనిగీకరించారు.


‘అగ్గిపెట్టె’ అని అందరికీ అర్థమయ్యే పదాన్ని కూడా ‘చిచ్చుపెట్టె’ చేసేశారు. అనువెనను(రెగ్యులేటర్‌), మించుమొన (ఎలక్ట్రికల్‌ పాయింట్‌), చదునెనలు(ఇస్త్రీ పెట్టెలు), దంచెనలు (మిక్సీలు), ఉతుకెనలు (వాషింగ్‌ మిషన్లు), వంచమీట (మెయిన్‌ స్విచ్‌), విడివిడి చిరువళి విరుపు(ఎంసీబీ), మించువంచమీట (ఎలక్ట్రికల్‌ మెయిన్‌ స్విచ్‌), మించుపరతి (విద్యుత్‌ ప్రవాహం), బిరడా (ప్లగ్‌)లాంటి పదాలనూ ప్రయోగించారు. ఉద్యోగుల డ్యూటీలు తెలిపే బోర్డులో సైతం.. మంట పిలుపులు(ఫైర్‌ కాల్స్‌), కాపుగడ పిలుపులు(రెస్క్యూ కాల్స్‌), చేకావలి ఆగవులు (స్టాండ్‌బై డ్యూటీలు), మంట పిలుపు వెరసు (ఫైర్‌ కాల్‌ నెంబరు), చాటింపు పలక (నోటీసు బోర్డు) అని అచ్చంగా తెలుగులో రాసేశారు. తెలుగు భాషాభిమానం, ప్రేమ ఉండటం గొప్ప విషయమే! కానీ... జనం మాత్రం ఈ తెలుగును అర్థం చేసుకోలేక తెప్పరిల్లుతున్నారు. దీని గురించి ప్రశ్నించగా... ‘పదాలను మనం పుట్టిస్తే తప్పా? తెలుగు పేరుతో చాలామటుకు సంస్కృత పదాలే వాడుతున్నాం’ అని శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 06:35 AM