Share News

కొలికపూడిపై తిరుగుబాటు

ABN , Publish Date - Apr 05 , 2025 | 01:32 AM

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరుపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తీరుమార్చుకోకపోతే పార్టీని కాపాడుకునేందుకు తామంతా ఆయనపై తిరుగుబాటు చేసేందుకు సిద్ధమంటూ వారు ప్రకటించారు.

కొలికపూడిపై తిరుగుబాటు

కార్యకర్తల సమావేశంగా మారిన ముఖ్య నేతల అంతర్గత సమావేశం

పార్టీ కార్యాలయం కిటకిట

ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహావేశాలు

వైసీపీ వారితో కలిసి దందాలు చేస్తున్నారని ధ్వజం

పార్టీని రక్షించుకునేందుకు సమిష్టిగా కష్టపడతామని వెల్లడి

అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

తిరువూరు, ఏప్రిల్‌ 4 (ఆంరఽధజ్యోతి): ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరుపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తీరుమార్చుకోకపోతే పార్టీని కాపాడుకునేందుకు తామంతా ఆయనపై తిరుగుబాటు చేసేందుకు సిద్ధమంటూ వారు ప్రకటించారు. గురువారం సాయంత్రం ముఖ్యనాయకుల అంతర్గత సమావేశం నిర్వహించారు. ఇదే సందర్భంలో ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల టీడీపీ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు రావడంతో నియోజకవర్గ కార్యాలయం నిండిపొయింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, పార్టీ అవిర్భవించిన నాటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్‌ నాయకులు, కార్యకర్తల్ని ఎమ్మెల్యే తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, ఆయన్ను కలిసేందుకు ఆయన కార్యాలయం ముందు గంటలకొద్ది పడిగాపులు పడిన, పట్టించుకోకుండా వెళ్ళిపోతాడని, అడుగడుగున అవమానలపాలు చేస్తున్నట్టు కొందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వైసీపీ నాయకులతో అంటకాగుతూ, టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించేందుకు చూస్తున్నట్టు కొందరు నాయకులు ఆరోపించారు. ఎమ్మెల్యే గ్రామాల్లో పర్యటనల సందర్భంలో గ్రామ పార్టీ నాయకులకు కనీస సమాచారం ఇవ్వకుండా, ఆ గ్రామంలో వైసీపీ నాయకుల ఇళ్లకు వెళుతున్నాడని, ఆయా గ్రామాల్లో టీడీపీకి చెందిన వారినే ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు కొందరు నాయకులు ఆరోపించారు. టీడీపీ నాయకులపైనే నియోజకవర్గంలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడని, వైసీపీ నాయకులతో కలిసి మట్టి, ఇసుక దందాలు చేయిస్తున్నాడని కొందరు కార్యకర్తలు ఆరోపించారు. పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేపై సరైన చర్యలు తీసుకోకపోతే నియోజకవర్గంలో టీడీపీ తీవ్రంగా నష్టపోతుందని, తామంత పార్టీని రక్షించుకునేందుకు సమిష్టిగా కృషిచేస్తామని, కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అర్హులకు అందేలా చూడటంతో పాటుగా, పార్టీ అధిష్టానం ఆదేశాల ప్రకారం కార్యక్రమాల అమలుకు కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ముక్తకంఠంతో నినదించారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు, పార్టీకి జరుగుతున్న నష్టాన్ని వివరించేందుకు అధిష్టానం వద్దకు వెళ్ళేందుకు నిర్ణయించారు. ఈ సమావేశంలో సీనియర్‌ నాయకులు శావల దేవదత్‌, చెరుకూరి రాజేశ్వరరావు, వెదురు వెంకటనర్సిరెడ్డి, తాళ్లూరి రామారావు, బొమ్మసాని మహేష్‌, ఆలవాల రమేష్‌రెడ్డి, మాదల హరిచరణ్‌(కిట్టు), గద్దె వెంకటేశ్వరరావు, నెక్కడపు వెంకటేశ్వరరావు, బడా శ్రీను, రేగళ్ళ వీరారెడ్డి, నాలుగు మండల నాయకులు గ్రామ పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2025 | 01:32 AM