Vijayawada: కమ్యూనిస్టుల పునరేకీకరణ ఎంతో అవసరం

ABN, Publish Date - Feb 24 , 2025 | 04:35 AM

కమ్యూనిస్టు ఉద్యమం 100 సంవత్సరాల సందర్భాన్ని పురస్కరించుకుని మార్క్సిస్టు ఆలోచనాపరుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ లైబ్రరీ..

Vijayawada: కమ్యూనిస్టుల పునరేకీకరణ ఎంతో అవసరం
  • మార్క్సిస్టు ఆలోచనాపరుల వేదికలో వక్తల ఉద్ఘాటన

  • బెజవాడలో కమ్యూనిస్టు ఉద్యమ వందేళ్ల సదస్సు

  • సీపీఐ, సీపీఎం, 17 ఎంఎల్‌ పార్టీల రాష్ట్ర నేతలు హాజరు

గవర్నర్‌పేట(విజయవాడ), ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): దేశంలో కమ్యూనిస్టుల పునరేకీకరణ ఎంతో అవసరమని వక్తలు అభిప్రాయపడ్డారు. కార్మిక, రైతాంగ పోరాటాలతోపాటు విశాఖ ఉక్కు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వంటి అనేక సమస్యల మీద 9 వామపక్ష పార్టీలు ఐక్యంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. కమ్యూనిస్టు ఉద్యమం 100 సంవత్సరాల సందర్భాన్ని పురస్కరించుకుని మార్క్సిస్టు ఆలోచనాపరుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ లైబ్రరీ హాలులో ‘కమ్యూనిస్టు ఉద్యమ పురోగమనం ఆవశ్యకత, అవకాశాలు, అవరోధాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సీపీఐ, సీపీఎంలతోపాటు 17 ఎంఎల్‌ పార్టీల రాష్ట్ర నాయకులు ఈ సదస్సులో పాల్గొన్నారు. వేదిక కన్వీనర్‌ చిగురుపాటి భాస్కరరావు అధ్యక్షత వహించిన ఈ సదస్సులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పి.రామకృష్ణ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలకు ఎంతో పోరాట చరిత్ర ఉందన్నారు. 1964లో నాటి పరిస్థితుల కారణంగా చీలికకు కొన్ని కారణాలు ఉండవచ్చని, వర్తమానంలో కమ్యూనిస్టు ఉద్యమ ఆవశ్యకతను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. విశాల దృక్పథంలో అన్ని కమ్యూనిస్టు వేదికలు దీన్ని గుర్తించాలన్నారు. మార్క్స్‌, లెనిన్‌, మావో, అంబేద్కర్‌ ఆలోచనా విధానాలతో ముందుకు సాగాలని కమ్యూనిస్టు నేతలను కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, వివిధ సీపీఐ(ఎంఎల్‌) పార్టీల నాయకులు కేజీ రామచందర్‌, స్ట్రగుల్‌ కమిటీ తరఫున నరసింహాస్వామి, పి.ప్రసాద్‌, ఎంపీ రామ్‌దేవ్‌, ఎం.హరిప్రసాద్‌, పి.కోటేశ్వరరావు, విరసం కార్యదర్శి పినాకపాణి, ఎం.సీపీఐ(యూ) నాయకులు కె.నాగభూషణం, వెంకటరెడ్డి, అమర్‌నాథ్‌ తదితరులు ప్రసంగించారు. న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్‌, జి.శ్రీనివాసరావు, బండ్ల శ్రీనివాస్‌, మోతుకూరి అరుణ్‌కుమార్‌, డానీ, సైకం రాజశేఖర్‌, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2025 | 04:35 AM