ACB traf: పదివేలు కాదు.. ఇరవై వేలిస్తేనే..!
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:39 PM
DMHO, CC caught by ACB ఓ మహిళా ఉద్యోగికి రీపోస్టింగ్ ఆర్డర్ కాపీ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేస్తూ.. జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌వో), క్యాంప్ క్లర్క్(సీసీ) గురువారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

రీపోస్టింగ్ ఆర్డర్ ఇచ్చేందుకు డబ్బుల డిమాండ్
మహిళా ఉద్యోగి నుంచి లంచం
ఏసీబీకి పట్టుబడిన డీఎంహెచ్‌వో, సీసీ
శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): ఓ మహిళా ఉద్యోగికి రీపోస్టింగ్ ఆర్డర్ కాపీ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేస్తూ.. జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌వో), క్యాంప్ క్లర్క్(సీసీ) గురువారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వైద్యఆరోగ్యశాఖలో కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ బీవీఎస్‌ఎస్ రమణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో సీనియర్ సహాయకురాలిగా పనిచేసిన దివ్యాంగురాలు ఆదివరపు కాంతమ్మ గతేడాది అక్టోబరు 2న మెడికల్ లీవ్ పెట్టింది. ఆ తర్వాత ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరు అయింది. అనంతరం రీపోస్టింగ్ కోసం ఆర్జేడీని సంప్రదించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఆమెకు రీపోస్టింగ్ ఇవ్వాలంటూ శ్రీకాకుళం డీఎంహెచ్‌వోకు ఆర్జేడీ కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో కాంతమ్మ రీ పోస్టింగ్ కోసం డీఎంహెచ్‌వో డాక్టర్ టీవీ బాలమురళీకృష్ణను ఆశ్రయించింది. ఆయన ఆ ఆర్డర్ కాపీ ఇచ్చేందుకు రూ.20వేలు లంచం డిమాండ్ చేశారు. కాగా.. తనవద్ద డబ్బులు లేవని, రూ.10వేలు ఇస్తానని ఆమె చెప్పినా వినలేదు. డబ్బులిస్తేనే.. రీపోస్టింగ్ ఆర్డర్ ఇస్తానంటూ డీఎంహెచ్‌వో తేల్చిచెప్పారు. దీంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. రీపోస్టింగ్ ఆర్డర్ ఇచ్చేందుకు డీఎంహెచ్‌వో లంచం డిమాండ్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో డీఎంహెచ్‌వోను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు పథకం రచించారు. ఇందులో భాగంగా గురువారం కాంతమ్మకు రసాయనం పూసిన రూ.20వేలను అందజేశారు. కాంతమ్మ ఆ డబ్బులను తీసుకెళ్లి.. డీఎంహెచ్‌వోకు వెళ్లి అందజేసింది. డీఎంహెచ్‌వో పక్కనే ఉన్న క్యాంప్ క్లర్క్ వాన సరేష్‌కు ఆ డబ్బులను ఇవ్వగా... వాటిని లెక్కించాడు. రూ.20వేలు సరిగానే ఉన్నాయని చెప్పాడు. అదే సమయంలో అక్కడ మాటు వేసిన ఏసీబీ డీఎస్పీ బీవీఎస్‌ఎస్ రమణమూర్తి, సిబ్బంది దాడి చేసి డీఎంహెచ్‌వో, సీసీని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేసి విశాఖపట్నం ఏసీబీ కోర్టుకు తరలించామని ఏసీబీ డీఎస్పీ బీవీఎస్‌ఎస్ రమణమూర్తి తెలిపారు.