Share News

cashew: జీడిపై తెగుళ్ల దాడి

ABN , Publish Date - Apr 13 , 2025 | 11:40 PM

cashew: ఉద్దానంలో ప్రధాన వాణిజ్య పంటగా పేరొందిన జీడి తెగుళ్ల బారినపడింది.

cashew: జీడిపై తెగుళ్ల దాడి
మామిడిపల్లిలో జీడి చెట్లకు పిక్కలు లేని దృశ్యం

- మాడిపోతున్న పూత

- పిందె దశలోనే రాలిపోతున్న పిక్కలు

- లబోదిబోమంటున్న రైతులు

పలాసరూరల్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఉద్దానంలో ప్రధాన వాణిజ్య పంటగా పేరొందిన జీడి తెగుళ్ల బారినపడింది. టీ దోమ, తెల్ల దోమ, మట్టి తెగులు, బూడిద తెగులు, తేనెబంక పురుగు ఆశించి పూత దశలోనే పంటను నాశనం చేస్తున్నాయి. ఈ పాటికే పూర్తిస్థాయిలో పంట రావాల్సి ఉన్నా తెగుళ్ల దాడితో జీడిపూత నల్లగా మారి దిగుబడి తగ్గుముఖం పడుతుంది. ఈ ఏడాది మార్చి నుంచే విపరీతంగా ఎండ వేడి పెరగడం, సరైన వర్షాలు లేకపోవడంతో పంటలో వృద్ధి లోపించింది. దీంతో తెగుళ్ల దాడి పెరిగింది. ముఖ్యంగా జీడిపూత నల్లగా మారి రాలుతుండడం, పిక్కల్లో ఎదుగుదల సరిగా లేకపోవడం కనిపిస్తుంది. తామర పురుగు, టీ-పురుగు ధాటికి పిందె దశలోనే పిక్కలు రాలుతున్నాయి. రైతులు పురుగు మందులు పిచికారీ చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఈ ఏడాది ఎవరైతే సరైన ప్రణాళికతో సస్యరక్షణ చేపట్టారో వారి పంటలు మాత్రమే కొంత మేర మెరుగ్గా ఉన్నాయి. మిగతా వారి పంటలు అంత బాగా లేవు. ఏడాదికేడాది జీడి సాగు పెట్టుబడులు పెరుగుతున్నాయి. మందులు, తోట కంచెలు, ఆకులను ఒక చోటకు చేర్చడం, దుక్కి దున్నడం వంటి వాటి కోసం రైతులు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే, దిగుబడులు మాత్రం ఆస్థాయిలో ఉండకపోవడంతో నష్టపోతున్నారు. ఈ పాటికి ఎకరాకు ఆరు బస్తాలు రావాల్సిన చోట కేవలం 3 బస్తాలు మాత్రమే వస్తుందని, ఇలా అయితే పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని ఉద్దాన రైతులు భయపడుతున్నారు.

13-palasarural-2.gif

అరకొరగా ఉన్న పిక్కలు


రైతులకు సలహాలు అందిస్తున్నాం

ఈ ఏడాది వర్షాభావంతో పాటు మే నెలలో ఉండాల్సిన వేడి మార్చి నుంచే ఉండడంతో జీడిలో ఎదుగుదల లోపించింది. వాతావరణంలో మార్పులతో జీడి చెట్లకు తెగుళ్లు వ్యాపించాయి. తెగుళ్ల నివారణకు రైతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నాం.

-శంకర్‌, ఉద్యానవనశాఖాధికారి, పలాస

ప్రభుత్వం ఆదుకోవాలి

ఈ ఏడాది జీడికి ఆశించిన తెగుళ్లతో రైతులకు నష్టాలు వస్తున్నాయి. ఎకరా తోటకు 3 బస్తాలకు మించి దిగుబడి వస్తే ఎంతో ఆనందం. మందులు, కంచె, దున్నడం వంటి వాటికి అధికంగా ఖర్చు అవుతుంది. తెగుళ్ల నివారణకు మందులు పిచికారి చేస్తున్నాం. మందుల ధరలు సైతం పెరిగిపోయాయి. దీనివల్ల ఎకరాకు సుమారు రూ.5వేల వరకు అదనపు ఖర్చు అవుతుంది. ప్రభుత్వమే ఆదుకోవాలి.

-మామిడి భాస్కరరావు, ఉద్దానం రైతు, మామిడిపల్లి

13-palasarural-5.gif మాడిపోయిన జీడిపూత

Updated Date - Apr 13 , 2025 | 11:40 PM