roads: రోడ్లు బాగుపడనున్నాయ్
ABN , Publish Date - Apr 13 , 2025 | 11:33 PM
roads: జిల్లాలోని పలురోడ్లు బాగుపడనున్నాయి. వాటి మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- మరమ్మతులకు రూ.20.75 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
- నిధుల విడుదలకు చొరవ చూపిన మంత్రి అచ్చెన్న
శ్రీకాకుళం, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలురోడ్లు బాగుపడనున్నాయి. వాటి మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో నియోజకవర్గాల వారీగా మరమ్మతులు చేపట్టాల్సిన రోడ్లు, వాటికి కావాల్సిన నిధులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రభుత్వానికి ఇటీవల నివేదిక అందించారు. దీంతో జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లోని 7 ప్రధాన రోడ్ల అభివృద్ధికి రూ.20.75 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు లను జారీచేసింది. శ్రీకాకుళం నియోజకవ ర్గంలోని కళింగపట్నం-పార్వతీపురం రోడ్డుకు (8.60 కి.మీ) రూ.4కోట్లు, ఎచ్చెర్ల నియోజక వర్గంలోని హైవే నుంచి పైడయ్యవలస వయా అదపాక వరకు(1.100 కి.మీ) రోడ్డుకు రూ.2.2 కోట్లు, కోష్ఠ హైవే జంక్షన్ నుంచి కొయ్యాం వరకు (1.80 కి.మీ) రూ.కోటి, ఆమ దాలవలస నియోజకవర్గంలోని చిలకపాలెం నుంచి రామభద్రపురం-రాయఘడ రోడ్డు(6.40 కి.మీ)కు రూ.2.75 కోట్లు, పాతపట్నంలో నౌతల-ముఖలింగం రోడ్డు (11.03 కి.మీ)కు రూ. 4.5 కోట్లు, టెక్కలిలో కోటబొమ్మాళి నుంచి సంతబొమ్మాళి వరకు (3.30 కి.మీ) రూ. 3.8 కోట్లు, నరసన్నపేట నియోజకవ ర్గంలోని లుకలాం నుంచి కొమ్మనాపల్లి వరకు (5.40 కి.మీ) రహదారికి రూ.2.5 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర రోడ్డు రవాణా భవనాల శాఖ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. మంత్రి అచ్చెన్న చొరవతో నిఽధుల విడుదల కావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.