Share News

TDP Janasena Alliance Friction: ఎమ్మెల్యేల కినుక

ABN , Publish Date - Apr 07 , 2025 | 04:38 AM

ఏఎంసీ చైర్మన్‌ పదవుల కేటాయింపులో జనసేనకు ప్రాధాన్యత ఇవ్వడం టీడీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి దారితీసింది. సిఫారసులు పట్టించుకోకపోవడంపై పలువురు ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

TDP Janasena Alliance Friction: ఎమ్మెల్యేల కినుక

  • నామినేటెడ్‌ పదవుల భర్తీపై అసంతృప్తి

  • రెండో విడతలో 6 ఏఎంసీలు జనసేనకు

  • ఆ ఆరుచోట్లా టీడీపీ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం

  • వారు సిఫారసు చేసిన నేతల పేర్లు పక్కకు

  • సమాచారం కూడా ఇవ్వని అధిష్ఠానం

  • అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలు

  • చంద్రబాబు దృష్టికి నామినేటెడ్‌ వ్యవహారం

  • పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాకు బుజ్జగింపుల బాధ్యత

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

నామినేటెడ్‌ పదవుల భర్తీపై టీడీపీ సీనియర్‌ నేతలు, ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల భర్తీ చేసిన వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ)ల విషయంలో తమ మాట చెల్లుబాటు కాకపోగా.. కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వకుండా జనసేనకు చైర్మన్‌ పదవులను కేటాయించడం ఏమిటని ఆరుగురు ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 218 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉండగా ప్రస్తుతానికి 85 కమిటీలకు చైర్మన్లను నియమించారు. వీటిలో టీడీపీకి 68, జనసేనకు 14, బీజేపీకి 3 ఏఏంసీలు దక్కాయి. పొత్తులో భాగంగా నామినేటెడ్‌ స్థానాల్లోనూ జనసేన, బీజేపీకి అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు ఇదే టీడీపీలో అసంతృప్తికి కారణమవుతోంది. అసంతృప్త ఎమ్మెల్యేల విషయం తెలుసుకున్న పార్టీ అధినేత చంద్రబాబు వారికి సర్దిచెప్పే బాధ్యతను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు అప్పగించారు. పొత్తులో ఉన్నప్పుడు సర్దుబాట్లు తప్పవని, రెండేళ్లు ఓపిక పడితే మనవారికి అవకాశం దక్కుతుందని అసంతృప్త ఎమ్మెల్యేలకు చెప్పాలని పల్లాను చంద్రబాబు ఆదేశించారు. రెండో విడతలో 6 ఏఎంసీలు జనసేనకు కేటాయించారు. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు తాము సిఫారసు చేసిన పేర్లను పక్కనపెట్టి జనసేనకు ఏఎంసీలు కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ నియోజకవర్గ పరిధిలోని ఏఎంసీలను భర్తీ చేసే సమయంలో కనీసం తమకు సమాచారం ఇవ్వాలన్న విషయాన్ని పార్టీ అధిష్ఠానం విస్మరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కనీసం తాము సిఫారసు చేసిన పేర్లను పక్కన పెడుతున్న విషయాన్ని కూడా తెలియజేయకపోవడం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు.పార్టీ తీరు కారణంగా నియోజకవర్గాల్లో తాము అవమానాలకు గురవుతున్నామని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యేలతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.

జనసేనలో జూనియర్లకు పదవులు

జనసేనలో మరీ జూనియర్లకు పదవులు దక్కుతుండటం కూడా టీడీపీ సీనియర్‌ నేతల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. టీడీపీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న సీనియర్‌ నాయకులకు సైతం పదవులు దక్కడం లేదని వాపోతున్నారు. జనసేనలో మాత్రం తమ కన్నా ఆలస్యంగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన వారికి పదవులు దక్కుతుండటాన్ని టీడీపీ సీనియర్‌ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ అధిష్ఠానం సైతం ఇలాంటి వారిని బుజ్జగించడంపై దృష్టి సారించడం లేదు.


ఆ ఆరుచోట్లా ఇదీ పరిస్థితి

  • డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గంలో ఉండి వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు చైర్మన్‌గా జనసేనకు చెందిన జుట్టుగ నాగరాజును నియమించారు. ఇక్కడ రఘురామ టీడీపీ నుంచి మరొకరి పేరును సిఫారసు చేశారు.

  • కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో గన్నవరం మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా జనసేనకు చెందిన గరికపాటి శివశంకర్‌ పేరును ప్రకటించారు. ఇక్కడ కూడా టీడీపీ నుంచి స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వేరే పేరును సిఫారసు చేశారు.

  • కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో పెడన వ్యవసాయ మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా జనసేనకు చెందిన అనంత లక్ష్మిని నియమించారు. ఇక్కడ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌ ఆ పార్టీ నుంచి వేరే పేరును పంపారు.

  • విశాఖపట్నం జిల్లాలో మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భీమునిపట్నం వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు టీడీపీ నుంచి ఒక పేరును సిఫారసు చేయగా జనసేనకు చెందిన రామస్వామి నాయుడు పేరు ప్రకటించారు.

  • శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో రాజాం వ్యవసాయ మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా జనసేనకు చెందిన పొగిరి కృష్ణవేణిని నియమించారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కొండ్రు మురళి టీడీపీకి చెందిన మరొకరి పేరు సిఫారసు చేశారు.

  • బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా కొత్తపల్లి వెంకటలక్ష్మి (జనసేన)ని నియమించారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు టీడీపీ నుంచి మరొకరి పేరు సిఫారసు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Krishna River Tragedy: పండగ వేళ ఘోర విషాదం.. కృష్ణానదిలో పడి.. బాబోయ్..

Mahesh Kumar Goud: మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా బండి సంజయ్ టిఫిన్ కూడా చెయ్యరు: మహేశ్ కుమార్ గౌడ్

Updated Date - Apr 07 , 2025 | 04:39 AM