Radio Announcer : ఆకాశవాణి విశ్రాంత అనౌన్సర్ ఏబీ ఆనంద్ మృతి
ABN , Publish Date - Feb 16 , 2025 | 04:13 AM
ఆకాశవాణి విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలలో అనౌన్సరుగా సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ పొందిన ఏబీ ఆనంద్..

విజయవాడ కల్చరల్, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): ఆకాశవాణి విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలలో అనౌన్సరుగా సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ పొందిన ఏబీ ఆనంద్ (86) శనివారం విజయవాడ మాచవరంలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య అరుణకుమారి, కుమారుడు ఎ.రమేష్, కుమార్తె సి.పద్మజ ఉన్నారు. ఆనంద్ అనౌన్సరుగానే కాక నటుడిగా, సంపాదకుడిగా, రచయితగా గుర్తింపు పొందారు. నాటక విభాగంలో నండూరి సుబ్బారావుతో కలిసి సిఫారసు, హరహరమహదేవ, భక్త శబరి, వివేకానంద, రారాజు వంటి ఎన్నో నాటికల్లో ముఖ్యపాత్రలు పోషించారు. ఎంతోమంది నటులను, రచయితలను ఆకాశవాణికి పరిచయం చేశారు. 80వ దశకంలో ‘అభిరుచి’ పేరుతో ఒక సాహిత్య కార్యక్రమం నిర్వహించారు. ‘మనజ్యోతి’ మాసపత్రిక నడిపారు. ఏబీ ఆనంద్ మృతి పట్ల మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ ప్రతినిధి కలిమిశ్రీ, నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రతినిధి చలపాక ప్రకాష్ సంతాపం ప్రకటించారు.