Share News

Vizag Steel Plant : ఉత్పత్తిలో ‘ఉక్కు’ సంకల్పం

ABN , Publish Date - Feb 05 , 2025 | 04:06 AM

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు కార్మికులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నా రు. ఉక్కు సంకల్పంతో వంద శాతానికి పైగా ఉత్పత్తి సాధించి తమ చిత్తశుద్ధిని, సత్తాను చాటుతున్నారు.

Vizag Steel Plant : ఉత్పత్తిలో ‘ఉక్కు’ సంకల్పం

  • అరకొర జీతాలు.. తక్కువ మంది సిబ్బంది

  • ముడిసరుకు లభ్యతా అంతంత మాత్రమే

  • ప్రతికూల పరిస్థితుల్లోనూ అత్యధిక ఉత్పత్తి

  • పది నెలల్లో 31 లక్షల టన్నుల హాట్‌ మెటల్‌

  • 2 బ్లాస్ట్‌ ఫర్నేస్‌లతోనే లక్ష్యాన్ని మించి ఉత్పత్తి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

మూడు నెలలుగా సరిగా జీతాలు లేవు.. తగినంత సిబ్బందీ లేరు.. అవసరమైన ముడి సరుకు సరఫరా అంతంత మాత్రమే.. అయినప్పటికీ విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు కార్మికులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నా రు. ఉక్కు సంకల్పంతో వంద శాతానికి పైగా ఉత్పత్తి సాధించి తమ చిత్తశుద్ధిని, సత్తాను చాటుతున్నారు.

కార్మికుల సమ్మెతో కష్టాలు..

2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభంతోనే స్టీల్‌ప్లాంటుకు కష్టాలు ప్రారంభమయ్యాయి. విదేశాల నుంచి నౌకల ద్వారా తెప్పించుకొనే కోకింగ్‌ కోల్‌ను ప్లాంటు లోపలకు కన్వేయర్‌ బెల్ట్‌ల ద్వారా సరఫరా చేసే గంగవరం పోర్టులో గతేడాది ఏప్రిల్‌ 12న కార్మికుల సమ్మె మొదలైంది. వారు కార్యకలాపాలన్నీ నిలిపివేయడంతో స్టీల్‌ప్లాంటుకు కోకింగ్‌ కోల్‌ ఆగిపోయింది. ఈ సమ్మె 35 రోజులు నడిచింది. ఆ సమయంలో ప్లాంటు అధికారులు గత 4 దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా కోల్‌ యార్డులన్నీ ఊడ్చి మరీ అందుబాటులో ఉన్న బొగ్గును ఉపయోగించుకున్నారు. ప్లాంటులో మొత్తం 3 బ్లాస్ట్‌ ఫర్నేస్‌ల ద్వారా రోజుకు 21 వేల టన్నుల హాట్‌ మెటల్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉండగా.. ఈ విపత్కర సమయంలో బొగ్గు లేక ఒక్క బ్లాస్ట్‌ ఫర్నేస్‌నే నడిపారు. దాని ద్వారా 7 వేల టన్నుల ఉత్పత్తి చేయాల్సి ఉండగా.. ముడి పదార్థాల సరఫరా లేక 4 వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి తీసిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల్లో(2024 ఏప్రిల్‌ నుంచి 2025 జనవరి వరకు) 3 బ్లాస్ట్‌ ఫర్నేసులు పూర్తిగా నడిచింది చాలా స్వల్ప కాలమే.


నవంబరు నుంచి రెండు బ్లాస్ట్‌ ఫర్నేస్‌లే నడుస్తున్నాయి. వాటికీ అరొకరగా ముడిపదార్థాలు సరఫరా చేస్తున్నారు. అయినప్పటికీ.. 100 శాతం అంటే రోజుకు 14 వేల టన్నులు దాటి ఉత్పత్తి చేస్తున్నారు.

అమ్మకాల ఆదాయం రూ.14,500 కోట్లు

3 బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు నడుపుతూ అత్యధికంగా ఉత్పత్తి సాధించిన సంవత్సరం 2021-22. ఆ ఏడాది 51 లక్షల టన్నుల హాట్‌ మెటల్‌ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఎక్కువ హాట్‌మెటల్‌ వచ్చిందని ప్లాంటు వర్గాలు చెబుతున్నాయి. ఈ 10 నెలల్లో కొంత కాలం ఒక బ్లాస్ట్‌ ఫర్నేస్‌, మరికొంత కాలం రెండు బ్లాస్ట్‌ ఫర్నేస్‌లే నడిచినా అంతిమంగా 31 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. ఇదే కాలంలో అమ్మకాలతో రూ.14,500 కోట్లు వచ్చింది.

అయినా అరకొర జీతాలే..

ఉక్కు ఉత్పత్తుల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో రూ.1,681 కోట్లు, మేలో రూ.1,088 కోట్లు, జూన్‌లో రూ.1,632 కోట్లు, జూలైలో రూ.1,607 కోట్లు, ఆగస్టులో రూ.1644 కోట్లు, సెప్టెంబరులో రూ.1,065 కోట్లు, అక్టోబరులో రూ.1,158 కోట్లు, నవంబరులో రూ.1,010 కోట్లు, డిసెంబరులో రూ.1,675 కోట్లు, జనవరిలో రూ.1,973 కోట్లు వచ్చాయి. అంటే సగటున నెలకు రూ.1,400-1500 కోట్ల ఆదాయం వచ్చింది. ప్లాంటులో 12,300 మంది శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి జీతాల కోసం నెలకు రూ.50 కోట్లు వరకు అవసరం. అయితే నెలకు రూ.1,400 కోట్లు అమ్మకాల ద్వారా వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా గత ఆగస్టు నుంచి వేధిస్తున్నారు. నెలకు 30 నుంచి 35 శాతం మాత్రమే ఇచ్చి మిగిలింది పెండింగ్‌ పెడుతున్నారు.


జనవరి నెల వరకు చూసుకుంటే ఒక్కో ఉద్యోగికి 300 శాతం జీతాలు రావాల్సి ఉంది. కుటుంబాలు ఆకలితో ఉన్నా ఉద్యోగులు అన్ని శక్తులూ ఒడ్డి 100 శాతం పైగా ఉత్పత్తి సాధిస్తున్నారు. ఈ కష్టాన్ని గుర్తించి సరిగ్గా జీతాలిస్తే ప్లాంటు అభివృద్ధికి కృషి చేస్తామని స్టీల్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి కేవీడీ ప్రసాద్‌ తెలిపారు.

స్టీల్‌ప్లాంట్‌ అప్పులు 39 వేల కోట్లు

లోక్‌సభలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ

గతేడాది డిసెంబరు చివరినాటికి విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు మొ త్తం అప్పులు రూ.38,965 కోట్లు ఉన్నాయని కేంద్ర ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. 2024 సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలలకు సంబంధించి ఉద్యోగులకు పాక్షిక వేతనాలు చెల్లించినట్లు తెలిపారు. లోక్‌సభలో మంగళవారం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అంశంపై ఎంపీలు వల్లభనేని బాలశౌరి, సీఎం రమేశ్‌ అడిగిన ఒక ప్రశ్నకు శ్రీనివాసవర్మ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం ఇటీవల ప్రకటించిన ప్యాకేజీలో రూ.10,300 కోట్లు ఈక్విటీ మూలధనంగా ఉంటుందని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం

శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 05 , 2025 | 04:06 AM