Share News

నేలబావిలో పడి ఆశ్రమ విద్యార్థి మృతి

ABN , Publish Date - Mar 14 , 2025 | 10:27 PM

మండల కేంద్రంలోని చిలకలమామిడిలో పాడుబడ్డ నేలబావి వద్ద స్నానానికి వెళ్లిన బాలుర ఆశ్రమ పాఠశాల-2 విద్యార్థి ఊబిలో కూరుకుపోయి మృతి చెందాడు.

నేలబావిలో పడి ఆశ్రమ విద్యార్థి మృతి
నేలబావిలో స్నానానికి వెళ్లి మృతి చెందిన యోసేపు

స్నానానికి వెళ్లి ఊబిలో చిక్కుకున్న బాలుడు

బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని

గిరిజన సంఘం ఆందోళన

చింతపల్లి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని చిలకలమామిడిలో పాడుబడ్డ నేలబావి వద్ద స్నానానికి వెళ్లిన బాలుర ఆశ్రమ పాఠశాల-2 విద్యార్థి ఊబిలో కూరుకుపోయి మృతి చెందాడు. ప్రత్యక్షసాక్షులు, బాధితుల కథనం ప్రకారం వివరాలిలా వున్నాయి. శుక్రవారం హోలి పండగ సెలవు కావడంతో స్థానిక బాలుర ఆశ్రమ పాఠశాల-2లో ఆరో తరగతి చదువుతున్న పాంగి యోసేపు (12), మరో ముగ్గురు విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేసి స్నానం చేసేందుకు చిలకలమామిడి పాడుబడ్డ నేలబావి వద్దకు వెళ్లారు. ముగ్గురు విద్యార్థులు అంచున ఈతకొడుతూ స్నానం చేస్తుండగా.. యేసేపు పొలం గట్టు నుంచి బావిలోకి దూకడంతో ఊబిలో కూరుకుపోయి మునిగిపోయాడు. ఈ విషయాన్ని తోటి విద్యార్థులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులకు చెప్పడంతో నేలబావి వద్దకు వెళ్లి స్థానికుల సహాయంతో విద్యార్థి మృతదేహాన్ని వెలికి తీశారు. ఉపాధ్యాయుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని సీఐ ఎం.వినోద్‌బాబు, ఎస్‌ఐలు వెంకటేశ్వరరావు, వెంకట రమణ సందర్శించారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. విద్యార్థి యోసేపు లోతుగెడ్డ పంచాయతీ మేడూరు స్వగ్రామం. విద్యార్థి తండ్రి లివ్‌ ఐదేళ్ల క్రితం మృతి చెందాడు. ప్రస్తుతం యోసేపు తల్లి రామి వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. రామికి మరో ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. విద్యార్థి మృతి చెందడంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నది.

మృతదేహంతో ఆందోళన

బాలుర ఆశ్రమ పాఠశాల-2 విద్యార్థి యేసేపు మృతికి ఉపాధ్యాయులు బాధ్యత వహించాలని, హెచ్‌ఎం, హెచ్‌డబ్ల్యూవోను సస్పెండ్‌ చేయాలని గిరిజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి జీవన్‌కృష్ణ డిమాండ్‌ చేశారు. విద్యార్థి మృతి విషయం తెలుసుకున్న గిరిజన సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థి కుటుంబ సభ్యులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యార్థి మృతదేహం వద్ద వారు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి జీవన్‌కృష విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థి మృతికి హెచ్‌ఎం, వార్డెన్‌ పూర్తి బాధ్యత వహించాలన్నారు. మృతుడు కుటుంబానికి రూ.30లక్షల నష్టపరిహారం చెల్లించడంతోపాటు బాలుడు తల్లికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో సీఐ ఎం. వినోద్‌బాబు ఆందోళనకారులను నచ్చజెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆందోళనలో గిరిజన సంఘం నాయకుడు రాంబాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకుడు కొర్ర కార్తిక్‌, మృతుడు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2025 | 10:27 PM