ఉబర్ బాదుడు
ABN , Publish Date - Mar 15 , 2025 | 01:20 AM
మొదట్లో తక్కువ చార్జీలతో సేవలు ప్రారంభించిన ‘ఉబర్’, ర్యాపిడో సంస్థలు ఇప్పుడు రేట్లు భారీగా పెంచేశాయి.

ఛార్జీలు పెంచేసిన సంస్థ
అదేబాటలో ర్యాపిడో...
ఖరీదైన్ ఫోన్ల నుంచి బుక్ చేస్తే మరింత అధికం
బుక్ చేసుకున్న వాహనం బదులు మరో వాహనం రాక
విశాఖపట్నం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి):
మొదట్లో తక్కువ చార్జీలతో సేవలు ప్రారంభించిన ‘ఉబర్’, ర్యాపిడో సంస్థలు ఇప్పుడు రేట్లు భారీగా పెంచేశాయి. ఇంతకు ముందు అంటే సుమారు నాలుగు నెలల క్రితం మద్దిలపాలెం డిపో ప్రాంతం నుంచి హనుమంతవాకలోని ఎల్‌వీ ప్రసాద్ ఆస్పత్రి, విమ్స్‌కు వెళ్లడానికి ఆటోలు రూ.56 నుంచి రూ.64 వరకు వసూలు చేసేవి. అటు నుంచి రూ.70 వరకు ఛార్జ్ చేసేవారు. ఇప్పుడు ఇటు నుంచి రూ.70, అటు నుంచి రూ.88 వసూలు చేస్తున్నారు. పైగా అటు నుంచి వచ్చేటపుడు ఎక్కువ ఛార్జీ కోసం ఆటోను ఇసుకతోట జంక్షన్ వద్ద యు టర్న్ తీసుకొని హెచ్‌బీ కాలనీ మీదుగా వెంకటేశ్వర స్వామి గుడి వరకు వెళ్లి అక్కడ ఎడమ మలుపు తీసుకొని కేఆర్‌ఎం కాలనీకి వెళ్లి అక్కడి నుంచి మద్దిలపాలెం తీసుకువెళుతున్నారు. ఇసుకతోట నుంచి మద్దిలపాలెం రావడానికి చక్కటి హైవే ఉండగా, యూ టర్న్ తీసుకొని హెచ్‌బీ కాలనీ, కేఆర్‌ఎం కాలనీ అంతా తిప్పుతున్నారు. దీనిపై డ్రైవర్లను ప్రశ్నిస్తే.. యాప్‌లో రూట్ ఎలా ఉంటే అలాగే వెళతామని సమాధానమిస్తున్నారు. ఇక్కడ రేట్లు పెంచడం ఒక సమస్య కాగా, మరొకటి నేరుగా గమ్యస్థానాలకు తీసుకువెళ్లకుండా చుట్టూ తిప్పడం.
గతంలో మద్దిలపాలెం నుంచి జడ్జి కోర్టు ఎదురుగా ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్‌కు, జగదాంబ సెంటర్‌కు వెళ్లడానికి రూ.60 నుంచి రూ.70 తీసుకునేవారు. ఇప్పుడు రూ.80 నుంచి రూ.98 వసూలు చేస్తున్నారు. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అక్కయ్యపాలెం ప్రాంతంలోని రామచంద్రానగర్‌కు ఆటోకు రూ.40 తీసుకునేవారు. ఇప్పుడు రూ.60 ఛార్జి వేస్తున్నారు. ర్యాపిడో ఎంవీపీ కాలనీ టీటీడీ కల్యాణ మండపం నుంచి బైక్‌పై సీతమ్మధార రైతుబజారుకు వెళ్లడానికి రూ.40 వసూలు చేస్తోంది. ఇంతకు ముందు రూ.25కే వచ్చేవారు.
ఒక వాహనానికి బదులు మరో వాహనం
ఎవరైనా ఉబర్‌లో ఆటోలు, కార్లు, ర్యాపిడోలో బైక్ బుక్ చేసుకుంటే ఎక్కువసార్లు యాప్‌లో చూపించిన నంబరు వాహనం కాకుండా వేరే నంబరు కలిగిన వాహనం వస్తోంది. దీనిపై డ్రైవర్లను ప్రశ్నిస్తే...అది రిపేర్‌లో ఉందని, అందుకే వేరే దాంట్లో వచ్చామని చెబుతున్నారు. మరికొందరైతే...సంస్థ ఓటీపీని ఎంటర్ చేశాక ఓకే చేసిందంటే...రైడర్‌గా తమను ఆమోదించినట్టేనని, ఏ వాహనమైనా ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. అయితే అనుకోని ప్రమాదాలు, ఇతర ఘటనలు ఏమైనా జరిగితే...యాప్‌లో చూపించే వాహనం నంబరు, ఘటన జరిగిన వాహనం నంబరు వేరుగా ఉంటాయి. ఇది వినియోగదారుల భద్రతకు సంబంధించిన విషయం.
ఐఫోన్లు, శ్యామ్‌సంగ్ ఫోన్లకు అధిక ఛార్జీలు
మద్దిపాలెం డిపో ప్రాంతం నుంచి ఎల్‌వీ ప్రసాద్ ఆస్పత్రికి వన్ ప్లస్ ఫోన్‌లో కారు బుక్ చేస్తే కేవలం రూ.124కే వస్తోంది. అదే శ్యామ్‌సంగ్ ఖరీదైన ఫోన్‌లో బుక్ చేస్తే రూ.156 చూపిస్తోంది. ఐఫోన్ల నుంచి చేసే బుకింగ్స్‌కు కూడా ఇదే విధంగా ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
నగదు ఇవ్వాలని డిమాండ్
ఇటీవల కాలంలో ఫోన్‌పే, గూగుల్ పే వాడకం పెరగడంతో టీలు, టిఫిన్లు, రైతుబజార్లలో కూడా ఇలాగే చెల్లింపులు జరుగుతున్నాయి. కానీ ‘ఉబర్’ మాత్రం ప్రత్యేకంగా ఆటోలకు నగదు చెల్లించాలంటూ గత రెండు వారాలుగా ప్రత్యేక మెసేజ్‌లు పెడుతోంది. ఇక్కడ చిల్లర సమస్యలు వస్తున్నాయి. యాప్ ద్వారా చెల్లిస్తే సంస్థ నుంచి డ్రైవర్లకు సకాలంలో డబ్బులు రావడం లేదని, కమీషన్లపై వివాదాలు కూడా తలెత్తుతున్నాయని పలువురు డ్రైవర్లు ఆరోపిస్తున్నారు.