సరియాలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం
ABN , Publish Date - Apr 14 , 2025 | 11:19 PM
మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన సరియా జలపాతం వద్ద ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆదివారం సాయంత్రం ఇక్కడ స్నానానికి దిగిన విశాఖపట్నానికి చెందిన ఇద్దరు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే.

వెలికితీసిన ఏపీ ఎస్‌డీఆర్‌ఎఫ్, స్థానికులు
జలపాతం వద్ద మిన్నంటిన ఆర్తనాదాలు
అనంతగిరి, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన సరియా జలపాతం వద్ద ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆదివారం సాయంత్రం ఇక్కడ స్నానానికి దిగిన విశాఖపట్నానికి చెందిన ఇద్దరు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం అరకు సీఐ హిమగిరి, తహసీల్దార్ మాణిక్యం, ఎస్‌ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏపీ ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, స్థానిక యువకులు గాలింపు చర్యలు చేపట్టారు. యువకులు గల్లంతైన ప్రదేశం సుమారు 40 అడుగుల లోతు, 15 అడుగుల వెడల్పు ఉంది. లోతు ఎక్కువగా ఉండడంతో కొంత వరకు మృతదేహాల వెలికితీతకు బృందాలు, స్థానిక యువకులు శ్రమించాల్సి వచ్చింది. ఆ ఇద్దరి మృతదేహాలు ఉదయం 10 గంటలలోపు లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కి తరలించారు.
విషాదం నింపిన బర్త్ డే పార్టీ
విశాఖపట్నం పూర్ణామార్కెట్ పండావీధికి చెందిన ఈలా వాసు(21) ఫ్లిప్‌కార్ట్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అతని తండ్రి ఆటో డ్రైవర్. అలాగే ఏవీఎన్ కళాశాల సమీపంలోని రెల్లివీధికి చెందిన వడ్డాది సత్యనరసింహమూర్తి(24) రోజువారీ కూలి. వీరితో పాటు మరో నలుగురు యువకులు సరియా జలపాతాన్ని తిలకించేందుకు విశాఖపట్నం నుంచి ఆదివారం ఉదయం కారులో వచ్చారు. ఈలా వాసు పుట్టిన రోజు ఈ నెల 6న జరిగింది. అయితే పుట్టిన రోజు వేడుకను సరియా జలపాతం వద్ద చేసుకుందామని నిర్ణయించుకుని ఈ నెల 13న వీరంతా ఇక్కడికి వచ్చారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సరదాగా గడిపారు. తిరిగి వెళ్లే సమయంలో వాసు, సత్యనరసింహమూర్తి ప్రమాదవశాత్తూ జలపాతం వద్ద జారిపడ్డారు. లోతు ఎక్కువగా ఉండడంతో క్షణాల్లో గల్లంతయ్యారు. విషయం తెలిసి మృతుల కుటుంబ సభ్యులు సోమవారం జలపాతం వద్దకు చేరుకున్నారు. అందివచ్చిన కుమారులు మృతి చెందడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.
పర్యాటకులకు అవగాహన
జలపాతం అందాలను వీక్షించండి.. కానీ అజాగ్రత్త వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సోమవారం సరియా జలపాతాన్ని తిలకించేందుకు వచ్చిన పర్యాటకులకు అరకు సీఐ హిమగిరి అవగాహన కల్పించారు. లోతుగా ఉండే ప్రదేశాల వద్ద డేంజర్ అని రాసి ఉంటుందని, పట్టించుకోకుండా వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని తెలిపారు. హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశామని, కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు అవగాహన కలిగి ఉండాలన్నారు. దూకుడుగా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, మద్యం సేవించి జలపాతంలోని దిగవద్దని హెచ్చరించారు.