గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన!
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:34 PM
ప్రజలకు మెరుగైన పౌరసేవలను అందించాలనే లక్ష్యంతో గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. జనాభా ప్రాతిపదికన సచివాలయాల్లోని సిబ్బందిని సర్దుబాటు చేసి ప్రజలకు నాణ్యమైన పౌరసేవలను అందించేందుకు సిద్ధమవుతున్నది.

జనాభా ప్రాతిపదికన ఉద్యోగుల సర్దుబాటు
ఇప్పటికే పూర్తి సమాచారం క్రోడీకరించిన యంత్రాంగం
మరో వారం రోజుల్లో కొత్త విధానం అమలు?
2500 మంది జనాభాకు ఆరుగురు,
2,500 నుంచి 3,500లోపు జనాభాకు ఏడుగురు,
3,500 పైబడిన జనాభాకు ఎనిమిది మంది సిబ్బంది
(పాడేరు-ఆంధ్రజ్యోతి)
ప్రజలకు మెరుగైన పౌరసేవలను అందించాలనే లక్ష్యంతో గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. జనాభా ప్రాతిపదికన సచివాలయాల్లోని సిబ్బందిని సర్దుబాటు చేసి ప్రజలకు నాణ్యమైన పౌరసేవలను అందించేందుకు సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా మూడు కేటగిరిల్లో సచివాలయాల సిబ్బందిని సర్దుబాటు చేయనున్నారు. 2,500 మందిలోపు జనాభాఽ ఉన్న సచివాలయంలో ఆరుగురు సిబ్బంది, 2,500 నుంచి 3,500 మంది సిబ్బంది ఉంటే ఏడుగురు, 3,500 పైబడి జనాభా ఉంటే 8 మంది సిబ్బందిని ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం మరో వారం రోజుల్లో సచివాలయాలను ప్రక్షాళన చేసి, నూతన విధానంలో సేవలు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు.
జిల్లాలో 352 సచివాలయాలు.. 2,813 మంది సిబ్బంది
జిల్లాలో పాడేరు, రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 22 మండలాల్లో 430 గ్రామ పంచాయతీల పరిఽధిలో 352 గ్రామ సచివాలయాలున్నాయి. వాస్తవానికి ప్రతి సచివాలయం పరిధిలో 11 మంది సిబ్బంది చొప్పున 3,892 మంది ఉండాలి. కాని సచివాలయాలను ఏర్పాటు చేసినప్పుడే 3,109 పోస్టులను మాత్రమే మంజూరు చేసి, 2,813 మంది సిబ్బందిని నియమించారు. దీంతో అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల్లోనే 296 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అలాగే జిల్లాలో ఉన్న 352 సచివాలయాలకు ప్రతి పోస్టు సమానంగా భర్తీ చేయాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా కొన్ని పోస్టులు మాత్రమే అన్నింటిలో ఉండగా.. అనేక పోస్టులు అరకొరగా భర్తీ చేశారు. ఉదాహరణకు ఏఎన్‌ఎం, డిజిటల్ అసిస్టెంట్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, గ్రామ సర్వేయర్లు, మహిళా పోలీస్ వంటి పోస్టులు సంపూర్ణంగా ఉండగా.. గ్రేడ్- 2 వీఆర్‌వో, సెరీకల్చర్, ఫిషరీస్, అగ్రికల్చయర్ అసిస్టెంట్‌ల పోస్టులు అరకొరగా భర్తీ చేశారు. దీంతో పలు సచివాలయాల్లో సిబ్బంది కొరత సమస్యగా మారింది. ఇదిలా ఉండగా గతం నుంచి ఉన్న సీనియర్ పంచాయతీ కార్యదర్శులు పెన్షన్ల పంపిణీలో పాల్గొనకుండా సచివాలయ సిబ్బందిపైనే భారం మోపుతున్నారు. వాస్తవానికి పెన్షన్ల పంపిణీపై అనుభవం ఉన్న పాత పంచాయతీ కార్యదర్శులను భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని పలువురు సిబ్బంది అంటున్నారు.
సచివాలయాల ప్రక్షాళనతో బహుళ ప్రయోజనం
గ్రామ సచివాలయాలను ప్రక్షాళన చేయడం ద్వారా బహుళ ప్రయోజనాలు కలుగుతాయని అధికారులు, సిబ్బంది అంటున్నారు. ప్రస్తుతం ఒక ప్రాతిపదిక లేకపోవడంతో ఉన్నచోట అధికంగా, లేనిచోట సిబ్బంది కొరత కారణంగా కొంతమంది సిబ్బందిపై పని భారం పడుతుండగా, మరి కొందరికి పని లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో సిబ్బంది మధ్య సఖ్యత లోపించడంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలు అందని దుస్థితి నెలకొంది. జిల్లాలో చింతూరు-1 గ్రామ సచివాలయంలో 4,040 మంది జనాభా ఉండగా, జి.మాడుగుల-2 గ్రామ సచివాలయంలో కేవలం 684 మంది మాత్రమే జనాభా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సిబ్బందికి , ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో జనాభా ప్రాతిపదికన సిబ్బందిని కేటాయించడం ద్వారా సిబ్బందికి పనిభారం తగ్గడంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయనే ఆలోచనతో ప్రక్షాళనకు సర్కారు చర్యలు చేపడుతున్నది. జిల్లాలోని మొత్తం 352 గ్రామ సచివాలయాలను మూడు కేటగిరిలో విభజించి సిబ్బందిని కేటాయించనున్నారు. 2,500 మందిలోపు జనాభా ఉన్న సచివాలయంలో ఆరుగురు సిబ్బంది, 2,500 నుంచి 3,500 మంది జనాభా ఉంటే ఏడుగురు, 3,500 పైబడి జనాభా ఉంటే 8 మంది సిబ్బందిని ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాలోని మొత్తం 352 సచివాలయాల్లో కేవలం 19 మాత్రమే 2,500 పైబడి జనాభా ఉండగా.. మిగిలిన 333 సచివాలయాల్లో 2,500 మంది లోపు జనాభా ఉన్నారు. దీంతో అధిక సంఖ్యలో సచివాలయాల్లో ఆరుగురు సిబ్బందిని పక్కాగా నియమించే అవకాశాలున్నాయి. దీంతో ఇన్నాళ్లు పనిభారంతో సతమతమవుతున్న సిబ్బందికి ఊరట కలగడంతోపాటు ప్రజలకు సకాలంలో పౌర సేవలు అందే పరిస్థితులు ఏర్పడతాయి. దీంతో సచివాలయల ప్రక్షాళన ప్రక్రియ తమకు, ప్రజలకు సైతం ఎంతో ప్రయోజనమని గ్రామ సచివాలయాల సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.