TTD: తిరుమలపై మరో దుష్ప్రచారం .. ఖండించిన టీటీడీ
ABN , Publish Date - Apr 11 , 2025 | 09:19 PM
TTD: తిరుమలలోని గోశాలలో వందాలాది ఆవులు మరణించాయంటూ జరుగుతోన్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. ఈ వార్తలను ఖండించింది. ఇవి పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటోలు... గోశాలకు సంబంధించినవి కావని పేర్కొంది.

తిరుమల, ఏప్రిల్ 11: తమ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో వందలాది ఆవులు మరణించాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఖండించింది. ఇది కేవలం పుకార్లు మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ తరహా ప్రచారం ద్వారా భక్తులు, ప్రజల మనోభావాలు దెబ్బ తీసే ప్రయత్నమని స్పష్టం చేసింది. భక్తులతోపాటు సాధారణ ప్రజలను ఇటువంటి నిరాధారమైన పుకార్లతో తప్పుదారి పట్టించ వద్దని టీటీడీ కోరింది. అన్ని జంతువుల శ్రేయస్సు కోసం తమ సంస్థ కట్టుబడి ఉందని పేర్కొంది. తమ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో అవులు మృతి చెందాయంటూ జరుగుతోన్న ప్రచారాన్ని ఖండిస్తూ శుక్రవారం టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సోషల్ మీడియాలో జరుగుతోన్న ఈ తరహా పుకార్లను టీటీడీ తీవ్రంగా ఖండించింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటోలు.. తమ గోశాలకు చెందినవి కావని పేర్కొంది. కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో ఈ తరహా చర్యలకు పాల్పడ్డారని విమర్శించింది. ఈ తరహా ప్రచారం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించి.. భక్తుల మనోభావాలను దెబ్బ తీసే లక్ష్యంతో ఈ ప్రయత్నం జరుగుతోన్నట్లుగా కనిపిస్తోందని టీటీడీ నొక్కి చెప్పింది. ఈ తరహా ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు ఈ సందర్భంగా సూచించింది.
మరోవైపు గోశాలలో ఆవుల సంరక్షణ కోసం నిర్వహణ సరిగ్గా లేదంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే 100కి పైగా ఆవులు మరణించాయని ఆయన ఆరోపించారు. ఇది ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. మరణించిన ఆవుల సంఖ్య భారీగా ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తమ నాయకుడు వైఎస్ జగన్ గతంలో ముఖ్యమంత్రిగా చేసిన మంచి పనులను తుడిచి పెట్టే ప్రయత్నంలో బిజీ బిజీగా ఉందని ఆయన వ్యంగ్యంగా ఆరోపించారు.
For AndhraPradesh News And Telugu News