Share News

Husband Kills Wife: భార్యను చంపి.. సెల్‌పోన్ చూస్తూ..

ABN , Publish Date - Apr 16 , 2025 | 01:09 AM

నిండు గర్భిణి అనూష (27) హత్య ఉదంతం నగరంలో కలకలం రేపింది. మహిళ హత్య కేసులో పోలీసులు చేపట్టిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Husband Kills Wife: భార్యను చంపి.. సెల్‌పోన్ చూస్తూ..

  • భార్యను, కడుపులో ఉన్న బిడ్డను చంపేసి, పక్కనున్న కుర్చీలో కూర్చుని సెల్‌ ఫోన్‌తో కాలక్షేపం

  • నిండు గర్భిణి హత్య కేసులో నివ్వెరపరచిన నిందితుడి వ్యవహారం

  • తొలి నుంచీ వదిలించుకునే యత్నం

  • మొదట బ్లడ్‌ క్యాన్సర్‌ బారినపడినట్టు నాటకం

  • ఆ తరువాత తన కుటుంబ సభ్యులు చంపేస్తారని బెదిరింపు

  • అవన్నీ విఫలం కావడంతోనే హత్యకు తెగించిన వైనం

  • మార్చురీ వద్ద గుండెలు అవిసేలా రోదించిన మృతురాలి కుటుంబ సభ్యులు, స్నేహితులు

  • కడుపులో ఆడబిడ్డ...పోస్టుమార్టం సమయంలో గుర్తింపు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): నిండు గర్భిణి అనూష (27) హత్య ఉదంతం నగరంలో కలకలం రేపింది. మంగళవారం కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. అక్కడకు వచ్చిన కుటుంబ సభ్యులు, స్నేహితులు గుండెలు అవిసేలా రోదించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి భూమిపైనే లేకుండా చేశాడంటూ వాపోయారు. ఆమెను వదిలించుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ప్రాణాలు తీసేందుకు తెగించాడన్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. వారు చెప్పిన వివరాల ప్రకారం...

అనకాపల్లి జిల్లా ఎస్‌.రాయవరం మండలానికి చెందిన అనూష నగరంలోని ఒక కాలేజీలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేసింది. ఆ సమయంలో స్నేహితుల ద్వారా జ్ఞానేశ్వర్‌ పరిచమయ్యాడు. స్నేహం కాస్త ప్రేమగా మారింది. వివాహానికి ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించారు. కానీ, జ్ఞానేశ్వర్‌ మాత్రం తమ కుటుంబ సభ్యుల అంగీకరించరని, పెళ్లి తరువాత చెబుదామని అనూషను ఒప్పించాడు. 2022 డిసెంబరు పదో తేదీన సింహాచలంలో అనూష కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వివాహమైన తరువాత ఎనిమిది నెలలపాటు ఇద్దరూ బాగానే ఉన్నారు. ఆ తరువాత నుంచి జ్ఞానేశ్వర్‌ అసలు రంగు బయటపడుతూ వచ్చింది.


పెళ్లి జరిగిన సుమారు ఏడాదికి తనకు బ్లడ్‌ కేన్సర్‌ ఉందని అనూషకు చెప్పాడు. తాను ఎక్కువ కాలం జీవించనని, తనను విడిచి వెళ్లిపోవాలని, నీ జీవితం నాశనం కాకూడదని అన్నాడు. అలా వదిలి వెళ్లబోనని, ఉన్నంత కాలం నీతోనే ఉంటానంటూ అనూష చెప్పినా...అతడు తన ప్రయత్నాలను ఆపలేదు. రక్తపు వాంతులు చేసుకున్నట్టు, తీవ్రమైన నీరసంతో బాధపడుతున్నట్టు నమ్మించే ప్రయత్నం చేశాడు. వైద్యం కోసమంటూ అనూష వద్ద ఉన్న డబ్బులు తీసుకున్నాడు. ఆ తరువాత అనారోగ్య సమస్యను పక్కనపెట్టి తన కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదని, నిన్ను చంపేస్తారంటూ అనూషను భయపెట్టడం మొదలుపెట్టాడు. ఇప్పటికైనా నీదారి నువ్వు చూసుకోవాలంటూ అనూషను వదిలించుకునే ప్రయత్నం చేశాడు.

murd.jpg

కానీ, అనూష ‘నాకు సర్వం నువ్వే. ప్రాణాలు పోయినా నిన్ను వదిలి వెళ్లను’ అని చెప్పింది. ఈ క్రమంలోనే అనూష గర్భం దాల్చింది. కొద్దిరోజులు అనూషను బాగానే చూసుకున్నట్టు నటించాడు. నాలుగు రోజుల కిందట ఫలూదా తీసుకువచ్చి అనూషకు ఇచ్చాడు. తాగే క్రమంలో ఒక టాబ్లెట్‌ బయటకు రావడంతో ఒక్కసారిగా అనూష షాక్‌ తింది. టాబ్లెట్‌ ఉన్న విషయాన్ని జ్ఞానేశ్వర్‌కు చెప్పి షాపునకు వెళ్లి నిలదీద్దామన్నది. దానికి సరేనన్న జ్ఞానేశ్వర్‌ టాబ్లెట్‌ పక్కన పెట్టాలని సూచించి బయటకు వెళ్లిపోయాడు. ఇదే విషయాన్ని అనూష కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా చెప్పింది. అప్పుడు కూడా జ్ఞానేశ్వర్‌పై అనుమానం రాలేదు. ప్రసవానికి సమయం దగ్గరపడడంతో ఆదివారం సాయంత్రం డాక్టర్‌ వద్దకు వెళ్లారు. ఆస్పత్రిలో చేరాలని వైద్యురాలు సూచించారు. అయితే, ఆదివారం ఎందుకు, సోమవారం చేరుదామని చెప్పి అనూషను ఇంటికి తీసుకువెళ్లాడు. అదేరోజు ఉదయం అనూష అమ్మమ్మ తుమ్మలపల్లి అన్నవరం కాకినాడ నుంచి వచ్చారు. రాత్రి ఆస్పత్రి నుంచి వచ్చిన ఇద్దరికీ అన్నం పెట్టింది. ఇద్దరూ రూమ్‌లోకి వెళ్లారు. అనూష అమ్మమ్మ హాల్‌లో పడుకుంది.


సోమవారం ఉదయం సుమారు ఆరు గంటల సమయంలో వాళ్లున్న గదిలోకి అనూష అమ్మమ్మ వెళ్లింది. అప్పటికీ నిద్రలో ఉన్నట్టు కనిపించిన అనూషను తట్టి లేపే ప్రయత్నం చేసింది. ఎంతసేపటికీ లేవకపోవడంతో పక్కనే కుర్చీలో కూర్చుని సెల్‌ఫోన్‌ చూసుకుంటున్న జ్ఞానేశ్వర్‌తో అమ్మాయి లేవడం లేదు...చూడాలని చెప్పింది. ఏమీ తెలియనట్టు చెంపలపై కొడుతూ లే అనూష...అంటూ నాటకాలాడే ప్రయత్నం చేశాడు. అనూష లేవడం లేదని, ఏమైందో తెలియడం లేదంటూ అనూష అమ్మమ్మకు చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన ఆమె ఎదురింటి వాళ్లను పిలిచింది. అనూష స్నేహితులకు జ్ఞానేశ్వర్‌ విషయాన్ని తెలియజేయడంతో వారంతా ఇంటికి చేరుకున్నారు. తొలుత దగ్గరలోని రెండు ఆస్పత్రులకు కారులో తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు లేకపోవడంతో కేర్‌కు తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు చనిపోయిందని నిర్ధారించారు. అనూష తనను విడిచి వెళ్లిపోయిందని, తాను ఎలా బతకాలంటూ జ్ఞానేశ్వర్‌ నాటకాన్ని రక్తికట్టించే ప్రయత్నం చేశాడు.

గాయాలతో అనుమానం..

కేర్‌ నుంచి అనూషను ఇంటికి తీసుకువెళ్లిపోయేందుకు జ్ఞానేశ్వర్‌ ప్రయత్నించాడు. అయితే, జ్ఞానేశ్వర్‌ ముఖం, చేతిపై గాయాలు ఉండడాన్ని గుర్తించిన అనూష స్నేహితుడు ఆదర్శ్‌కు అనుమానం వచ్చింది. తన తల్లిని కేర్‌ ఆస్పత్రికి రమ్మని చెప్పాడు. ఆమె కేజీహెచ్‌లో పనిచేస్తున్నారు. మెడపై కొన్ని మచ్చలు ఉండడం, శరీరం పూర్తిగా నల్లగా మారిపోవడంతో కేజీహెచ్‌కు తీసుకువెళదామని ఆమె చెప్పారు. దానికి జ్ఞానేశ్వర్‌ వద్దంటూ వారించే ప్రయత్నం చేశాడు. కానీ, అంతా తీసుకువెళ్లాల్సిందేనని పట్టుబట్టడంతో వారితోపాటు అంబులెన్స్‌లో ఎక్కి కేజీహెచ్‌కు వెళ్లాడు. అక్కడి వైద్యులు కూడా చనిపోయిందని నిర్ధారించడంతో కుటుంబ సభ్యులతోపాటు స్నేహితులు గట్టిగా అడగడంతో తొలుత తానే చంపేశానని చెప్పాడు. ఆ తరువాత ఉరి వేసుకుందని చెప్పాడు. మళ్లీ గట్టిగా అడగడంతో తనకు ఇష్టం లేదని అందుకు చంపేసినట్టు అంగీకరించాడు. అమ్మాయికి పెళ్లి జరిగినప్పుడు తనకు ఆరోగ్యం బాలేదని, కోమాలో ఉన్నానని, ఇప్పుడు తన బిడ్డను పూర్తిగా దూరం చేశాడని ఆమె తల్లి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డకు ప్రసవం సమయంలో తోడుగా ఉండాలని వచ్చానని, తాను ఇంట్లో ఉండగానే బిడ్డ ప్రాణాలు తీసేశాడని అనూష అమ్మమ్మ అన్నవరం విలపించారు.


అంత్యక్రియలు పూర్తి..

అనూష కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు జ్ఞానేశ్వర్‌ కుటుంబ సభ్యులు మంగళవారం మధ్యాహ్నం కేజీహెచ్‌ మార్చురీ వద్దకు వచ్చారు. వారి డిమాండ్‌ మేరకు అనూషను వారి స్వగ్రామమైన దువ్వాడ తీసుకువెళ్లి వారి కోడలిగా అంత్యక్రియలను నిర్వహించారు. పోయిన ప్రాణాన్ని తాము తీసుకురాలేకపోయినా వారి ఇంటి కోడలిగా గుర్తింపు తెచ్చుకోవాలని భావించిన అనూషకు అక్కడే అంత్యక్రియలు నిర్వహించడం ద్వారా ఆత్మశాంతి కలిగించే ప్రయత్నం చేశామని అనూష మరిది స్వరూప్‌ తెలిపారు. ఇకపోతే, అనూష గర్భంలో ఆడ బిడ్డ ఉన్నట్టు పోస్టుమార్టం సమయంలో తేలింది.

Updated Date - Apr 16 , 2025 | 11:44 AM