Share News

కాంట్రాక్టు కార్మికుల తొలగింపు చట్ట విరుద్ధం

ABN , Publish Date - Apr 06 , 2025 | 12:07 AM

స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్టు కార్మికుల తొలగింపు చట్ట విరుద్ధమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌ అన్నారు. కాంట్రాక్టు కార్మికుల తొలగింపును నిరసిస్తూ కాంట్రాక్టు కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో శనివారం రాత్రి రాస్తారోకోకు యత్నించారు. అయితే భారీ ఎత్తున పోలీసులు మోహరించి రహదారిపైకి నాయకులు, కార్మికులు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

కాంట్రాక్టు కార్మికుల తొలగింపు చట్ట విరుద్ధం
రాస్తారోకో చేయకుండా ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు

కేంద్రం యత్నాలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలి

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌

రాస్తారోకో చేయకుండా నాయకులు, కార్మికులను అడ్డుకున్న పోలీసులు

కూర్మన్నపాలెం, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్టు కార్మికుల తొలగింపు చట్ట విరుద్ధమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌ అన్నారు. కాంట్రాక్టు కార్మికుల తొలగింపును నిరసిస్తూ కాంట్రాక్టు కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో శనివారం రాత్రి రాస్తారోకోకు యత్నించారు. అయితే భారీ ఎత్తున పోలీసులు మోహరించి రహదారిపైకి నాయకులు, కార్మికులు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్లు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల తొలగింపును తక్షణమే ఆపాలని, నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని, స్టీల్‌ప్లాంటును సెయిల్‌లో విలీనం చేయాలనీ, తొలగించిన కాంట్రాక్టు కార్మికులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే పూర్తి స్థాయిలో వేతనాలను చెల్లించడంతో పాటు బకాయిలను ఇవ్వాలన్నారు. ప్లాంటును ప్రైవేటీకరించేందుకు కేంద్రం చేస్తున్న యత్నాలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని కోరారు. కార్పొరేటర్‌ గంగారామ్‌, సీపీఎం నాయకుడు కేఎం శ్రీనివాస్‌లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఇంత దారుణమైన కార్మికుల తొలగింపును మునుపెన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటాలను, నాయకులను అణచివేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కాంట్రాక్టు కార్మికులను ఏ ఒక్కరినీ తొలగించరాదని డిమాండ్‌ చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రభుత్వాలు తేలికగా తీసుకుంటే కార్మికుల ఆగ్రహ జ్వాలలను చూడాల్సి వస్తుందన్నారు. ఉక్కు పరిరక్షణకు అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు. కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు జె.రామకృష్ణ, కేఎస్‌ఎన్‌ రావు, దొమ్మేటి అప్పారావు, యు.రామస్వామి, బాబూరావు, పి.భాస్కరరావు, నమ్మి సింహాద్రి, అలీషా, నమ్మి రమణ, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. కాగా సౌత్‌ సబ్‌ డివిజన్‌, హార్బర్‌, వెస్ట్‌ డివిజన్‌కు సంబంధించిన పోలీసులు అధిక సంఖ్యలో మోహరించారు.

Updated Date - Apr 06 , 2025 | 12:07 AM