పంచాయతీల సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Apr 09 , 2025 | 01:02 AM
పంచాయతీల సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తెలిపారు. మంగళవారం పవన్‌కల్యాణ్ బస చేసిన రైల్వే అతిథి గృహానికి రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం నాయకులు, జిల్లాలోని సర్పంచులు వెళ్లి ఆయనను కలిశారు. పంచాయతీలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. విద్యుత్ బిల్లులపై వడ్డీలు వేసి మరీ పంపుతుండడంతో పంచాయతీలు ఇబ్బందులు పడుతున్నాయని, మైనర్ పంచాయతీలకు ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని డిప్యూటీ సీఎంను వారు కోరారు. గిరిజన గూడెం/తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించి నిధులు మంజూరు చేయాలని అభ్యర్థించారు.

- సర్పంచులకు డిప్యూటీ సీఎం హామీ
అరకులోయ, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): పంచాయతీల సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తెలిపారు. మంగళవారం పవన్‌కల్యాణ్ బస చేసిన రైల్వే అతిథి గృహానికి రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం నాయకులు, జిల్లాలోని సర్పంచులు వెళ్లి ఆయనను కలిశారు. పంచాయతీలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. విద్యుత్ బిల్లులపై వడ్డీలు వేసి మరీ పంపుతుండడంతో పంచాయతీలు ఇబ్బందులు పడుతున్నాయని, మైనర్ పంచాయతీలకు ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని డిప్యూటీ సీఎంను వారు కోరారు. గిరిజన గూడెం/తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించి నిధులు మంజూరు చేయాలని అభ్యర్థించారు. గిరిజన గ్రామాల్లో ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే సహాయాన్ని రూ.5 లక్షలకు పెంచాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని కోరారు. పంచాయతీల సమస్యలపై మంత్రివర్గంలో చర్చించి అవకాశం ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని పవన్‌కల్యాణ్ హామీ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధి, మౌలిక వసతుల కల్పనపై చర్చించేందుకు గిరిజన గ్రామాల సర్పంచులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తానని ఆయన తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్రం నుంచి రావలసిన నిధుల విడుదల అంశంలోనూ సానుకూలంగా స్పందించారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, అఖిల భారత పంచాయతీ పరిషత్ ఉపాధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు, అనంతగిరి జడ్పీటీసీ దీసరి గంగరాజు, గిరిజన గ్రామాలకు చెందిన సర్పంచులు పాంగి సునీత, సురేశ్, పి.సునీత, పి.దాసుబాబు, తదితరులు ఉన్నారు.