Share News

గ్రేటర్‌లో మారుతున్న సమీకరణాలు

ABN , Publish Date - Apr 16 , 2025 | 01:06 AM

జీవీఎంసీ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానానికి ముహూర్తం దగ్గరపడుతున్నకొద్దీ కౌన్సిల్‌లో సమీకరణాలు మారుతున్నాయి.

గ్రేటర్‌లో మారుతున్న సమీకరణాలు

  • వైసీపీ నుంచి జనసేనలోకి ముగ్గురు కార్పొరేటర్లు

  • 75కి చేరిన కూటమి బలం

  • మేజిక్‌ ఫిగర్‌ దాటడంతో 19న అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందని

  • నేతల విశ్వాసం

  • మరోవైపు కూటమి కార్పొరేటర్లతో వైసీపీ సంప్రతింపులు జరుపుతున్నట్టు ప్రచారం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానానికి ముహూర్తం దగ్గరపడుతున్నకొద్దీ కౌన్సిల్‌లో సమీకరణాలు మారుతున్నాయి. వైసీపీ కార్పొరేటర్లు ముగ్గురు తాజాగా జనసేనలో చేరిపోవడంతో అవిశ్వాసం నెగ్గేందుకు కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ను కూటమి దాటినట్టేనని అంతా అనుకున్నారు. అయితే కూటమిలో కొందరు కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నట్టు తెలిసి ఇప్పుడు నేతలు ఆందోళన చెందుతున్నారు.

నాలుగేళ్ల కిందట జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక వార్డులను గెలుచుకోవడంతో మేయర్‌గా గొలగాని హరివెంకటకుమారిని ఎంపిక చేశారు. అయితే గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారం దక్కించుకోవడంతో కౌన్సిల్‌లో బలాబలాలు తారుమారయ్యాయి. వైసీపీకి చెందిన కార్పొరేటర్లు 30 మంది టీడీపీ, జనసేన, బీజేపీలో చేరిపోయారు. అలాగే అప్పటివరకూ వైసీపీకి మద్దతు ఇచ్చిన ముగ్గురు ఇండిపెండెంట్‌ కార్పొరేటర్లు ప్రస్తుతం టీడీపీ, జనసేన వైపు చేరారు. దీంతో కౌన్సిల్‌లో వైసీపీ బలం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో మేయర్‌పై అవిశ్వాసం ప్రకటిస్తూ కూటమి కార్పొరేటర్లు జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌గా ఉన్న జిల్లా కలెక్టర్‌కు నోటీస్‌ ఇవ్వగా, ఈనెల 19న ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించారు. జిల్లా కలెక్టర్‌ నుంచి ప్రకటన రాగానే వైసీపీ నేతలు తమ కార్పొరేటర్లను బెంగళూరు, శ్రీలంక క్యాంపులకు తరలించారు. అవిశ్వాసం నెగ్గాలంటే ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలుపుకుని కూటమికి 74 మంది సభ్యులు అవసరం. కానీ కూటమి వద్ద అప్పటికి 72 మంది సభ్యులు మాత్రమే ఉండడంతో సంఖ్యా బలం పెంచుకోవడంపై నేతలు దృష్టిపెట్టారు. ఈలోగా తమ కార్పొరేటర్లను చేజారకుండా కాపాడుకునేందుకు కొద్దిరోజుల కిందట మలేషియా తరలించారు. వైసీపీకి చెందిన మరో ఇద్దరు కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు సాగించగా, సోమవారం నాటికి ముగ్గురిని కూటమిలోకి చేర్చుకోగలిగారు. దీంతో మేజిక్‌ ఫిగర్‌ కంటే ఒకరు అదనంగా ఉండడంతో ఈనెల 19 అవిశ్వాస తీర్మానం నెగ్గడం ఖాయమని కూటమి నేతలు ఊపిరిపీల్చుకున్నారు.

ఆందోళనకు గురిచేస్తున్న అసంతృప్తులు

అవిశ్వాస తీర్మానం నెగ్గకుండా చేసేందుకు వైసీపీ నేతలు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. టీడీపీ, జనసేన కార్పొరేటర్లతోపాటు ఇటీవల ఆయా పార్టీల్లో చేరిన వైసీపీ కార్పొరేటర్లలో అసంతృప్తితో ఉన్నవారిని గుర్తించే పనిలోపడ్డారు. గాజువాక ప్రాంతానికి చెందిన టీడీపీ కార్పొరేటర్‌ ఒకరు గత కొద్దిరోజులుగా వాట్సాప్‌లో టీడీపీ నేతలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఆయనతో వైసీపీ నేతలు సంప్రతింపులు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే ఇటీవల జనసేనలో చేరిన మహిళా కార్పొరేటర్‌ భర్త ఒకరు కూటమి నేతలపై అసంతృప్త గళం విప్పుతున్నట్టు సమాచారం. దీంతో ఆయన్ను కూడా వైసీపీ నేతలు కలిసినట్టు సమాచారం. ఇలాంటి ప్రచారం నేపథ్యంలో ఇప్పుడిప్పుడు ఊపిరిపీల్చుకుంటున్న కూటమి నేతల్లో ఆందోళన మొదలైందంటున్నారు.

ఓటింగ్‌కు వామపక్షాలు దూరం

అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 19న జరగనున్నసమావేశానికి హాజరుకాబోమని సీపీఎం, సీపీఐ నేతల ప్రకటన

విశాఖపట్నం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజోతి):

జీవీఎంసీ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారిపై కూటమి కార్పొరేటర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీస్‌పై ఈనెల 19న జరిగే కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశానికి సీపీఐ, సీపీఎం కార్పొరేటర్లు హాజరుకారని రెండు పార్టీల నేతలు ప్రకటించారు. జగదాంబ జంక్షన్‌లోని సీఐటీయూ కార్యాలయంలో సీపీఐ కార్పొరేటర్‌ ఏజే స్టాలిన్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం. జగ్గునాయుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేయర్‌, డిప్యూటీ మేయర్‌లపై అవిశ్వాస తీర్మానాలకు సంబంధించిన ఓటింగ్‌లోనూ పాల్గొనకూడదని నిర్ణయించుకున్నామన్నారు. ఏపీకి బీజేపీ తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు. స్టీల్‌ప్లాంటు సహా అనేక ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేటీకరిస్తోందని విమర్శించారు. అలాంటి బీజేపీతో టీడీపీ, జనసేన కలిసి కూటమిగా కొనసాగడం రాష్ట్రానికి ప్రధానంగా జిల్లాకు తీరని నష్టం కాబట్టి అలాంటి కూటమి నిర్ణయాల్లో భాగస్వామ్యులు కావడం తమకు ఇష్టం లేదన్నారు. ప్రజల పక్షాన పోరాడే సీపీఐ, సీపీఎం కార్పొరేటర్లు ప్రస్తుతం జీవీఎంసీలో ఏ పార్టీని బలపరిచేపరిస్థితి లేదన్నారు. స్వార్థ రాజకీయాల కోసం కార్పొరేటర్లను అవినీతి సరకుగా మార్చేసిన టీడీపీ, వైసీపీలను తిరస్కరించాలని నగరవాసులను కోరుతున్నామన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 01:06 AM