Share News

15 నుంచి నెలాఖరు వరకూ ఉక్కు ఉద్యోగులకు సెలవులు కట్‌

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:55 AM

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటులో ఈ నెల 15వ తేదీ నుంచి నెలాఖరు వరకు ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నట్టు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (వర్క్స్‌) శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

15 నుంచి నెలాఖరు వరకూ ఉక్కు ఉద్యోగులకు సెలవులు కట్‌

కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మె నేపథ్యంలో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (వర్క్స్‌) ఉత్తర్వులు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటులో ఈ నెల 15వ తేదీ నుంచి నెలాఖరు వరకు ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నట్టు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (వర్క్స్‌) శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రతి ఒక్కరూ విధుల్లో ఉండాల్సిందేనని స్పష్టంచేశారు. పూర్తిస్థాయిలో ఉత్పత్తి సాధించాల్సిన అవసరం ఉన్నందున ఈ ఆదేశాలు ఇచ్చామన్నారు. తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఉంటే తప్ప ఎవరికీ సెలవు ఇవ్వబోమని అందులో పేర్కొన్నారు.

కాంట్రాక్టు కార్మికుల సమ్మె నేపథ్యంలోనే...

స్టీల్‌ప్లాంటులో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య తగ్గించేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది. ఇటీవలె 1,500 మందిని నిలిపివేసింది. కాంట్రాక్టులను రెన్యువల్‌ చేయకుండా పరోక్షంగా కార్మికుల ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తోంది. ఈ చర్యలను నిరసిస్తూ కాంట్రాక్టు కార్మికులు ఈ నెల 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ప్లాంటులో సుమారు 13 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. వారంతా సమ్మెలో పాల్గొంటే అనేక విభాగాల్లో కీలకమైన పనులు ఆగిపోతాయి. అలాంటి పరిస్థితి రాకూడదనే శాశ్వత ఉద్యోగులు పది వేల మంది సెలవు పెట్టకుండా విధులకు రావాలని సీజీఎం ఆర్డర్‌ వేశారు. సమ్మె వల్ల ఉత్పత్తిపై ప్రభావం పడకూడదని, ఎప్పటిలాగే రెండు బ్లాస్ట్‌ ఫర్నేసుల ద్వారా పూర్తి ఉత్పత్తి తీయాలని ఆయన చెబుతున్నారు. కార్మికుల సమ్మె వల్ల ప్లాంటు ఉత్పత్తిపై ఎటువంటి ప్రభావం లేదని చెప్పడానికి యాజమాన్యం ఈ తరహా నిర్ణయాలు తీసుకొని, ఉద్యోగులపై ఒత్తిడి పెడుతోంది. దీనిపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే యాజమాన్యం చెప్పిన మాట వినకపోతే తప్పనిసరి రిటైర్‌మెంట్‌ నోటీసుతో ఇంటికి పంపించేందుకు సిద్ధమైంది. ఆ భయంతో ఎవరూ నోరెత్తలేకపోతున్నారు. ఈ నిర్ణయాల వల్ల ఎటువంటి దుష్పరిణామాలు సంభవిస్తాయోనని అంతా భయపడుతున్నారు.

Updated Date - Apr 12 , 2025 | 12:55 AM