Share News

సఖ్యతగా లేకుంటే నష్టపోతాం

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:28 AM

టీడీపీ అరకు అసెంబ్లీ నియోజకవర్గ నేతలు దొన్నుదొర, కిడారి శ్రావణ్‌కుమార్‌లు సమన్వయంతో పని చేయకపోవడంతో వర్గపోరు ఎక్కువైపోతోందని, దీని వల్ల పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆ పార్టీ నాయకుడు, పెదలబుడు సర్పంచ్‌ పెట్టెలి దాసుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో మంగళవారం అరకు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ సంస్థాగత సమావేశాన్ని నియోజకవర్గ ఇన్‌చార్జి దొన్నుదొర అధ్యక్షతన నిర్వహించారు.

సఖ్యతగా లేకుంటే నష్టపోతాం
మాట్లాడుతున్న పెదలబుడు సర్పంచ్‌ దాసుబాబు. చిత్రంలో దొన్నుదొర, తదితరులు

- అధిష్ఠానం అందలమెక్కించినా వేరుకుంపట్లు ఎందుకు?

- పార్టీ నాయకులు, కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకురాకుండా వర్గపోరు ఏమిటి?

- టీడీపీ నేతలు దొన్నుదొర, కిడారి శ్రావణ్‌కుమార్‌ను ఉద్దేశించి పెదలబుడు సర్పంచ్‌ దాసుబాబు ఘాటు వ్యాఖ్యలు

అరకులోయ, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): టీడీపీ అరకు అసెంబ్లీ నియోజకవర్గ నేతలు దొన్నుదొర, కిడారి శ్రావణ్‌కుమార్‌లు సమన్వయంతో పని చేయకపోవడంతో వర్గపోరు ఎక్కువైపోతోందని, దీని వల్ల పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆ పార్టీ నాయకుడు, పెదలబుడు సర్పంచ్‌ పెట్టెలి దాసుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో మంగళవారం అరకు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ సంస్థాగత సమావేశాన్ని నియోజకవర్గ ఇన్‌చార్జి దొన్నుదొర అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా దాసుబాబు మాట్లాడుతూ గత ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో భాగంగా అరకు సీటును బీజేపీకి కేటాయించినా, అధికారంలోకి వచ్చాక అధిష్ఠానం దొన్నుదొర, కిడారి శ్రావణ్‌కుమార్‌లకు చైర్మన్‌ పదవులు ఇచ్చి గౌరవించిందన్నారు. ఆ ఇద్దరూ పార్టీ పటిష్ఠతకు కృషి చేయాల్సిందిపోయి, ఇంకా వర్గాలుగా వ్యవహరించడం ఏమిటని నిలదీశారు. ఇలాగే ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా విజయం సాధిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సమావేశానికి కిడారి శ్రావణ్‌కుమార్‌ రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఇప్పటికైనా ఇద్దరు నేతలు కలిసి పనిచేసి నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాలని కోరారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా విజయం సాధించాలో పార్టీ శ్రేణులకు దొన్నుదొర దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఆరు మండలాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 12:28 AM