కృష్ణ కిరీటం కనువిందు
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:48 AM
నారింజ, ఎరుపు వర్ణంలో చిన్న చిన్న పూలతో అడుగు పొడవు కలిగిన కృష్ణ కిరీటం పూలు ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఆర్‌వీనగర్ అటవీ అభివృద్ధి సంస్థ(కాఫీ) ఉత్తర, దక్షిణ డివిజన్ కార్యాలయం ఆవరణలో కృష్ణ కిరీటం మొక్కలు ఉన్నాయి.

- తొలకరి వర్షాలు కురవడంతో ఆకర్షణీయంగా పూలు
చింతపల్లి, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): నారింజ, ఎరుపు వర్ణంలో చిన్న చిన్న పూలతో అడుగు పొడవు కలిగిన కృష్ణ కిరీటం పూలు ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఆర్‌వీనగర్ అటవీ అభివృద్ధి సంస్థ(కాఫీ) ఉత్తర, దక్షిణ డివిజన్ కార్యాలయం ఆవరణలో కృష్ణ కిరీటం మొక్కలు ఉన్నాయి. సాధారణంగా జూన్ నుంచి ఆగస్టు వరకు ఈ పూలు కనిపిస్తుంటాయి. అయితే ఈ ఏడాది తొలకరి వర్షాలు కురవడంతో ఈ పూలు ప్రస్తుతం విరబూశాయి. కృష్ణ కిరీటం పూలు పిరమిడ్ ఆకారంలో ఉండడంతో ఆరెంజ్ టవర్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం క్లీరో డెండ్రమ్ పానిక్యులేటమ్. ఈ పూలు వర్షాకాలం, శీతాకాలంలో అధికంగా కనిపిస్తాయి. వేసవిలో అడపాదడపా కనిపిస్తాయి. ఈ పూలు నెల రోజులకు పైగా ఆకర్షణీయంగా ఉంటాయి, త్వరగా వాడిపోవు. ఈ మొక్క ఆకులు పెద్దవి గానూ, ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ మొక్కల్లో ఔషధ గుణాలు కూడా అధికంగా ఉంటాయి. ఆయుర్వేద వైద్యంలో ఈ మొక్క వేర్లు, ఆకులు, పూలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ఏపీఎఫ్‌డీసీ కార్యాలయం వద్దనున్న కృష్ణ కిరీటం పూలు ఆకర్షణీయంగా కనిపిస్తుండడంతో పర్యాటకులు వీటి వద్ద ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.