Share News

సమగ్ర గిరిజనాభివృద్ధే లక్ష్యంగా చర్యలు

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:58 AM

సమగ్ర గిరిజనాభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) అధ్యక్షురాలు, అరకులోయ ఎంపీ డాక్టర్‌ జి.తనూజారాణి ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన దిశ కమిటీ సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ ఏజెన్సీలో చిరు ధాన్యాలతో ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసి గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.

సమగ్ర గిరిజనాభివృద్ధే లక్ష్యంగా చర్యలు
నాబార్డు పొటెన్షియల్‌ లింక్‌ క్రెడిట్‌ ప్లాన్‌ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఎంపీ తనూజారాణి, కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ తదితరులు

- దిశ కమిటీ అధ్యక్షురాలు, అరకులోయ ఎంపీ డాక్టర్‌ తనూజారాణి

- కలెక్టరేట్‌లో అధికారులతో దిశ కమిటీ సమావేశం

పాడేరు, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): సమగ్ర గిరిజనాభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) అధ్యక్షురాలు, అరకులోయ ఎంపీ డాక్టర్‌ జి.తనూజారాణి ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన దిశ కమిటీ సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ ఏజెన్సీలో చిరు ధాన్యాలతో ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసి గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. జాతీయ రహదారి పనుల్లో ధ్వంసమైన చెక్‌డ్యామ్‌లు, తాగునీటి పైపులైన్లు మరమ్మతులు చేయాలని హైవే అధికారులను ఆదేశించారు. గిరి రైతులకు ఉపయోగపడే వ్యవసాయ ఉపకరణాలు పంపిణీ చేయాలని, నాబార్డు ద్వారా అమలు చేస్తున్న పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. జిల్లాలో ఉన్న అంబులెన్సుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తొలి విడతలో 10 అంబులెన్సులను మంజూరు చేస్తామని, వాటిని గర్భిణుల కోసం వినియోగించాలన్నారు. అరకులోయలో 21 వేల మంది విద్యార్థులతో 108 సూర్య నమస్కారాల కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ను ఎంపీ అభినందించారు.

ఆర్గానిక్‌ జిల్లాగా ప్రకటించేందుకు కృషి చేయాలి

జిల్లాలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఆర్గానిక్‌ జిల్లాగా ప్రకటించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ కోరారు. ప్రణాళికాబద్ధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని, వ్యవసాయ ఉపకరణాలను లబ్ధిదారులకు పంపిణీ చేసే క్రమంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో చర్చించి అవసరమైన ఉపకరణాలు పంపిణీ చేయాలని సూచించారు. జాతీయ రహదారి పక్కన ఉన్న పంట భూముల్లో వ్యర్థాలను వేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై చర్యలు చేపట్టాలని జాతీయ రహదారి ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. లంబసింగి నుంచి పాడేరు వరకు జరుగుతున్న హైవే పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. అరకు బైపాస్‌ రోడ్డు, పెండింగ్‌లో ఉన్న ఇతర రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఏజెన్సీలో లక్ష ఎకరాల్లో కాఫీ తోటల పెంపకానికి అవసరమైన నీడ తోటల పెంపకానికి నర్సరీలు పెంచాలన్నారు. కడియం నర్సరీల నుంచి రూ.25 కోట్లతో మొక్కలు కొనుగోలు చేస్తున్నామన్నారు. జిల్లాలో పరిశ్రమల పార్కులు ఏర్పాటు చేస్తామని, జల్‌ జీవన్‌ మిషన్‌లో తాగునీటి సరఫరా సక్రమంగా చేయాలని, ట్యాప్‌లు బిగిస్తే సరిపోదని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఉదేశించి అన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్‌ యోజనలో గిరిజనులకు 25 వేల సర్వీసులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ఏడవ పోషణ్‌ పక్వాడ పోస్టర్లు, నాబార్డు పొటెన్షియల్‌ లింక్‌ క్రెడిట్‌ ప్లాన్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ, చింతూరు, రంపచోడవరం ఐటీడీఏల పీవోలు అపూర్వ భరత్‌, సింహాచలం, సబ్‌కలెక్టర్‌ శౌర్యమన్‌పటేల్‌, అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 12:58 AM