Share News

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:37 AM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ముంచంగిపుట్టు మండలంలోని దోడిపుట్టు గ్రామ సమీపంలో సోమవారం వేకువజామున జరిగింది.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
గణేశ్‌ మృతదేహం

ఇద్దరికి తీవ్ర గాయాలు

ముంచంగిపుట్టు, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ముంచంగిపుట్టు మండలంలోని దోడిపుట్టు గ్రామ సమీపంలో సోమవారం వేకువజామున జరిగింది. దీనికి సంబంధించి ఎస్‌ఐ జె.రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. అరకులోయ మండలం బొండం పంచాయతీ రంగినిగూడ గ్రామానికి చెందిన కె.గోవింద్‌, ఎస్‌.రాంబాబు, ఎస్‌.గణేశ్‌లు ముంచంగిపుట్టు మండలంలో గల దోడిపుట్టు పంచాయతీ కేంద్రంలో జరిగిన శుభకార్యానికి ఆదివారం బైక్‌పై వచ్చారు. అదే రోజు రాత్రి శ్రీరామనవమి జాతరను చూసుకొని సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్వగ్రామానికి బయలుదేరారు. దోడిపుట్టు నుంచి సుమారు ఒక కిలో మీటరు వచ్చే సరికి ద్విచక్ర వాహనం అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న పెద్ద బండరాయిని ఢీకొంది. బైక్‌ వెనుక భాగంలో కూర్చున్న గణేశ్‌(36) తలకు బలమైన గాయం తగలడంతో సంఘటన స్థలంలో మృతి చెందాడు. వాహనం నడుపుతున్న రాంబాబు, అతని వెనుక కూర్చున్న గోవింద్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించారు. వైద్యాధికారిణి గీతాంజలి క్షతగాత్రులకు వైద్య సేవలు అందించారు. ఆ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య సేవల కోసం పాడేరు జిల్లా ఆస్పత్రికి, అక్కడ నుంచి విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. మృతుడు గణేశ్‌ తండ్రి సింహాచలం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చెప్పారు. మృతదేహానికి పంచనామా అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని సీహెచ్‌సీ అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలించారు.

Updated Date - Apr 08 , 2025 | 12:37 AM