కొత్త డీలర్లకు రేషన్ డిపోలు
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:38 AM
జిల్లాలో వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన రేషన్ దుకాణాలకు ఎంపికైన అభ్యర్థులకు షాపులు అప్పగించాలంటూ ఆర్‌డీఓ ఆయీషా ఆదేశాలు జారీచేశారు.

ఆర్డీవో ఆయీషా ఆదేశాలు జారీ
‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్
అచ్యుతాపురం, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన రేషన్ దుకాణాలకు ఎంపికైన అభ్యర్థులకు షాపులు అప్పగించాలంటూ ఆర్‌డీఓ ఆయీషా ఆదేశాలు జారీచేశారు. ‘కొత్త రేషన్ డిపోలను డీలర్లకు అప్పగించరా?’ అన్న శీర్షికతో ఈనెల 12న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన 30 రేషన్ డిపోలతోపాటు వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన 60 రేషన్ డిపోలకు డీలర్ల నియామకానికి గత ఏడాది డిసెంబరులో అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. అదే నెల 13 వరకు దరఖాస్తులు స్వీకరించి, 26న రాత పరీక్ష, 27న ఇంటర్వ్యూలు నిర్వహించారు. తరువాత ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా విడుదల చేశారు. వెంటనే ఒక్కొక్క అభ్యర్ధి నుంచి పౌరసరఫరాల శాఖకు రూ.20 వేలు, డీలర్ పేరున రూ.1,000కు చలానాలు కూడా కట్టించుకున్నారు. డిపోల నిర్వహణకు సొంత భవనం ఉండాలి. ఒకవేళ అద్దె షాపు అయితే లీజు అగ్రిమెంటు కూడా తీసుకున్నారు. కాగా లీజుకు తీసుకున్న వాళ్లు ప్రతి నెలా అద్దెలు కడుతున్నారు. కానీ అధికారులు రేషన్ డిపోలను మాత్రం అప్పగించలేదు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావడంతో అఽధికారులు స్పందించి డిపోలు అప్పగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అచ్యుతాపురం మండలంలో ఆరు డిపోలకుగాను ఐదు డిపోలను డీలర్లకు అప్పగించాలని ఆదేశాలు వచ్చాయి. ఒక డిపోనకు డీలర్ డబ్బులు కట్టకపోవడంతో ఆగిపోయింది. జిల్లాలో మిగిలిన డిపోలను కూడా కొత్త డీలర్లకు అప్పగించాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి.