పాడేరు ఘాట్‌లో రోడ్డు ప్రమాదం
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:39 AM
బతుకు తెరువుకోసం పొట్టచేత్తో పట్టుకొని వలస వెళుతున్న కూలీలు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న బొలేరో వ్యాన్ పాడేరు ఘాట్ రోడ్డులో లోయలోకి దూసుకుపోవడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 11 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి క్షతగాత్రులు, పోలీసులు అందించిన వివరాలిలా వున్నాయి.

బ్రేకులు ఫెయిలై అదుపుతప్పిన బొలేరో వాహనం
లోయలోకి దూసుకుపోవడంతో ఏడుగురికి తీవ్రగాయాలు
మరో 11 మందికి గాయాలు
ఒడిశా నుంచి తెలంగాణలో కూలి పనులకు వెళుతుండగా అల్లూరి జిల్లాలో ప్రమాదం
మాడుగుల, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): బతుకు తెరువుకోసం పొట్టచేత్తో పట్టుకొని వలస వెళుతున్న కూలీలు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న బొలేరో వ్యాన్ పాడేరు ఘాట్ రోడ్డులో లోయలోకి దూసుకుపోవడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 11 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి క్షతగాత్రులు, పోలీసులు అందించిన వివరాలిలా వున్నాయి.
ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా సిద్ధలమామిడి, రాళ్లగెడ్డ, కొత్తవలస, బొడ్డుగూడ గ్రామాలకు చెందిన 18మంది కూలీలు, తెలంగాణలో కూలి పనుల నిమిత్తం శనివారం మధ్యాహ్నం బొలేరో వాహనంలో బయలుదేరారు. పాడువా, పాడేరు, వడ్డాది మీదుగా అనకాపల్లి వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపైకి చేరడానికి వస్తున్నారు. అర్ధరాత్రి పాడేరు చేరుకున్నారు. ఒంటి గంట సమయంలో ఘాట్‌రోడ్డులో వంట్లమామిడి దాటిన తరువాత కోమాలమ్మ పనుకు (ఏసుప్రభు మలుపు) వద్దకు వచ్చే సరికి బ్రేకులు ఫెయిలై వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకుపోయింది. దీంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. లోయ కావడం, చీకటిగా వుండడంతో ఎవరై రోడ్డుపైకి రాలేక, పెద్దగా కేకలు వేస్తున్నారు. కొంతసేపటి తరువాత ఈ మార్గంలో వెళుతున్న ద్విచక్ర వాహనదారులు ఆగి, మొబైల్ టార్చి లైట్లతో పరిశీలించారు. కానీ క్షతగాత్రులను రోడ్డుపైకి తీసుకువచ్చే అవకాశం లేకపోవడంతో తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మాడుగుల అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఆఫీసర్ వి.రాజేశ్వరరావు, సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి, లోయలో నుంచి క్షతగాత్రులను రోడ్డుపైకి చేర్చారు. అగ్నిమాపక శకటంలోనే ఎక్కించి ఉదయం 5.30 గంటల సమయానికి మాడుగుల సీహచ్‌సీకి తీసుకొచ్చారు. డాక్డర్ సంతోశ్ కుమార్, సిబ్బంది ప్రథమ చిక్సిత అందించారు. క్షతగాత్రుల్లో మామిడి అప్పారావు, గుంట కాయేశ్, కొర్రా రామ్, డిప్పా తిరుపతి, గుంట లైకోన్, అభినాయక్ కొంటాల్, గుంట జంబోలకు తీవ్రగాయాలు కావడంతో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన గెమ్మెలి శ్రీదేవి, కొర్రా సుబంధీ, గెమ్మిలి సునీత, రాధ, గుంట షన్ముణుడు, కొర్రా రంజిత్, మనోజ్, కొర్రా సింగల్, దోయమతి, లైకొన్‌లకు స్వల్ప గాయాలు కావడంతో మాడుగులలో చికిత్స అందించారు. కాగా ప్రమాదం గురించి తెలుసుకున్న క్షతగాత్రుల కుటుంబ సభ్యులు, బంధువులు ఉదయం 11 గంటలకు ఇక్కడకు చేరుకున్నారు. అనకాపల్లి, మాడుగుల ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని వాహనాల్లో తమ వెంట తీసుకెళ్లారు. కోరాపుట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటామని చెప్పారు. ఈ సంఘటనపై పాడేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.