Share News

ఉక్కులో విడ్డూరం

ABN , Publish Date - Apr 06 , 2025 | 01:08 AM

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటులో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి.

ఉక్కులో విడ్డూరం

  • మార్చి 31తో ముగిసిన ఇన్‌చార్జి సీఎండీ పదవీ కాలం

  • ఈ నెల 4న ఆస్ట్రేలియా పర్యటనకు పయనం

  • డిప్యూటేషన్‌ పొడిగించకుండానే వెళ్లడంపై ఆశ్చర్యం

  • పూర్తి స్థాయి సీఎండీగా ఆరు నెలల క్రితం శక్తిమణి ఎంపిక

  • ఇప్పటికీ పోస్టింగ్‌ ఇవ్వని కేంద్రం

  • ఫైనాన్స్‌ డైరెక్టర్‌ పోస్టుకు అర్హులే లేరట

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటులో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. సీఎండీ పోస్టు కోసం ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసిన అధికారి శక్తిమణికి ఆరు నెలలైనా పోస్టింగ్‌ ఇవ్వడం లేదు. కొద్దినెలల కోసం ఇన్‌చార్జి సీఎండీగా తెచ్చిన ఎంఓఐఎల్‌సీఎండీ అజయ్‌ సక్సేనాను గడువు మీరినా ఇంకా కొనసాగిస్తున్నారు. ఆయన పదవీకాలం ఇక్కడ మార్చి 31తో ముగిసిపోయింది. కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వలేదు. అయినా ఆయన ఇంకా ఇక్కడే ఉన్నారు. పైగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకు ఆయన ఆస్ట్రేలియాలో పర్యటించి విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు అవసరమైన ముడిసరకులు కొనుగోలు చేస్తారని సమాచారం. వచ్చే నెలలో మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన మెటీరియల్‌ కొనడానికి ఆయన వెళ్లారని చెబుతున్నారు.

ఇన్‌చార్జి సీఎండీగా ఉన్న ఆయన కొద్దికాలంలో ఇక్కడి నుంచి వెళ్లిపోవలసి ఉంది. అటువంటి వ్యక్తిని విదేశీ పర్యటనకు ఎలా పంపారని ఇక్కడి ఉద్యోగ, కార్మిక వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతం కాంట్రాక్టు కార్మికుల తొలగింపు వివాదాస్పదంగా మారింది. దానిపై కార్మిక సంఘాలు నిరవధిక సమ్మెకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో సీఎండీగా ఇక్కడ ఉండి అన్నీ చూసుకోవలసిన ఆయన విదేశీ పర్యటనకు ఎలా వెళ్లారో అర్థం కావడం లేదనే వాదన వినిపిస్తోంది.

ఫైనాన్స్‌ డైరెక్టర్‌ పోస్టుకు అర్హులు లేరట

స్టీల్‌ ప్లాంటులో ఫైనాన్స్‌ డైరెక్టర్‌ పోస్టు ఈ నెలాఖరుకు ఖాళీ అవుతుంది. ఆ స్థానంలో ఉన్న గణేశ్‌ పదవీ కాలం ఏప్రిల్‌ 30తో పూర్తవుతుంది. దీని కోసం పబ్లిక్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ సెలక్షన్‌ బోర్డు గత నెల 21న ఇంటర్వ్యూలు నిర్వహించింది. స్టీల్‌ ప్లాంటు నుంచి ఐదుగురు, ఇతర సంస్థల నుంచి మరో ఐదుగురు ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అయితే వారిలో ఎవరికీ అర్హత లేదని తోసిపుచ్చారు. తగిన అర్హతలు ఉన్నవారినే ఇంటర్వ్యూకు పిలుస్తారు. కానీ బోర్డు వారిలో ఎవరినీ ఎంపిక చేయలేదు. ఉద్దేశపూర్వకంగానే ఆ పోస్టును ఖాళీగా ఉంచుతున్నారని సమాచారం. ఎన్‌ఎండీసీలో జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ఒక అధికారిణి డిప్యూటేషన్‌పై విశాఖపట్నం స్టీల్‌ప్లాంటులో కొన్ని నెలలుగా పనిచేస్తున్నారు. ఆమె ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా ఎంపిక కావడానికి జూన్‌ నెలలో అర్హత వస్తుంది. అప్పటివరకూ ఆ పోస్టును ఖాళీగా ఉంచి ఆ తరువాత ఆమెను ఇక్కడే డైరెక్టర్‌గా కొనసాగించాలని ఇదంతా చేస్తున్నారని ప్లాంటులో ఉన్నత స్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ఫైనాన్స్‌ డైరెక్టర్‌ కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదని, ఆమె చెప్పినట్టే వింటున్నారనేది భోగట్టా. ఈ వ్యవహారాలన్నీ కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ సూచనల మేరకే జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - Apr 06 , 2025 | 01:08 AM