గర్నికంలో యువకుడి హత్య
ABN , Publish Date - Apr 08 , 2025 | 01:37 AM
ఆ నలుగురు జులాయిగా తిరుగుతూ చిల్లర దొంగతనాలకు అలవాటు పడ్డారు.

జులాయిగా తిరిగే స్నేహితుల మధ్య మద్యం మత్తులో గొడవ
డబ్బుల విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ
ఒకరు బీరు సీసా పగలగొట్టి మరొకరిపై దాడి
తీవ్రరక్తస్రావంతో అక్కడికక్కడే మృతి
పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
వీరిలో ఒకరు మైనర్
రావికమతం, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి):
ఆ నలుగురు జులాయిగా తిరుగుతూ చిల్లర దొంగతనాలకు అలవాటు పడ్డారు. చోరీ సొమ్ముతో మద్యం సేవిస్తూ జల్సాగా గడుపుతుంటారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పూటుగా మద్యం సేవించారు. చోరీ చేసిన సొమ్ముకు సంబంధించి గొడవ పడ్డారు. ఇది కాస్తా ముదరడంతో ఓ యువకుడు బీరు సీసాను పగలగొట్టి, మరో యువకుడిని పొడవడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు తెలిపిన వివరాలిలా వున్నాయి.
మండలంలోని మేడివాడ గ్రామానికి చెందిన కొలిపాక త్రిమూర్తులు కుమారుడు పవన్‌కుమార్ (22) ఏడో తరగతితో చదువు ఆపేసి జులాయిగా తిరగడం మొదలుపెట్టాడు. రావికమతానికి చెందిన మరో ముగ్గురు యువకులతో కలిసి స్నేహం చేస్తున్నాడు. అందరూ జులాయిగా తిరుగుతూ చిల్లర దొంగతనాలకు అలవాటు పడ్డారు. వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుంటారు. మద్యంతోపాటు గంజాయి సేవించే అలవాటు కూడా వుంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో గొల్లలపాలెం వెళ్లే రోడ్డులో మద్యం సేవిస్తూ చిల్లర దొంగతనాల విషయమై ఘర్షణ పడ్డారు. కొద్దిసేపటి తరువాత ఎవరి దారిన వాళ్లు వెళుతున్నారు. ఈ క్రమంలో రావికమతానికి చెందిన ఒక యువకుడు, పవన్‌కుమార్ మళ్లీ గొడవ పడ్డారు. రావికమతం యువకుడు మద్యం సీసాను పగలగొట్టి పవన్‌కుమార్ గొంతుపైన, ఎడమవైపున ఛాతి భాగంలో పొడిచాడు. దీంతో పవన్‌కుమార్ తీవ్రరక్తస్రావంతో స్పహకోల్పోయి మృతిచెందాడు. దీంతో మిగిలిన ముగ్గురు అక్కడి నుంచి పరారయ్యారు.. కొద్ది సేపటి తరువాత అటుగా బహిర్భూమికి వెళుతున్న వ్యక్తులు.. రక్తపు మడుగులో పడిఉన్న పవన్‌కుమార్‌ను చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహం చుట్టూ చెల్లాచెదురుగా పడిన వున్న 14 రూ.500 నోట్లను, హత్యకు ఉపయోగించిన మద్యం సీసాను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్ వచ్చి పలు ఆధారాలు సేకరించింది. పవన్‌కుమార్‌తో గొడవ పడిన ముగ్గురిలో ఒక మైనర్ వున్నాడని, అనుమానితులుగా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని సీఐ చెప్పారు. మృతదేహానికి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. హతుడి తండ్రి త్రిమూర్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నామని సీఐ కోటేశ్వరావు తెలిపారు.