Share News

పసుపు ధర పతం

ABN , Publish Date - Apr 04 , 2025 | 10:30 PM

పసుపు ధర పతనం కావడంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది మార్కెట్‌ ప్రారంభంలో పాడేరు, చింతపల్లి మార్కెట్‌ల్లో కిలో పసుపు ధర రూ.135కు వర్తకులు కొనుగోలు చేసినప్పటికీ ప్రస్తుతం రూ.105కు మించి కొనుగోలు చేయడం లేదు.

పసుపు ధర పతం
పసుపు కొమ్ములు

కిలో రూ.100-105 ధరకు వర్తకులు కొనుగోలు

గిట్టుబాటు ధర కల్పనలో జీసీసీ విఫలం

కిలో రూ.115 ధర ప్రకటించినా కొనుగోలు చేయని వైనం

పెట్టుబడులు రావడం లేదని గిరిజన రైతుల ఆందోళన

గూడెంకొత్తవీధి(అల్లూరి జిల్లా), ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): పసుపు ధర పతనం కావడంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది మార్కెట్‌ ప్రారంభంలో పాడేరు, చింతపల్లి మార్కెట్‌ల్లో కిలో పసుపు ధర రూ.135కు వర్తకులు కొనుగోలు చేసినప్పటికీ ప్రస్తుతం రూ.105కు మించి కొనుగోలు చేయడం లేదు. గిట్టుబాటు ధర కల్పించాల్సిన గిరిజన సహకార సంస్థ కిలో పసుపునకు రూ.115 ధర ప్రకటించినప్పటికీ రైతుల నుంచి కొనుగోలు చేయడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్కెట్‌ సదుపాయం లేక రైతులు ప్రైవేటు వర్తకులు నిర్ణయించిన తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 23 వేల ఎకరాల్లో ఆదివాసీ రైతులు పసుపు పంటను సాగు చేస్తున్నారు. చింతపల్లి సబ్‌ డివిజన్‌ పరిధి (కొయ్యూరు, చింతపల్లి, జీకేవీధి, జి.మాడుగుల)లో అత్యధికంగా 18,502 ఎకరాల్లో పసుపు పంటను పండిస్తున్నారు. ఈప్రాంత పసుపునకు మార్కెట్‌లో ప్రత్యేక డిమాండ్‌ ఉంటుంది. చింతపల్లి సబ్‌ డివిజన్‌ పరిధిలో రైతులు పండించిన పసుపులో కుర్కుమిన్‌ 5.5 నుంచి 6 శాతం ఉండడంతోపాటు ఛాయ బాగుంటుంది. గిరిజన రైతులు ఎకరం విస్తీర్ణంలో పచ్చి పసుపు 4.5 నుంచి 5 టన్నులు దిగుబడి సాధిస్తున్నారు. ఈ పచ్చి పసుపు నుంచి ఒకటి నుంచి 1.5 టన్నుల ఎండు పసుపు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం పసుపు పంట కాలం కావడంతో రైతులు పొలాల నుంచి సేకరించుకుని, ప్రాసెసింగ్‌ చేసి ఎండు పసుపును మార్కెట్‌లో విక్రయించుకుంటున్నారు.

రైతులకు అందని గరిష్ఠ ధరలు

ఆదివాసీ పసుపు రైతులకు గరిష్ఠ ధరలు అందడంలేదు. ప్రస్తుతం నిజామాబాద్‌, గుంటూరు పసుపు మార్కెట్‌లో కిలోకి రూ.160 నుంచి 170 ధర లభిస్తున్నది. పాడేరు, చింతపల్లి ప్రాంతీయ మార్కెట్‌లో ప్రారంభంలో వర్తకులు రూ.130 నుంచి 135ధరకు కొనుగోలు చేసినప్పటికి ప్రస్తుతం కిలో రూ.100 నుంచి 105 ధరకు కొనుగోలు చేస్తున్నారు. జాతీయ మార్కెట్‌లో పసుపు పంటకు మంచి ధర ఉన్నప్పటికి ప్రాంతీయ రైతులకు అందడంలేదు.

గిట్టుబాటు ధర కల్పించడంలో జీసీసీ విఫలం

ఆదివాసీ రైతులకు గిట్టుబాటు ధర కల్పించి దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన జీసీసీ మార్కెటింగ్‌ సదుపాయం కల్పించడంలో విఫలమైంది. మార్కెట్‌ ప్రారంభంలో జీసీసీ కిలో పసుపుకి రూ.100 ధర ప్రకటించింది. పది రోజుల క్రితం రూ.15 పెంచి రూ.115ధరగా ప్రకటించింది. జాతీయ మార్కెట్‌లో పసుపుకి మంచి ధర ఉండడంతో జీసీసీ ప్రస్తుతం ప్రకటించిన ధర కంటే రూ.20 నుంచి 30వరకు పెంచవచ్చు. అయితే జీసీసీ పసుపు రైతులకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించడంలో వెనుకడుగు వేసింది. ప్రస్తుతం ప్రకటించిన ధరకు కూడా రైతుల నుంచి పసుపు పంటను కొనుగోలు చేయడంలేదు.

ప్రైవేటు వర్తకులు నిర్ణయించిదే గరిష్ఠ ధర

గిరిజన ప్రాంతంలో ప్రైవేటు వర్తకులు నిర్ణయించిదే గరిష్ఠ ధరగా మారింది. గతంలో ఐటీడీఏ అధికారులు రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు జాతీయ ధరలు ఆధారంగా గరిష్ఠ ధరను ప్రకటించేవారు. ఐటీడీఏ ప్రకటించిన ధర కంటే వర్తకులు తక్కువ ధరకు కొనుగోలు చేయరాదని అధికారులు ఆదేశాలు జారీచేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు, వర్తకులు సిండికేట్‌గా మారి ఒక ధరను నిర్ణయిస్తున్నారు. అదే ధరకు వర్తకులందరూ కొనుగోలు చేయడం వల్ల ఆదివాసీ రైతులకు గరిష్ఠ ధరలు పొందలేకపోతున్నారు.

జీసీసీ కొనుగోలు చేయాలి

కరింగియ కృష్ణకుమార్‌, పసుపు రైతు, బోనంగిపల్లి.

గిరిజన సహకార సంస్థ పసుపు కొనుగోలు చేయాలి. పసుపు కిలో ధర రూ.115 ధర ప్రకటించినప్పటికి జీసీసీ ఉద్యోగులు గ్రామానికి వచ్చి కొనుగోలు చేయడంలేదు. దీంతో రైతులు ప్రైవేటు వర్తకులకు విక్రయించుకోవాల్సివస్తుంది. పసుపు పంటకు పెట్టుబడులు కూడా రావడంలేదు. జీసీసీ ధర పెంచడంతోపాటు పూర్తి స్థాయిలో మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలి.

Updated Date - Apr 04 , 2025 | 10:30 PM