Share News

12th position in inter results ఇంటర్‌ ఫలితాల్లో 12వ స్థానం

ABN , Publish Date - Apr 13 , 2025 | 01:05 AM

12th position in inter results ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సర ఫలితాల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో 12వ స్థానంలో నిలిచింది. గతంలో కంటే ఈ సారి మెరుగైన ఫలితాలు సాధించారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఇంటర్మీడియట్‌ ఫలితాలను శనివారం విడుదల చేశారు.

12th position in inter results ఇంటర్‌ ఫలితాల్లో   12వ స్థానం
జయేంద్రనాయుడుకు మిఠాయి తినిపిస్తున్న తల్లిదండ్రులు

ఇంటర్‌ ఫలితాల్లో

12వ స్థానం

రెండో సంవత్సరంలో 80 శాతం ఉత్తీర్ణత

మొదటి సంవత్సరంలో 65 శాతం పాస్‌

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సర ఫలితాల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో 12వ స్థానంలో నిలిచింది. గతంలో కంటే ఈ సారి మెరుగైన ఫలితాలు సాధించారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఇంటర్మీడియట్‌ ఫలితాలను శనివారం విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా రెండో సంవత్సరంలో 15,512 మంది పరీక్షకు హాజరు కాగా 12,340(80 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 17,636 మంది హాజరు కాగా 11,526(65 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. మార్చి 1 నుంచి 15వ తేదీ వరకూ పరీక్షలు జరిగాయి. పరీక్షలు పూర్తి అయిన 25 రోజుల్లో ఫలితాలను ఇంటర్మీడియట్‌ బోర్డు విడుదల చేసింది. మోడల్‌ కాలేజీలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, గురుకులాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. మొదటి సంవత్సరంలో జనరల్‌ గ్రూపులో బాలురు 7937 మంది పరీక్ష రాయగా, 5187((65.35 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 9699 మంది రాయగా 6339 మంది(65.35) ఉత్తీర్ణ సాఽధించారు. ఒకేషనల్‌ గ్రూపుల నుంచి బాలురు 999 మంది పరీక్ష రాయగా 564 మంది(56.45) ఉత్తీర్ణులయ్యారు.

- బాలికలు 1280 మంది రాయగా 663 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జనరల్‌ గ్రూపులో 6824 మంది పరీక్ష రాయగా 5430 మంది(79.57) ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 8688 మంది పరీక్షకు హాజరుకాగా 6910 మంది(79.53) ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌ గ్రూపులో బాలురు 1220 మంది పరీక్ష రాయగా 742 మంది(60.81) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 1376 మంది రాయగా 837 మంది ఉత్తీర్ణత (60.82) సాధించారు.

ఎంపీసీలో 990 మార్కులు సాధించిన జయేంద్రనాయుడు

ఇంటర్‌ రెండో సంవత్సరంలో ఎంపీసీ గ్రూపు చదువుకున్న విజయనగరం గాజులురేగకు చెందిన బలగ జయేంద్రనాయుడు 990 మార్కులు సాధించారు. ఈయన శ్రీచైతన్య జూనియర్‌ కాలేజీలో చదివారు. పదో తరగతి వరకూ నగరంలోనే సెయింట్‌ జోసఫ్‌ స్కూల్‌లో చదివారు. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 465 మార్కులు వచ్చాయి. రెండో సంవత్సరం కలిపి 990 మార్కులు రావడంతో జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించాడు. జేఈఈ మొయిన్స్‌లోనూ ప్రతిభ చాటాడు. 99.849 పర్సంటైల్‌ వచ్చింది. సివిల్‌ సాధించడం ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. జయేంద్ర నాయుడు తండ్రి గౌరి శంకర్‌ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నారు. తల్లి లక్ష్మి గృహిణి. ఇదిలా ఉంటే ఎంపీసీ గ్రూపులో జి.మోహన్‌ వంశీ 989 మార్కులు, జి.సాయిభరత్‌ 988 మార్కులు ఎంజీ హాసినికి 988 మార్కులు వచ్చాయి. బైపీసీలో పడాల లావణ్యశ్రీకి 989 మార్కులు, ఎం.ఈశ్వర్‌తేజకు 988 మార్కులు వచ్చాయి.

భలా లలిత

నెల్లిమర్ల సీకెఎం జూనియర్‌ కాలేజీలో చదివిన బర్ల లలిత బైపీసీ గ్రూపులో 989 మార్కులు సాధించారు. జియ్యమ్మవలస మండలం కన్నపుదొరవలస గ్రామానికి చెందిన లలిత పదో తరగతి వరకూ చినమేరంగి జిల్లా పరిషత్‌ పాఠశాలలో చదివి 504 మార్కులు సాధించారు. బంధువుల సూచన మేరకు నెల్లిమర్ల కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో చేరి హాస్టల్‌లో ఉంటూ చదువుకున్నారు. మొదటి సంవత్సరంలో 435 మార్కులు సాధించారు. రెండో సంవత్సరంతో కలిపి 989 మార్కులు సాధించారు. తండ్రి సంగమేష్‌, తల్లి సుశీల. ఇద్దరూ వ్యవసాయ కూలీలు. నీట్‌లో మంచి ర్యాంకు సాధించాలని లక్ష్యంతో ఉన్నట్లు లలిత వెల్లడించారు.

ప్రథమ సంవత్సరంలో

ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాల్లోనూ జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. విజయనగరానికి చెందిన సీహెచ్‌ భవాని ఎంపిసి గ్రూపులో 466 మార్కులు సాధించారు. వి.గీతా లావణ్యరెడ్డి 466, ఆర్‌.త్రినయనికి 465కు మార్కులు వచ్చాయి.

వచ్చే నెల 12 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు వచ్చే నెల 12 నుంచి 20వ తేదీ వరకూ జరుగుతాయి. ఈనెల 13 నుంచి 22వ తేదీ వరకూ రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని బోర్డు ప్రకటించింది.

Updated Date - Apr 13 , 2025 | 01:05 AM