Share News

World Health Day: ఆయుష్మాన్‌భవ!

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:29 AM

World Health Day: ప్రస్తుతం మారుతున్న జీవన విధానం, మత్తుపదార్ధాల వినియోగం, పని ఒత్తిడి, నిద్రలేమి కారణాలతో రోగాలు చుట్టుముడుతున్నాయి.

World Health Day: ఆయుష్మాన్‌భవ!

- సరైన జీవనశైలితోనే ఆరోగ్యం

- వ్యాయామం తప్పనిసరి

- ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు అవసరం

- నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

  • విజయనగరంలోని ఓ గ్రామానికి చెందిన రామారావు ( 45) దినసరి కూలీ. ఈయన గత ఏడేళ్లుగా డయాబెటిక్‌, బీపీ (రక్తపోటు)తో బాధపడుతున్నాడు. వీటి దుష్ప్రభావాలతో ఆయన ఏ పనిచేయాలన్నా శరీరం సహకరించడం లేదు. మరోపక్క ఔషధాలు కొనలేక ఆర్థికంగా చితికిపోయాడు.

  • విజయనగరంలోని ఓ ప్రముఖ ప్రైవేటు కంపెనీలో పనిచేసే ఓ వ్యక్తి ఒత్తిడితో డిప్రెషన్‌కు లోనయ్యాడు. చికిత్స కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కన్పించడంలేదు.

విజయనగరం రింగురోడ్డు, ఏప్రిల్‌ 6: ప్రస్తుతం మారుతున్న జీవన విధానం, మత్తుపదార్ధాల వినియోగం, పని ఒత్తిడి, నిద్రలేమి కారణాలతో రోగాలు చుట్టుముడుతున్నాయి. జిల్లాలో ప్రధానంగా మెడ, నడుము, మోకాళ్ల సమస్యలు, డయాబెటిక్‌, థైరాయిడ్‌, బీపీ, గుండె, కిడ్నీ, కాలేయం, మానసిక సమస్యలతో ఎక్కువమంది ఆస్పత్రులకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇందులో ఎక్కువ శాతం మంది జీవనశైలి విధానం వల్లే రోగాలు కొని తెచ్చుకుంటున్నారని వైద్య నిపుణులు అంటున్నారు. సరైన ఆహార నియామాలు, తగినంత వ్యాయామం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యవంతులుగా ఉండవచ్చునని సూచిస్తున్నారు. అందుకే ప్రతి ఏటా ఏప్రిల్‌ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకొంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించి, అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తుంది.


ఇలా చేస్తే మేలు..

జీవనశైలి మార్పులతో ప్రస్తుం మధుమేహం, రక్తపోటు వ్యాధులు నమోదు కావడం సర్వసాధారణమైపోయాయి. వీటి దుష్ప్రభావాలతో గుండెపోటు, పెరాలసిస్‌, బ్రెయిన్‌ స్ర్టోక్‌ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతవరకైనా జీవనశైలిలో మార్పులతో రోగాలను నియంత్రించ వచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవాలి. బాదం, జీడిపప్పు, అవిసె గింజలు, చియా, పొద్దుతిరుగుడు, గుమ్మడి, పుచ్చకాయ, బొప్పాయి, మొక్కజొన్న గింజలను ఆహారంగా తీసుకోవాలి. వీటివల్ల గుండెజబ్బులు, మధుమేహం, ర క్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారించవచ్చును. పండ్లు, కూరగాయలు శరీర పనితీరును మెరుగుపరిచేందుకు సాయపడతాయి. వీటితో ఆరోగ్యానికి అవసరమైన విటమిన్‌లు ఫైబర్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువును అదుపులో ఉంచుకోవచ్చును. బ్రౌన్‌ రైస్‌, కినోవా, ఓట్‌మిల్స్‌ వంటి తృణధాన్యాల్లో ఫైబర్‌, ప్రొటీన్‌, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్లడ్‌ షుగర్‌ను నియంత్రించడంలో, దీర్ఘకాలిక వ్యాధులు నివారించడంలో ఎంతగానో సాయపడతాయి. శారీరక శ్రమతో బరువును అదుపులో ఉంచుకోవచ్చును. ప్రతిరోజూ వ్యాయామం వల్ల గుండె, ఇతర వ్యవస్థలు బలోపేతం అవుతాయి. శారీరక, మానసిక ఆరోగ్యానికి 8 గంటలు నిద్రపోవడం అవసరం.

శారీరక శ్రమతోనే ఆరోగ్యం

శారీరక శ్రమ కలిగినప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అందుకే శారీరక వ్యాయామం తప్పనిసరి. జంక్‌ఫుడ్స్‌, వేపుళ్లు తినడం తగ్గించాలి. ఉప్పు, పంచదారను మితంగా తీసుకోవాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచి ఆరోగ్య జీవన విధానాన్ని అలవాటు చేయించాలి. అప్పుడే వారు పెద్దయ్యాక కూడా ఎటువంటి రోగాలు లేకుండా జీవించగలుగుతారు. ఫైబర్‌ కలిగిన ఆహారం, తాజా ఆకుకూరలు, పండ్లు, కూరగాయలను ఆహరంలో చేర్చుకోవాలి. మత్తుపదార్ధాలను మానివేయాలి. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కొంతసేపైనా ఆనందంగా గడపడానికి ప్రయత్నించాలి.

-డాక్టర్‌ ఎస్‌.అప్పలనాయుడు, సూపరింటెండెంట్‌, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, విజయనగరం

ఆయుర్వేదంతో అనారోగ్య సమస్యలు దూరం

ఆయుర్వేదం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది. ప్రాచీనమైనది. ఆయుర్వేదం ద్వారా రోగాలను చాలా వరకూ తగ్గించవచ్చును. అన్ని రకాల మొండి వ్యాధులతో పాటు మధుమేహం, బీపీకి కూడా ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చును. తమ శరీర తత్వానికి అనుగుణంగా ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి.

-డాక్టర్‌ ఎం.ఆనందరావు, సీనియర్‌ వైద్య నిపుణులు, ఆయుష్‌శాఖ, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, విజయనగరం

Updated Date - Apr 07 , 2025 | 12:29 AM