నేరాలు..ఘోరాలు!
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:53 AM
రోజుల వ్యవధిలోనే జిల్లాలో ఇటువంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసు శాఖ ఉలిక్కిపడడంతో పాటు ఆ శాఖకు సవాల్ విసిరినట్టు అయ్యింది.

- జిల్లాలో ఒకే రోజు రెండు ఘటనలు
- ఉలిక్కిపడిన పోలీసు శాఖ
- క్షణికావేశంతో పెరుగుతున్న నేర సంస్కృతి
విజయనగరం, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): రోజుల వ్యవధిలోనే జిల్లాలో ఇటువంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసు శాఖ ఉలిక్కిపడడంతో పాటు ఆ శాఖకు సవాల్ విసిరినట్టు అయ్యింది. ఇటువంటి ఉన్మాద చర్యల నియంత్రణకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. ప్రేమించిన అమ్మాయి దక్కలేదనో, సినిమాలు, ఇతర మాధ్యమాల ప్రభావమో తెలియదు కానీ.. ఎక్కువ మంది నేర సంస్కృతిని అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు నేరాలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి ఘటనలతో నిండు ప్రాణాలు పోతుండగా.. కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. అటు చిన్న వయసులోనే జైలు జీవితం అనుభవించి నిండు జీవితాలను ఇబ్బందుల్లో నెట్టుకుంటున్నారు. పిల్లలను పాఠశాలలకు పంపి వారికి ఎన్ని మార్కులు వస్తున్నాయని చూడడమే తప్ప..వారిలో మానవతా విలువలు ఎంతవరకూ ఉన్నాయని తల్లిదండ్రులు గ్రహించలేకపోతున్నారు. పుట్టకతోనే వారు నేర మనస్తత్వంతో ఉన్నవారు కాదు. కుటుంబ పరిస్థితులు, చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావంతోనే కొందరు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరు మద్యం మత్తు, ఆపై అవమానం వంటి ఆత్మనూన్యతా భావాలతో ఇటువంటి ఘటనలకు దిగుతున్నారు.
మత్తు పదార్ధాలు కారణం
మద్యం, గంజాయి వంటి మత్తు పదార్ధాల బారిన ఎక్కువ మంది విద్యార్థులు, యువత పడుతున్నారు. ప్రేమ దక్కలేదని, ప్రేమించిన యువతి దక్కలేదని భావించేవారు క్షణికావేశానికి లోనవుతున్నారు. మరికొందరు ఇదే మత్తుల్లో నేర ప్రవృత్తిని అలవాటు చేసుకుంటున్నారు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు ప్రయత్నాల్లో ఉన్న వారు సైతం నేరాల విషయంలో లెక్క చేయడం లేదు. ఇలా నేరాలకు ఎక్కువుగా పాల్పడుతున్న వారిలో బాలురు, విద్యార్థులు, 30 సంవత్సరాల్లోపు వయసున్న వారు ఉండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఒకటి చేతిలో సెల్‌ఫోన్, మరొకటి మత్తు పదార్థాలే కారణమని పోలీసులు సైతం చెబుతున్నారు. అటు పోలీస్ శాఖ పరంగా కూడా అవగాహన కార్యక్రమాలు పెరుగుతున్నా ఈ నేరాలు నియంత్రణకు నోచుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
మానసిక నిపుణులు ఏమంటున్నారంటే..
మానసిక ఒత్తిడిని గుర్తించి దానిని అధిగమించే విషయంలో అన్నివర్గాల వారిలో అవగాహన రావాలి. బాల్యం నుంచే ఆత్మవిశ్వాసం పెంపొందించాలి. మంచి నడత, నడక ఉండేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు చూసుకోవాలి. అటు తరగతి గదిలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులు, ఇంటి వద్ద ఉన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల కదలికలను గమనించాలి. పిల్లలకు సెల్‌ఫోన్ ఇచ్చినప్పుడు వారు దుర్వినియోగం చేస్తున్నారా.. సరైన స్థితిలో ఉపయోగించుకుంటున్నారా అన్నది గమనిస్తుండాలి. స్నేహితుల విషయంలో కూడా ఆరాతీస్తుండాలి. నేర సంస్కృతి, వ్యసనాలకు అలవాటుపడే వారికి పిల్లలను దూరంగా ఉంచడం చాలా మంచిది.
శాంతిభద్రతలపై దృష్టిపెట్టాం..
జిల్లాలో శాంతిభద్రతలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాం. వరుసగా ఈ ఘటనలు జరగడం దురదృష్టకరం. పోలీస్ శాఖపరంగా పటిష్ట చర్యలు చేపడుతున్నాం. ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. నేరాల నియంత్రణ అనేది ప్రజా సహకారంతోనే సాధ్యం. జిల్లాలో శనివారం నమోదైన రెండు ఘటనలకు సంబంధించి సీరియస్‌గా దర్యాప్తు జరుగుతోంది. దోషులను కఠినంగా శిక్షిస్తాం. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటాం.
- ఎస్పీ వకూల్‌జిందాల్ విజయనగరం
దురదృష్టకరం
నేరాల నియంత్రణపై ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కఠిన చట్టాలను అమలు చేస్తోంది. అయినా సరే ఇటువంటి ఘటనలు జరగడం నిజంగా దురదృష్టకరం. ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు, విద్యార్థుల విషయంలో ఉపాధ్యాయులు, యువత విషయంలో కుటుంబసభ్యులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నేర ప్రవృత్తి, మత్తు పదార్థాల వినియోగంతో కుటుంబాలు ఎలా విచ్ఛిన్నం అవుతున్నాయో.. మరింత అవగాహన పెంచేలా యంత్రాంగం కృషి చేయాలి.
- కొండపల్లి శ్రీనివాసరావు, మంత్రి