Share News

In self-help groups: ప్రతి మహిళా ఆర్థికంగా ఎదగాలి

ABN , Publish Date - Apr 03 , 2025 | 11:46 PM

In self-help groups: జిల్లాలో స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి మహిళా ఆర్థికంగా ఎదగాలని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు.

In self-help groups:  ప్రతి మహిళా ఆర్థికంగా ఎదగాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

- కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

పార్వతీపురం, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి మహిళా ఆర్థికంగా ఎదగాలని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్‌లో ఏపీడీలు, ఏపీఎంలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 2.30 లక్షల మంది మహిళా సభ్యులు ఉండగా, వారిలో సగానికి పైగా రూ.లక్ష లోపు వార్షికాదాయం ఉన్నవారే ఉన్నారని అన్నారు. అటువంటి వారిని గుర్తించి వారితో అనుకూలంగా ఉండే వ్యాపారాలను చేయించి, ప్రతి మహిళను లక్షలాధికారులుగా తీర్చిదిద్దాలన్నారు. ఇందుకు ఎస్‌హెచ్‌జీ నిధులే కాకుండా డీఆర్‌డీఏ, వెలుగు సంస్థ నుంచి కూడా సహకారం పొందాలని సూచించారు. ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళా వ్యాపారవేత్త రావాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉపాధి హామీ పథకంలో చెరువు గట్లపై కొబ్బరి, పనస వంటి మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. ఫలసాయం నుంచి వచ్చే ఆదాయాన్ని మహిళలు అర్జించవచ్చునన్నారు. గ్రామ పంచాయతీ చెరువుల్లో చేపల పెంపకం చేపట్టవచ్చునని, తద్వారా చెరువులు బాగుపడడంతో పాటు మత్స్యసంపదతో అధిక ఆదాయం లభిస్తుందన్నారు. అలాగే పశుసంవర్థక ద్వారా గొర్రెలు, పశువులు, కోళ్ల పెంపకంతో పాటు అధిక ఆదాయం పొందవచ్చునని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వెలుగు పథక సంచాలకులు సుధారాణి, వై.సత్యంనాయుడు, పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్‌ ఎంవీ కరుణాకర్‌, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 11:46 PM