అసత్య ప్రచారం తగదు
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:37 AM
తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో గోవుల మరణాలకు సంబంధించి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చేస్తున్న అసత్య ప్రచారం కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర అని ఎమ్మెల్యే బేబీనాయన ఆరోపించారు.

బొబ్బిలి, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో గోవుల మరణాలకు సంబంధించి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చేస్తున్న అసత్య ప్రచారం కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర అని ఎమ్మెల్యే బేబీనాయన ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన స్థానిక కోటలో విలేకర్లతో మాట్లాడారు. టీటీడీ ప్రతిష్ఠకు, పవిత్రతకు భంగం కలిగేలా గోశాలలో వంద ఆవులు చనిపోయాయంటూ భూమన చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవమని అన్నారు. గోశాలలో గల 1668 ఆవులకు జియోట్యాగ్ చేసి ప్రతిరోజూ పర్యవేక్షిస్తుంటే.. జీయోట్యాగ్ తీసేశారని విషప్రచారం చేయడం తగదన్నారు. వేంకటేశ్వరస్వామి ఓ నల్లరాయి అని దానిని పెకిలించేస్తానం టూ గతంలో మాట్లాడిన వ్యక్తి భూమన అని, కొవిడ్ సమయంలో స్వామి ప్రసాదాలను దారి మళ్లించి అపచారాలకు పాల్పడ్డారని, అవినీతి అక్రమా లతో టీటీడీ ఖజానాకు చిల్లుపెట్టారని ఎమ్మెల్యే ఆరోపించారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ, మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా అసత్య ప్రచారాలు చేస్తున్న కరుణాకరరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బేబీనాయన డిమాండ్ చేశారు.