CM Chandrababu Naidu: రాజకీయాల్లోకి వచ్చే మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..
ABN , Publish Date - Mar 15 , 2025 | 04:09 PM
గడిచిన ఐదేళ్లపాటు తనతో సహా టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఇబ్బందులు పడ్డారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీకి ఒక పటిష్టమైన యంత్రాంగం ఉందని, ఇకపైనా ఎప్పటికప్పుడు మరింత పటిష్టంగా మారాలని చెప్పారు.

పశ్చిమగోదావరి: ప్రతి టీడీపీ కార్యకర్త 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. తాను ఎక్కడికి వెళ్లినా కార్యకర్తలతో సమావేశం అవుతున్నానని, అలాగే ప్రతి ఎమ్మెల్యే కూడా వారిని కలవాలని ఆదేశించారు. ప.గో.జిల్లా తణుకు నూలి గ్రౌండ్స్‌లో నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఉండి మాజీ ఎమ్మెల్యే రామరాజు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్నో కష్టాలు చూశాం..
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.." గడిచిన ఐదేళ్లపాటు నాతో సహా టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఇబ్బందులు పడ్డారు. టీడీపీకి ఒక పటిష్టమైన యంత్రాంగం ఉంది. ఇకపైనా పార్టీ యంత్రాంగం ఎప్పటికప్పుడు మరింత పటిష్టంగా ఉండాలి. ఎన్ని ఒడిదుడుకులు, ఇబ్బందులు వచ్చినా టీడీపీ ఎప్పుడూ అధైర్య పడలేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా కార్యకర్తలు ఎప్పుడూ నా వెంటే ఉన్నారు. ఎప్పటికప్పుడు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు నన్ను ఆదరిస్తూనే ఉన్నారు. ఎవ్వరికీ దక్కని గౌరవం టీడీపీకి, నాకూ దక్కింది. అది నా పూర్వ జన్మ పుణ్యం.
అందుకే పొత్తు..
గత ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందనే బీజెపీతో కలిసి పని చేస్తున్నాం. ఏపీ సర్వనాశనం అయిపోతుందనే కలిసి వెళ్లాలనే నిర్ణయించి ముందుకు వెళ్తున్నాం. ముఖ్యమంత్రిగా ఉండి చాలా కష్టాలు చూస్తున్నా. సీఎం అంటే అనుభవించడం కాదు. ఏపీ సమస్యలు ఎలా పరిష్కరిస్తారని చాలామంది అడిగారు. దానికి ఒకటే మార్గం.. ఒకటి పారిపోవడం లేదా రెండు ఫైట్ చేయటం. నేను ఫైట్‌నే ఎంచుకున్నా. 9 నెలలుగా ఆర్థిక వ్యవస్థ వెసులుబాటు లేదు. గత ప్రభుత్వం వల్ల వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయి. వ్యవస్థలు సరిగా పనిచేయడం లేదు. సూపర్ సిక్స్‌లో ఇప్పటికే కొన్ని హామీలు అమలు చేశాం. కేంద్రం నుంచి వచ్చే నిధులను అభివృద్ధితోపాటు మిగిలిన వాటిని సంక్షేమానికి వాడుతున్నాం.
యువరక్తం రావాలి..
టీడీపీ పదవులు ఇచ్చేటప్పుడూ రెండు విషయాలను గుర్తు పెట్టుకుంటుంది. అనుభవం పార్టీకి అవసరం, పరిగెత్తే యువ రక్తం కూడా అవసరం. మొన్న ఎన్నికల్లో ప్రజల ఆమోదం తీసుకుని సీట్లు కేటాయించాం. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా అభ్యర్థులను ఎన్నిక చేశాం. కుటుంబ పెద్ద తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే కుటుంబం అంతా నాశనం అవుతుంది. ప్రజల ఆమోదంతోనే ఎవరెవరికి ఏమి చేయాలనేది నిర్ణయిస్తా. ప్రతి క్యాడర్ పార్టీని బలోపేతం చేయడానికి పనిచేయాలి. అలా కాకుండా పార్టీకి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తే ఒకటి రెండుసార్లు చూస్తా. తర్వాత పనిష్మెంట్ గట్టిగా ఉంటుంది. ఎక్కడైనా కార్యకర్తల కాంట్రాక్ట్ బిల్లులు రాజకీయంగా ఆపి ఉంటే చర్య తీసుకునే బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదే.
మహిళలు సిద్ధంగా ఉండాలి..
ఈసారి మహానాడు కడపలో పెడుతున్నాం. టీడీపీ పుట్టిన తర్వాత మొదటిసారి కడపలో పెడుతున్నాం. పార్టీని గెలిపించేది, నడిపించేది బలహీన వర్గాలు మాత్రమే. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురూ బలహీనవర్గాలకు చెందిన బీసీ నేతలే. పార్టీని నమ్ముకున్న టీడీపీ కుటుంబ సభ్యులందరినీ పైకి తీసుకురావడానికి ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తున్నా. పార్టీ సభ్యులు ఆఫీసుకి వస్తే సొంత బంధువుల మాదిరిగా అల్పాహారం, విందు ఇచ్చి పంపించే పార్టీ ఒక్క టీడీపీయే. నిన్న కన్నా నేడు ఇంకా బాగా పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అలాగే కార్యకర్తలూ సిద్ధంగా ఉండాలి. మీ మైండ్‌లో ఎప్పుడూ 2029 ఎన్నికలను గుర్తుపెట్టుకోవాలి. మహిళలకు త్వరలో 1/3 రిజర్వేషన్స్ అసెంబ్లీ, పార్లమెంటులో వస్తున్నాయి. ఇవాళ మగవారితో సమానంగా ఆడబిడ్డలూ పోటీపడే అవకాశం వచ్చిందని" చెప్పారు.
ఇవి కూడా చదవండి...
Justice for Viveka: ఆరేళ్లుగా పోరాడుతున్నా.. వివేకా కుమార్తె కన్నీరు
CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబు ఫుల్ బిజీ..పూర్తి షెడ్యూల్ ఇదే
Read Latest AP News And Telugu News