Share News

హలో వినిపిస్తోందా ?

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:52 AM

ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి సెల్‌ఫోన్‌ సర్వసాధారణమైంది. మారుతున్న సమాజానికి అనుగుణంగా సాంకేతిక అభివృద్ధి మంచిదైనప్పటికీ దానిని సద్వినియోగం చేసుకుంటే అందరికీ మంచిదే.. కానీ జాగ్రత్తలు పాటించక పోవడంతో ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి.

హలో వినిపిస్తోందా ?

ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవ్‌ చేస్తే ప్రాణాలకు ముప్పు

రోడ్డు ప్రమాదాల్లో వాహనదారుల మృత్యువాత.. నిబంధనలు పట్టించుకోని వైనం

ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి సెల్‌ఫోన్‌ సర్వసాధారణమైంది. మారుతున్న సమాజానికి అనుగుణంగా సాంకేతిక అభివృద్ధి మంచిదైనప్పటికీ దానిని సద్వినియోగం చేసుకుంటే అందరికీ మంచిదే.. కానీ జాగ్రత్తలు పాటించక పోవడంతో ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి. ఇటీవల ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సెల్‌ఫోన్‌ ఒక నిత్యావసర వస్తువుగా మారింది. అయితే కొంతమంది ద్విచక్ర వాహనదారులు, కార్లలో వెళ్లేటప్పుడు ఫోన్‌లు మాట్లాడుతూ డ్రైవ్‌ చేయడంతో దృష్టి మరలి ప్రమాదాల బారినపడి భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. వాహనాలపై వెళ్లేటప్పుడు చెవుల పక్కన ఫోన్లు పెట్టుకుని వేగంగా వెళుతూ ఎదురుగా వస్తున్న వాహనాలను పసిగట్టకుండా ఢీకొనడంతో చాలామంది మృత్యువాతపడుతున్నారు. అటువంటి ప్రమాదాలు ఉమ్మడి పశ్చిమ జిల్లాలో చాలా చోట్ల జరిగాయి.

– భీమవరం క్రైం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి)

ఇటీవల చాలామంది సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తున్నారు. పల్లెల్లోనే కాకుండా పట్టణాల్లోను, హైవే రోడ్లపై సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌ పోలీసులు ఉన్న నేపథ్యంలో వారికి దొరకకుండా వెళ్లేందుకు స్పీడ్‌గా వాహనాలు నడిపి ప్రమాదాల బారినపడుతున్నారు. అటువంటి ప్రమాదాలు చాలానే ఉన్నాయి. పోలీసులు అనేక రకాలుగా సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నా ఎవరూ పట్టనట్లు వ్యవహరించడం దారుణం. కుటుంబ పెద్ద రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఆయా కుటుంబాల పరిస్థితి ఏమిటనేది ఆలోచించుకోవాలంటూ ప్రసార మాధ్యమాలతోపాటు పత్రికలు, కరపత్రాల్లో తెలియజేస్తూనే ఉన్నారు. కానీ ఎవరిలోనూ నిర్లక్ష్య ధోరణి తగ్గడం లేదు. జిల్లాలో 2024 జనవరి నుంచి ఇప్పటివరకు సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ వల్ల సుమారు 50 మంది వరకు ప్రమాదాల బారినపడి గాయాల పాలవ్వడమే కాకుండా కొంతమంది మృత్యువాత పడ్డారు.

బాల్యంలోనూ సెల్‌ఫోన్లే..

ఐదో తరగతి చదువుతున్న పిల్లవాడి దగ్గర నుంచి ఇంటర్‌, డిగ్రీ పిల్లలకు కూడా పెద్దలు సెల్‌ఫోన్లు కొని ఇచ్చేయడంతో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. చిన్నారులు వాహనాలు నడుపుతూ సెల్‌ఫోన్‌లో మాట్లాడడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వారికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోయినా భారీ వాహనాలు అధిక ధరలతో కొనుగోలు చేసి తల్లిదండ్రులు వారికి ఇస్తున్నారు. సెల్‌ఫోన్లు, వాహనాలు ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసినప్పటికీ ఎవరిలోనూ మార్పు రావడం లేదు. ఇప్పటికైనా సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ వల్ల జరిగే అనర్థాలను తెలుసుకుని ప్రమాదాలు అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పోలీసులు శాఖ వారు సూచిస్తున్నారు.

జరిమానా విధిస్తున్నా తీరు మారడం లేదు

సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలను వివరిస్తూ భారీగా జరిమానాలు విధిస్తున్నా చాలామందిలో మార్పు రావడం లేదు. సెల్‌ఫోన్‌తో డ్రైవింగ్‌ చేయడం వల్ల దృష్టి మరలి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలతో చాలామంది మృత్యువాతపడుతున్నారు. ఇంటి వద్ద తల్లిదండ్రులు యువతకు వాహనాలు ఇచ్చేముందు జాగ్రత్తలు చెప్పి జరిగే అనర్థాలను వివరిస్తే చాలావరకు ప్రమాదాలను అరికట్టవచ్చు.

– ఆర్‌జీ జయసూర్య భీమవరం డీఎస్పీ

Updated Date - Apr 16 , 2025 | 12:52 AM