మహిళా సంఘాలకు డిజిటల్ శక్తి
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:24 AM
మహిళా సంఘాలకు డిజిటల్ శక్తి తోడవుతోంది. త్వరితగతిన మెరుగైన సేవలు, సమాచారం నిమిత్తం ప్రభుత్వం కొత్త యాప్‌లను అందుబాటులోకి తేనుంది.

కొత్త యాప్‌లు సిద్ధం చేసిన ప్రభుత్వం
త్వరలో మహిళలకు శిక్షణ
భీమవరం టౌన్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): మహిళా సంఘాలకు డిజిటల్ శక్తి తోడవుతోంది. త్వరితగతిన మెరుగైన సేవలు, సమాచారం నిమిత్తం ప్రభుత్వం కొత్త యాప్‌లను అందుబాటులోకి తేనుంది. మహిళలు, మెప్మా అధికారులు, సిబ్బందికి కొత్త యాప్‌లు అందుబాటులో ఉంటాయి.
మహిళా వికాసం
ఈ యాప్ ద్వారా మహిళా సంఘాల సమావేశాలు, తీసుకున్న నిర్ణయాలు, నిర్వహించిన కార్యక్రమాలు నమోదు చేస్తారు. దీనితో ఆయా సంఘాల కార్యకలాపాలు నేరుగా ఉన్నతాధికారులకు చేరే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పుస్తకాల్లో నమోదు చేసుకునే వివరాలు ఇక నుంచి యాప్‌లో నమోదు చేయవలసి ఉంటుంది.
అర్బన్ హోమ్ షెల్టర్ యాప్
ఇతర ప్రాంతాల నుంచి పనుల కోసం వచ్చిన కూలీలు, తదితరులతో పాటు రాత్రి వేళ షాపుల వద్ద, బస్టాండ్, రైల్వేస్టేషన్ల వద్ద పడుకునేవారి వివరాలను యాప్‌లో నమోదు చేస్తారు. వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్‌లో ఉండేవిధంగా చర్యలు చేపడతారు. గతంలో పట్టణాల్లో సర్వేచేసి వివరాలు నమోదు చేశారు.
ఎంఎల్‌సీసీ యాప్ (ఎస్‌హెచ్‌జీఎస్)
స్వయం సహాయక మహిళా సంఘాల రికార్డులను తీసుకుని రుణాల కోసం బ్యాంకు అధికారుల వద్దకు వెళ్లేవారు. ఈ యాప్‌లో రుణం కోసం సంఘ సభ్యుల తీర్మానం, కావలసిన రుణం వివరాలను నమోదు చేస్తే సంబంధిత బ్యాంకు అధికారులకు చేరుతుంది. దీనివల్ల రుణ మంజూరు సులభమవుతుంది.
మెప్మా సమాచారం సిద్ధం
మెప్మా సమాచారం ఇప్పటివరకు అందుబాటులో లేదు. ఇప్పుడు ఈ యాప్‌ద్వారా ఏ సమాచారం కావలసిన వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. మెప్మా ద్వారా అందించే పథకాలు, రుణాలు, సిబ్బంది వివరాలను ఇందులో పొందుపరచనున్నారు.
యాప్‌లు ఇలా పనిచేస్తాయి..
మహిళా స్వయం సహాయక సంఘాల వివరాలను ఆర్‌పిలు యాప్‌లో నమోదు చేసిన వెంటనే ప్రాజెక్టు ఆఫీసర్ లాగిన్‌కు చేరతాయి. సంబంధిత అధికారి పరిశీలన అనంతరం టౌన్ సీఎంఎంకు చేరుతుంది. ఆ వివరాలు జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్, రాష్ట్ర స్థాయి అధికారులకు అందుబాటులో ఉంటాయి. క్షేత్రస్థాయిలో మహిళా సంఘాల పర్యవేక్షణ సులభతరం అవుతుంది. యాప్‌ల వినియోగంపై అవగాహన కల్పించేందుకు మునిసిపాలిటీల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే జిల్లాస్థాయి అధికారులకు శిక్షణ పూర్తయింది. యాప్ ఉపయోగించడం, వివరాల నమోదు, ఇబ్బందులుంటే ఎలా సంప్రదించాలనే అంశాలపై శిక్షణ ఇచ్చారు.