Share News

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి

ABN , Publish Date - Apr 15 , 2025 | 01:13 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయసాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు.

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి

భీమవరం టౌన్‌/పాలకొల్లు రూరల్‌, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయసాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అంబేడ్కర్‌ జయంత్యుత్సవాల్లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. అంబేడ్కర్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా, ఆర్థిక, రాజకీయ, సామాజికవేత్తగా అనేక కోణాల్లో భారతదేశ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి అని కొనియాడారు. కలెక్టర్‌ నాగరాణి మాట్లాడుతూ అంబేడ్కర్‌ జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులను ఎదుర్కొని ఒక మహోన్నత దివ్య శక్తిగా మన మధ్యకు వచ్చారన్నారు. జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి మాట్లాడుతూ అందరికీ సమాన హక్కులు కల్పించాలని ధ్యేయంతో రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అందించిన గొప్ప వ్యక్తి అంబేడ్కర్‌ అని కొనియాడారు. పుష్పరాజ్‌, మంగరాజు, పి.బాలకృష్ణ, సత్యసుధామ, న్యాయవాది చాకూరి జయరాజు మాట్లాడారు. ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ విద్యార్థులకు మెమొంటోలు అందజేసి, అభినందించారు. వ్యాసరచన పోటీల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులు గెలుపొందిన హైస్కూల్‌ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు, డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, ఆర్డీవో కె.రాహుల్‌కుమార్‌రెడ్డి, సాంఘిక సంక్షేమశాఖాధికారి రామాంజనేయ రాజు తదితరులు పాల్గొన్నారు.

భీమవరం అంబేడ్కర్‌ సర్కిల్‌లోని విగ్రహానికి డిప్యూటీ స్పీకర్‌ కె.రఘురామకృష్ణరాజు, కలెక్టర్‌, ఎస్పీలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి తోడ్పడిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్‌ అని, ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని రఘురామ పిలుపునిచ్చారు.

అంబేడ్కర్‌ స్ఫూర్తితోనే : నిమ్మల

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితోనే రాజకీ యాల్లోకి వచ్చానని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు మండలం చింతపర్రు అరుంధితిపేటలో జరిగిన అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ జరుగుతున్న అంబేడ్కర్‌ విగ్రహ స్లాబ్‌ నిర్మాణ పనుల్లో నిమ్మల శ్రమదానం చేశారు.

Updated Date - Apr 15 , 2025 | 01:14 AM