Share News

ఇదేం తీరు!

ABN , Publish Date - Apr 02 , 2025 | 01:12 AM

రెవెన్యూ శాఖ అంటే ప్రభుత్వానికి ఆదాయం తెచ్చి పెట్టే శాఖ. ఇప్పుడు కేవలం సేవలకే పరిమితం అవుతోంది.

 ఇదేం తీరు!

పడకేసిన రెవెన్యూ వసూళ్లు

గ్రామానికి ఒక వీఆర్వో

భూమి శిస్తు వసూలుపై చిత్తశుద్ధి ఏదీ

పన్ను వసూళ్లతో రైతుకే ప్రయోజనం

ఓ అండ్‌ ఎం నిధులుగా నీటి తీరువా సొమ్ము

వేసవిలో కాలువల ప్రక్షాళనకు అవకాశం

రెవెన్యూ శాఖ అంటే ప్రభుత్వానికి ఆదాయం తెచ్చి పెట్టే శాఖ. ఇప్పుడు కేవలం సేవలకే పరిమితం అవుతోంది. పన్ను వసూళ్లపై దృష్టి పెట్టడం లేదు. సిబ్బంది అందుబాటులో ఉన్నా రెండేళ్లుగా నీటి తీరువా వసూళ్లను నిర్లక్ష్యం చేశారు. భూమి శిస్తు రూపంలో నీటి తీరువా ఏటా సక్రమంగా వసూలు చేయడం ద్వారా రైతులకు సాగునీటి పంపిణీకి వెసులుబాటు ఉండేది. నీటి తీరువా మొత్తాన్ని తిరిగి రైతు ప్రయోజనాలకు ప్రభుత్వం వినియోగిస్తుంది. వేసవిలో కాలువల మరమ్మతు పనులకు నీటి తీరువా మొత్తాలనే ఓ అండ్‌ ఎం పేరిట నిధులుగా విడుదల చేసి పనులు చేపట్టేవారు. ప్రస్తుతం నీటి తీరువా వసూళ్లు పడకేయడంతో రైతు ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంది.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వం ఓ అండ్‌ ఎం నిధుల రూపంలో కాలువల మరమ్మతులకు నీటి తీరువా నిధులను విడుదల చేస్తుంది. గత ఐదేళ్లలో ప్రభుత్వం పైసా విదల్చలేదు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు సాగలేదు. ఆ ప్రభావం గడచిన ఖరీఫ్‌లో చూపింది. భారీ వర్షాలతో పంటలు నీట మునిగి రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. ఏటా కాలువలు, డ్రెయిన్లు మరమ్మతులు చేస్తే అధిక వర్షాలు కురిసినా సరే ముంపు తీవ్రత ఉండదు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో డ్రెయినేజీ శాఖ, నీటి పారుదల శాఖ పరిధిలోని కాలువలు, డ్రెయిన్లు పూడుకుపోయాయి. ఈ ఏడాది ఖరీఫ్‌ లో వర్షాలకు పంట పొలాల్లో నీరు స్తంభించిపోయింది. నీటి తీరువా వసూళ్లు సక్రమంగా నిర్వహిస్తే ప్రభుత్వం వద్ద నిధులు అందుబాటులో ఉంటాయి. కాలువల మరమ్మతులకు నిధులు మంజూరు చేసే వెసులుబాటు ఉంటుంది.

70 శాతం తిరిగి రైతు ప్రయోజనాలకే

రైతుల నుంచి వసూలు చేసిన నీటి తీరువా మొత్తంలో 70 శాతం తిరిగి కాలువల మరమ్మతుల కోసం ప్రభుత్వం మంజూరు చేస్తారు. పశ్చిమ డెల్టా పరిధిలో పంట పొలాలకు ఏడాదికి ఎకరాకు రూ.350 వసూలు చేయాలి. ఆక్వా చెరువు లకు రూ.500 వసూలు చేసే బాధ్యత రెవెన్యూ శాఖ తీసు కుంటుంది. జిల్లాలో 1.33 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. ఆక్వా చెరువుల ద్వారా ఏడాదికి రూ.6.50 కోట్లు పన్ను రూపంలో ఆదాయం వస్తుంది. మరో 2.50 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. కొబ్బరి, పామాయిల్‌, ఉద్యాన పంటలు కూడా పండిస్తున్నారు. మొత్తంపైన 3.00 లక్షల ఎకరాలకు రూ.350 చొప్పున నీటి తీరువా (భూమి శిస్తు) వసూలు బాధ్యత రెవెన్యూ శాఖపై ఉంది. వరి, ఇతర పంట పొలాల నుంచి ఏటా రూ.10.50 కోట్లు ఆదాయం లభిస్తుంది. గడచిన రెండేళ్లుగా నీటి తీరువా పూర్తిగా విస్మ రించారు. కొన్ని మండలాల్లో కనీసం పట్టించుకోకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. ఒకేసారి రైతుల నుంచి వసూలు చేయడం కష్టతరం కానుంది. జిల్లాలో రెండేళ్ల నీటి తీరువా రూ. 32 కోట్ల మేర రావాల్సి ఉంది. గత ప్రభుత్వంలో ఐదేళ్లపాటు ఎంత వసూలు చేశారనే స్పష్టత లేదు. రెండేళ్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేయాలన్న గణాంకాలు బయటకు వస్తున్నాయి. రెవెన్యూ శాఖ దీనిపై దృష్టి సారిస్తే వేసవి పనులకు నిధుల కొరత తీరనుంది.

కాల్వల మరమ్మతులకు రూ. 40 కోట్లు

పశ్చిమ డెల్టాలో కాలువల మరమ్మతులకు ఈ ఏడాది దాదాపు రూ.40 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కాలువలు, డ్రెయిన్లలో పూడికతీత, గుర్రపుడెక్క, కర్రనాచు తొలగింపు, షట్టర్లు, లాకుల మరమ్మతులను చేపట్టనున్నారు. ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేసేందుకు సుముఖంగా ఉంది. వేసవి పనులకు ప్రభుత్వంపై భారం లేకుండా ఉండాలంటే రెవెన్యూశాఖ నీటి తీరువా సకాలంలో వసూలు చేయాలి. ప్రస్తుత ప్రభుత్వం జలవనరుల శాఖకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గోదావరి డెల్టా ఆధునీకీకరణకు రూ. 200 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. నీటి సంఘాలను నియ మించారు. నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ రైతులు చెల్లించే నీటి తీరువాపై రెవెన్యూ శాఖ శ్రద్ధ చూపడం లేద న్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అవకతవకలతో ఆటంకం

నీటి తీరువా వసూళ్లపై పర్యవేక్షణ కొరవడడంతో క్షేత్ర స్థాయి సిబ్బంది గతంలో అక్రమాలకు పాల్పడ్డారు. రైతుల నుంచి నీటి తీరువా వసూలు చేసి సొంతానికి వాడుకున్నారనే ఆరోపణలున్నాయి. శిస్తు చెల్లించినట్లు రైతులు పాత రశీదులను చూపుతున్నారు. కానీ అవి రెవెన్యూ ఖాతాలో జమ కాలేదు. మరోవైపు రశీదులు భద్రపరచని రైతులను డిఫాల్టర్‌ జాబితాలో ఉంచారు. శిస్తు వసూళ్లలో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. నీటి తీరువా విధానంపై ప్రభుత్వ స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నట్టు సమాచారం. డిజిటలైజేషన్‌తో రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అప్పటివరకు రెవెన్యూశాఖ వసూళ్లపై దృష్టి పెట్టాలి. సచివాలయాల్లో వీఆర్వోలు ఉన్నారు. శిస్తు వసూళ్లలో వారి సేవలను వినియోగించుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

Updated Date - Apr 02 , 2025 | 01:13 AM