కొత్త తల్లులు గిల్ట్ లేకుండా..
ABN , Publish Date - Apr 03 , 2025 | 04:27 AM
కెరీర్ రాకెట్‌లా దూసుకుపోయే సమయంలో బిడ్డను కనడానికి ఏ మహిళైనా కాస్త తటపటాయిస్తుంది. ఎన్నో అపరాధ భావనలు, భయాలు వాళ్లను వేధిస్తాయి. సినీనటులు కూడా...

సెలెబ్ టాక్
కెరీర్ రాకెట్‌లా దూసుకుపోయే సమయంలో బిడ్డను కనడానికి ఏ మహిళైనా కాస్త తటపటాయిస్తుంది. ఎన్నో అపరాధ భావనలు, భయాలు వాళ్లను వేధిస్తాయి. సినీనటులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. బాలీవుడ్ అగ్రతార దీపిక పడుకొనె తానెదుర్కొన్న ‘మామ్ గిల్ట్’ గురించి, దాన్ని అధిగమించిన వైనం గురించి ఇలా వివరిస్తోంది.
బిడ్డ ‘దువా’ను కన్న తర్వాత, రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన దీపిక, అబుదాబిలో గ్లోబల్ సమిట్‌కు హాజరైన సందర్భంలో, తన మాతృత్వ ప్రయాణం గురించీ, మాతృత్వం పట్ల తనకున్న ధృక్పథం గురించి ఇలా వివరించింది. ‘‘మాతృత్వమన్నది అద్భుతమైన అనుభవం. ఇక నుంచి నేనెంచుకోబోయే సినిమాలు, పాత్రల మీద ఆ ప్రభావం పడుతుందనే విషయం నాకు తెలుసు. గర్భం దాల్చక ముందు నుంచే ఈ విషయం గురించి నేను స్పష్టతను ఏర్పరుచుకున్నాను. ప్రస్తుతం జీవితంలో నేనొక కీలకమైన దశలో ఉన్నాను. ఒక కొత్త తల్లిగా బిడ్డకు సమయాన్ని కేటాయిస్తూనే, నటిగా నా వృత్తికి న్యాయం చేకూర్చేలా సమయ నిర్వహణను కొనసాగించక తప్పదు. అలాగని బిడ్డకు దూరమైన ప్రతిసారీ అపరాధ భావనకు గురి కావలసిన అవసరం లేదని కూడా నేను భావిస్తున్నాను.
నిజానికి మాతృత్వం నన్నెంతో మార్చేసింది. నా ఆలోచనా విధానాలు, తీసుకునే నిర్ణయాలు బిడ్డే ప్రధానంగా సాగుతున్నాయి. నా ప్రాధామ్యాలు కూడా మారిపోయాయి. నా మనసులో పాప దువా ఎల్లప్పుడూ మెదులుతూనే ఉంటుంది. నిజానికి నా గూగుల్ సెర్చ్ మొత్తం పిల్లల పెంపకం చుట్టూరానే తిరుగుతూ ఉంటుంది. బిడ్డ పాలు కక్కడం ఎప్పటి నుంచి మానేస్తుంది, అందుకోసం తల్లులేం చేయాలి? లాంటి ప్రతి తల్లినీ వేధించే ప్రశ్నలే నన్ను కూడా వేధిస్తూ ఉంటాయి.
సెల్ఫ్ కేర్ అవసరం
తల్లి అయినంత మాత్రాన మన పూర్వపు బాధ్యతలకు స్వస్థి చెప్పవలసిన అవసరం లేదు. ఎలాంటి అపరాధ భావనకు గురి కాకుండా సెల్ఫ్ కేర్‌కు కూడా సమయం కేటాయిస్తూ ఉండాలి. మహిళలమైన మనం ఎన్నో పాత్రలు పోషిస్తూ ఉంటాం. ఆ పాత్రలకు పూర్తి న్యాయం చేయాలని పరితపిస్తూ ఉంటాం. అయితే ఆ క్రమంలో మనల్ని మనం నిర ్లక్ష్యం చేసుకుంటూ ఉంటాం. నిజానికి మహిళలు వాళ్లకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. మిగతా బాధ్యలకు నిర్లక్ష్యం చేయకుండా, వాటికి తగినంత సమయాన్ని కేటాయించినంత కాలం ఎలాంటి అపరాధ భావనకూ గురి కావలసిన అవసరం లేదని నా అభిప్రాయం. మహిళలు నిరంతరంగా ఏదో ఒక విషయం గురించి చింతిస్తూనే ఉంటారు. తల్లి బాధ్యతలకే ప్రాథాన్యమిస్తూ, మానసికోల్లాసాన్ని అందించి సేద తీర్చే సొంత పనులను వాయిదా వేస్తూ ఉంటారు. కానీ ఇది సరి కాదు. బిడ్డను ఆరోగ్యంగా పెంచాలంటే తల్లి కూడా ఆరోగ్యంగా ఉండాలి.
దశలవారీ ఒడిదొడుకులు
మహిళలకు భావోద్వేగాలు, కుంగుబాట్లు ఎక్కువ. వాటి మీద కూడా దృష్టి పెడుతూ ఉండాలి. ఒకానొక సమయంలో నేను కూడా మానసిక కుంగుబాటుకు లోనయ్యాను. ఆ అనుభవాన్ని బయటి ప్రపంచంతో పంచుకోవడం ద్వారా నా మనసును తేలిక పరుచుకున్నాను. నా భుజాల పైనుంచి పెద్ద భారం తొలగిపోయిన అనుభూతికి లోనయ్యాను. ఆ సమయంలో ఎవరో నన్ను అంచనా వేస్తారనే భయం లేకుండా ఎంతో పారదర్శకంగా వ్యవహరించాను. అత్యంత వ్యక్తిగతమైన విషయాన్నీ, నా జీవితాన్ని మలుపు తిప్పిన విషయాన్నీ అందరితో పంచుకోవడం నాకెంతో ముఖ్యమనిపించింది. ఇలా స్వీయ అనుభవాన్ని పంచుకోవడం ద్వారా ఏ ఒక్కరి జీవితాన్ని కాపాడగలిగినా నా ప్రయత్నం ఫలించినట్టేనని భావించాను. మహిళల జీవితంలో దశలవారీ ఒడిదొడుకులుంటాయనడానికి నా జీవితమే ఒక ఉదాహరణ. మానసిక కుంగుబాటును ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా, ఆ సమస్య పట్ల అవగాహన పెంచగలిగాను. కొత్త తల్లులు లోనయ్యే అపరాధ భావనలను స్వయంగా అనుభవించాను కాబట్టే ఈ అంశం గురించి బహిరంగ చర్చ జరగవలసిన అవసరం ఉందని నేను దృఢంగా నమ్ముతున్నాను.’’
ఇవి కూడా చదవండి:
FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..
Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..