Share News

స్టాక్‌ ట్రాన్స్‌ఫర్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

ABN , Publish Date - Apr 13 , 2025 | 02:17 AM

వివిధ ప్రదేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న సంస్థలకు ముఖ్యంగా పలు ప్రాంతాల్లో బ్రాంచీలు, షోరూమ్‌లు కలిగిన సంస్థలు సరుకును ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి పంపాల్సిన సందర్భాలు చాలా పర్యాయాలు...

స్టాక్‌ ట్రాన్స్‌ఫర్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

వివిధ ప్రదేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న సంస్థలకు ముఖ్యంగా పలు ప్రాంతాల్లో బ్రాంచీలు, షోరూమ్‌లు కలిగిన సంస్థలు సరుకును ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి పంపాల్సిన సందర్భాలు చాలా పర్యాయాలు ఎదురవుతుంటాయి. అంటే గోదాము నుంచి షాప్‌కు, ఒక షాప్‌ నుంచి మరొక షాప్‌కు ఇలా సరుకును పంపాల్సి ఉంటుంది. దీనికి కారణాలు అనేకం. ఉదాహరణకు పెద్ద సూపర్‌ మార్కెట్లు, ఎలకా్ట్రనిక్‌ ఉపకరణాలు అమ్మే షాప్‌లు, కార్పొరేట్‌ మొబైల్‌ షోరూమ్‌లు ఇవన్నీ ఒక వేర్‌ హౌస్‌లో సరుకును నిల్వ చేసి అవసరాన్ని బట్టి వివిధ షోరూమ్‌లకు పంపుతాయి. అలాగే అవసరాన్ని బట్టి ఒక షోరూమ్‌ నుంచి మరొక షోరూమ్‌కు కూడా పంపుతాయి. దీనినే స్టాక్‌ ట్రాన్స్‌ఫర్‌ అంటారు. అంటే ఒక సంస్థకు సంబంధించిన వివిధ బ్రాంచీల మధ్య సరుకు రవాణా అవుతుంటే దానిని స్టాక్‌ ట్రాన్స్‌ఫర్‌గా వ్యవహరిస్తారు.

మరి ఈ స్టాక్‌ ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించి జీఎ్‌సటీ చెల్లించాలా? లేదా మినహాయింపులు ఏమైనా ఉన్నాయా? అలాగే దీనికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మొదలైన విషయాలు మీకోసం..


జీఎ్‌సటీ నిబంధనల ప్రకారం ఒక సంస్థకు వివిధ రాష్ట్రాల్లో శాఖలు ఉంటే ప్రతి రాష్ట్రంలో విధిగా రిజిస్ట్రేషన్‌ తీసుకోవాలి. అలాగే, ఒక రాష్ట్రంలో వివిధ శాఖలు ఉంటే వాటన్నిటికి ఒకటే జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్‌ సరిపోతుంది. కాకపోతే, అన్ని శాఖల వివరాలను జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక రాష్ట్రంలోని ఒక గోదాము నుంచి అదే రాష్ట్రంలోని ఒక బ్రాంచీకి లేదా ఒక బ్రాంచీ నుంచి మరొక బ్రాంచీకి మధ్య స్టాక్‌ ట్రాన్స్‌ఫర్‌ జరుగుతుంటే దీనికి సంబంధించి ఎలాంటి జీఎ్‌సటీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సరుకు పంపే ప్రదేశం, పొందే ప్రదేశం ఒకటే జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్‌ కింద ఉన్నాయి. కాబట్టి. మరి అలాంటప్పుడు సరుకును ఎలా పంపాలంటే, దీనికి ఇన్వాయిస్‌ జారీ చేయకుండా ఒక డెలివరీ చలాన్‌ కింద సరుకును పంపాల్సి ఉంటుంది. కాకుంటే ఈ-వే బిల్‌ మాత్రం నిబంధనల ప్రకారం జారీ చేయాల్సి ఉంటుంది.

ఇకపోతే సరుకును ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి అంటే ఒకటే యాజమాన్య సంస్థకు సంబంధించిన రెండు బ్రాంచీలకు మధ్య స్టాక్‌ ట్రాన్స్‌ఫర్‌ అవుతుంటే మాత్రం కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే పాన్‌ నంబరు ఒకటే ఉన్నప్పటికీ జీఎ్‌సటీ ప్రకారం ఈ రెండు వేర్వేరు రిజిస్ట్రేషన్లు. ఇలాంటి రిజిస్ట్రేషన్స్‌ను డిస్టింక్‌ పర్సన్స్‌ అంటారు. ఇలా డిస్టింక్ట్‌ పర్సన్స్‌ మధ్య స్టాక్‌ ట్రాన్స్‌ఫర్‌ జరుగుతుంటే దీనిని సరఫరా కింద భావించి అందుకు తగ్గట్టుగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మరి ఎంత విలువ మీద పన్ను చెల్లించాలి? దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి.


మొదటగా ఈ విలువ అనేది మార్కెట్‌ విలువ ప్రకా రం ఉండాలి. దీన్నే ఓపెన్‌ మార్కెట్‌ వాల్యూ అంటారు. అంటే సాధారణ కొనుగోలుదారులకు ఏ విలువకు అమ్ముతారో ఆ విలువ లేదా సరుకును ఏ బ్రాంచీకి అయితే అమ్ముతున్నారో ఆ బ్రాంచీ వినియోగదారులకు అమ్మే ధర లో 90 శాతం విలువను చూపించవచ్చు. ఉదాహరణకు ఒక సంస్థ తన హైదరాబాద్‌ బ్రాంచీ నుంచి తమ విజయవాడ బ్రాంచీకి కొన్ని మొబైల్‌ ఫోన్లు స్టాక్‌ ట్రాన్స్‌ఫర్‌ చేస్తుందనుకుందాం. దీని సాధారణ మార్కెట్‌ విలువ రూ.28,000 అనుకుంటే ఇన్వాయి్‌సలో విలువ రూ.28,000 చూపించవచ్చు. లేదా ఈ మొబైల్‌ను విజయవాడ బ్రాంచీలో కొనుగోలుదారులకు రూ.30,000 అమ్ముతున్నారనుకుంటే దానిలో 90 శాతం అంటే రూ.27,000 చూపించవచ్చు. దీని మీద కట్టిన పన్నును విజయవాడ బ్రాంచీ నిబంధనలు అనుసరించి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) కింద తీసుకోవచ్చు.

ఈ నిబంధనలతో సంబంధం లేకుండా ఇంకొక ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. అదేమిటంటే, సరఫరా పొందే శాఖ అంటే ఈ ఉదాహరణలో విజయవాడ బ్రాంచీకి స్టాక్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసే సరుకు మీద పూర్తి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ తీసుకోవటానికి అర్హత ఉన్నట్లయితే అప్పుడు ఇన్వాయి్‌సలో ఏ విలువ అయినా చూపించవచ్చు. ఎందుకంటే, ఎంత విలువ చూపినా, ఎలాగూ ఆ మొత్తం మీద క్రెడిట్‌ తీసుకోవచ్చు కాబట్టి.


ఒక్కొక్కసారి ఒకే రాష్ట్రంలో కూడా ఒకటి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్‌ ఉండవచ్చు. అలాంటప్పుడు కూడా స్టాక్‌ ట్రాన్స్‌ఫర్‌ మీద పన్ను చెల్లించాలి. సింపుల్‌గా చెప్పాలంటే ఒకటే రిజిస్ట్రేషన్‌ మధ్య జరిగే స్టాక్‌ ట్రాన్స్‌ఫర్‌కు ఎలాంటి పన్నులు వర్తించవు. అలాకాకుండా స్టాక్‌ ట్రాన్స్‌ఫర్‌ రెండు జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్ల మధ్య జరిగినప్పుడు తప్పకుండా పన్ను చెల్లించాలి. ఈ రెండు సందర్భాల్లోనూ ఈ-వే బిల్లును నిబంధనల ప్రకారం జారీ చేయాల్సి ఉంటుంది.

రాంబాబు గొండాల

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

ఈ వార్తలు కూడా చదవండి:

Viral Video: లేడి ఎస్సైతో అలాంటి పనా.. నీకుందిలే అంటూ నెటిజన్లు ఫైర్..

Tokay Gecko: ఇవేం బల్లులు రా నాయనా.. ఒక్కటి అమ్మేస్తే చాలు హైదరాబాద్‌లో ఇల్లు కొనేయెుచ్చు..

Inter Sudent Passed Away: షాకింగ్ న్యూస్.. పరీక్షల్లో తప్పానని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

Updated Date - Apr 13 , 2025 | 02:17 AM