Satellite Internet : శాటిలైట్ ఇంటర్నెట్ అంటే ఏమిటి.. ఇదెలా పనిచేస్తుంది.. డేటా స్పీడ్ ఎంత..

ABN, Publish Date - Mar 12 , 2025 | 06:16 PM

Starlink Satellite Internet : భారతదేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థలు ఎయిర్‌టెల్, జియోలు ఒకదాని తర్వాత మరొకటి శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్‌తో డీల్ కుదుర్చుకున్నాయి. దీంతో ఇప్పుడీ అంశం దేశమంతటా హాట్ టాపిక్‌గా మారింది. అసలీ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ అంటే ఏమిటి.. స్టార్ లింక్ నేరుగా ఇంటర్నెట్‌ను మన ఇళ్లకు ఎలా తీసుకువస్తుంది..

Satellite Internet : శాటిలైట్ ఇంటర్నెట్ అంటే ఏమిటి.. ఇదెలా పనిచేస్తుంది.. డేటా స్పీడ్ ఎంత..
What is Starlink Satellite Internet

Starlink Satellite Internet Services : ఇండియాలోని టెలికాం దిగ్గజాలైన జియో, ఎయిర్‌టెల్ గంటల వ్యవధిలోనే ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్ లింక్ శాటిలైట్ సర్వీసెస్‌తో డీల్ చేసుకోవడంతో.. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. దశాబ్ద కాలంగా టెలికాం మార్కెట్లో నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడుతున్న జియో, ఎయిర్‌టెల్ ఈ విషయంలో ఎందుకింతలా పోటీపడి మరీ ఒప్పందం చేసుకున్నారనే ప్రశ్న ప్రజల మనసులో మెదులుతోంది. శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ఇండియాలో అమల్లోకి వస్తే ఏమవుతుంది? ఇప్పుడున్న ఇంటర్నెట్ సేవలకు, దీనికి తేడా ఏంటి? ఎంత వేగంతో డేటా వస్తుంది ? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


శాటిలైట్ ద్వారా టీవికి కేబుల్ నెట్‌వర్క్ ఛానళ్లు రావడం అందరికీ తెలుసు. ఇదే ఆలోచనతోనే ఎలాన్ మస్క్ స్టార్ లింక్ కంపెనీ ఇంటింటికీ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ ఎందుకివ్వకూడదని ఆలోచించినట్లుంది. అనుకున్నదే తడవుగా ప్రయత్నాలు మొదలుపెట్టి ఈ ప్రయోగంలో సక్సెస్ అయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల్లో ఈ సేవలను విస్తరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఎలాన్ మస్క్.తాజాగా భారతదేశంలోని దిగ్గజ టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్ సంస్థలు స్టార్ లింక్ సంస్థతో ఒప్పందం చేసుకోవడంతో ఈ దిశగా కీలక ముందడుగు పడినట్లయింది. దీంతో ఇప్పటి వరకూ మొబైల్‌, బ్రాడ్ బాండ్ లేదా ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయం పొందుతున్న భారతీయులు..ఇకపై ఉపగ్రహం ద్వారా ఇంటర్నెట్ సేవలు పొందే అవకాశం అందుకోనున్నారు.


స్టార్ లింక్‌కు జియో, ఎయిర్‌టెల్ సాయం ఎందుకవసరం..

ఎయిర్‌టెల్, జియో రెండు సంస్థలు వాటి రిటైల్ స్టోర్‌లలో స్టార్‌లింక్ పరికరాలను కస్టమర్లకు అమ్మేలా స్పేస్ ఎక్స్‌తో డీల్ చేసుకున్నాయి. ఇన్‌స్టలేషన్, యాక్టివేషన్, నిర్వహణ తదితర సర్వీసెస్ స్టార్ లింక్ ప్రతినిధులుగా అందిస్తాయి. ఈ ఎక్విప్‌మెంట్ ద్వారా వ్యాపార రంగం, స్కూళ్లు, హెల్త్ కేర్ సెంటర్లు, ప్రత్యేకించి రూరల్ ఏరియాల్లో స్టార్ లింక్ సేవలను విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా సొంత నెట్‌వర్క్‌లను మెరుగుపర్చుకుని కస్టమర్లకు నాణ్యమైన డిజిటల్ సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) డేటా సెంటర్ నుంచి డేటాను స్టార్ లింక్ ఉపగ్రహానికి పంపిస్తుంది. భూమి నుంచి దాదాపు 550 కిలోమీటర్ల ఎత్తులో దాదాపు 7 వేల శాటిలైట్లు నిరంతరం భూమి చుట్టూ వివిధ దిశల్లో కదులుతూ ఉంటుంది. అదే ఇతర ఉపగ్రహాలు అయితే దాదాపు 35,786 కిలోమీటర్ల ఎత్తున స్థిర కక్ష్యలో తిరుగుతూ ఉంటాయి.


సాధారణ ఇంటర్నెట్ Vs శాటిలైట్ ఇంటర్నెట్

ఎలోన్ మస్క్ స్టార్‌లింక్ ఎర్త్ ఆర్బిట్ (LEO) ఉపగ్రహాలను ఉపయోగించి హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. సాధారణ ఇంటర్నెట్ పద్ధతులతో పోలిస్తే ఉపగ్రహ ఇంటర్నెట్ ద్వారా హై స్పీడ్ డేటా ప్రొవైడ్ చేయవచ్చు. ఎందుకంటే ఇంటర్నెట్ కేబుల్స్ లేదా సెల్యులార్ టవర్లపైనే సాధారణ ఇంటర్నెట్ సర్వీసెస్ ఆధారపడి ఉంటాయి. వాతావరణంలో మార్పులు, ఇతర ఆటంకాల వల్ల డేటా వేగంలో తరచూ హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంది. అదే శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ అయితే ఎలాంటి అడ్డంకులు లేకుండా నేరుగా ఉపగ్రహాలకు కనెక్ట్ అయ్యుంటాయి. ఈ సర్వీసెస్ కోసం వినియోగదారులు రౌటర్, కరెంట్ కేబుల్, మౌంటు ట్రైపాడ్‌ కిట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అచ్చం DTH వ్యవస్థల మాదిరిగానే డిష్ యాంటెన్నాను ఆరుబయట ఏర్పాటు చేస్తారు.ఈ యాంటెన్నా ఉపగ్రహం నుంచి నేరుగా సంకేతాలను తీసుకుని మోడెమ్ ద్వారా మన పరికరాలకు ప్రసారం చేస్తుంది. కస్టమర్లు ఈ సర్వీసెస్ తీసుకున్న తర్వాత సొంతంగా పర్యవేక్షించుకునేందుకు స్టార్‌లింక్ యాప్‌ను కూడా అందించనుంది.


డేటా స్పీడ్ ఎంతంటే ..

యూజర్ ఆన్‌లైన్‌లోకి వెళ్లాలనుకున్నప్పుడు, వారి రిక్వెస్ట్ మొదట ఇంట్లోని డిష్ యాంటెన్నాకు చేరుతుంది. ఇది స్టార్‌లింక్ ఉపగ్రహానికి సిగ్నల్‌ను పంపుతుంది. ఆ తర్వాత డేటా ఇంటర్నెట్‌ ప్రసారమయ్యి యూజ‌ర్‌కు డెలివరీ అవుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం మనం గుర్తించలేనంత వేగంగా జరిగిపోతుంది. ఈ పద్ధతిలో యూజర్ 50 Mbps నుంచి 250 Mbps వేగంతో డేటా పొందవచ్చు. అప్‌లోడ్‌లు చేసేటప్పుడు 40 Mbps స్పీడ్‌తో వస్తుంది. ప్రీమియం ప్యాకేజీలను ఎంచుకునే వారికి స్టార్‌లింక్ 500 Mbps వేగంతో ఇంటర్నెట్ సేవలు అందుకోవచ్చు.


Read Also : Jio partners: నిన్న ఎయిర్ టెల్, ఈరోజు జియో..స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం

ఈ మెషిన్ ఒక్కటి కొంటే.. ఇంట్లోనే రోజూ రూ.5000 సంపాదన.. చాలామందికి తెలియని టాప్ బిజినెస్ ఐడియా..

యూజర్లకు యాపిల్ హెచ్చరిక!

Updated Date - Mar 12 , 2025 | 06:24 PM