Share News

ఉఫ్‌.. రిలీఫ్‌!

ABN , Publish Date - Apr 09 , 2025 | 04:31 AM

ట్రంప్‌ సుంకాల షాక్‌తో సొమ్మసిల్లిన స్టాక్‌ మార్కెట్లు కాస్త తేరుకున్నాయి. కనిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు వాల్యూ బైయింగ్‌కు పాల్పడటంతో ఆసియా, ఐరోపా మార్కెట్లతో పాటు దలాల్‌ స్ట్రీట్‌లోనూ మంగళవారం ఊరట ర్యాలీ...

ఉఫ్‌.. రిలీఫ్‌!

భారీ నష్టాల నుంచి మార్కెట్లకు కాస్త ఉపశమనం

  • సెన్సెక్స్‌ 1,089 పాయింట్లు అప్‌

  • 22,500 ఎగువ స్థాయికి నిఫ్టీ

  • రూ.7 లక్షల కోట్ల సంపద వృద్ధి

ముంబై: ట్రంప్‌ సుంకాల షాక్‌తో సొమ్మసిల్లిన స్టాక్‌ మార్కెట్లు కాస్త తేరుకున్నాయి. కనిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు వాల్యూ బైయింగ్‌కు పాల్పడటంతో ఆసియా, ఐరోపా మార్కెట్లతో పాటు దలాల్‌ స్ట్రీట్‌లోనూ మంగళవారం ఊరట ర్యాలీ కొనసాగింది. సెన్సెక్స్‌ ఒక దశలో 1,721.49 పాయిం ట్లు (2.35 శాతం) ఎగబాకి 74,859.39 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ 1,089.18 పాయింట్ల (1.49 శాతం) లాభంతో 74,227.08 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 535 పాయింట్ల (2.41 శాతం) వరకు పెరిగినప్పటికీ, చివర్లో 374.25 పాయింట్ల (1.69 శాతం) వృద్ధితో 22,535.85 వద్ద ముగిసింది. ఈక్విటీ మదుపరుల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.7.32 లక్షల కోట్లు పెరిగి రూ.396.57 లక్షల కోట్లకు (4.62 లక్షల కోట్ల డాలర్లు) చేరింది.


  • సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో పవర్‌గ్రిడ్‌ మినహా అన్నీ రాణించాయి. టైటాన్‌ షేరు 3.29 శాతం వృద్ధితో సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. బజాజ్‌ ఫైనాన్స్‌, ఎల్‌ అండ్‌ టీ, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌, బ్యాంక్‌, జొమాటో, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా స్టాక్స్‌ 2 శాతానికి పైగా పెరిగాయి.

  • బీఎ్‌సఈలోని స్మాల్‌క్యాప్‌ సూచీ 2.18 శాతం, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1.87 శాతం వృద్ధిని నమోదు చేశాయి. రంగాలవారీ సూచీలన్నీ రాణించాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీ అత్యధికంగా 2.58 శాతం ఎగబాకింది. కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌, టెలికాం, ఇండస్ట్రియల్స్‌, ఎనర్జీ సూచీలూ రెండు శాతానికి పైగా పెరిగాయి.

  • ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 50 పైసలు క్షీణించి రూ.86.26 వద్ద ముగిసింది. దాదాపు మూడు నెలల్లో రూపాయికిదే అతిపెద్ద ఒక్కరోజు నష్టం. అంతేకాదు, రూపాయి విలువ తగ్గడం వరుసగా ఇది మూడో రోజు కూడా.


అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే, జపాన్‌ నికాయ్‌ 6.03 శాతం, చైనాకు చెందిన షాంఘై ఇండెక్స్‌ 1.58 శాతం, హాంకాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌ 1.51 శాతం వృద్ధి చెందాయి. మరోవైపు బ్రిటన్‌కు చెందిన ఎఫ్‌టీఎ్‌సఈ 2.71 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 2.50 శాతం, జర్మనీకి చెందిన డాక్స్‌ సూచీలు 2.48 శాతం లాభంతో క్లోజయ్యాయి. కాగా అమెరికా సూచీలు డోజోన్స్‌ 2.07 శాతం, ఎస్‌ అండ్‌ పీ 2.05 శాతం, నాస్‌డాక్‌ 2.37 శాతం మేర లాభాలతో ప్రారంభమయ్యాయి.

ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాముల ధర మరో రూ.200 తగ్గి రూ.91,250కి జారుకుంది. వరుసగా ఐదు రోజులు తగ్గుతూ వచ్చిన వెండి రేటు మాత్రం కిలోకు రూ.200 పెరుగుదలతో రూ.92,700 పలికింది. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో మాత్రం ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ అర శాతానికి పైగా పెరిగి 3,007 డాలర్లకు చేరగా.. సిల్వర్‌ 30 డాలర్ల ఎగువన ట్రేడైంది.

Updated Date - Apr 09 , 2025 | 04:31 AM