Stock Market Crash: స్టాక్ మార్కెట్లో 1,390 పాయింట్లు డౌన్.. గంటల్లోనే లక్షల కోట్ల నష్టం..
ABN , Publish Date - Apr 01 , 2025 | 03:54 PM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 1,390 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 354 పాయింట్లు తగ్గింది. అయితే ఈరోజు స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది, ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

భారత స్టాక్ మార్కెట్లు ఆర్థిక సంవత్సరం మొదటి రోజైన నేడు (ఏప్రిల్ 1, 2025) భారీ నష్టాలతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 1,390 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 23,200 కంటే దిగువకు చేరింది. దీంతోపాటు బ్యాంక్ నిఫ్టీ 737 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 442 పాయింట్లు దిగజారింది.
దీంతో కొన్ని గంటల్లోనే మదుపర్లు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఆటో రంగం మినహా అన్ని ప్రధాన రంగాలు నష్టాల్లోనే ముగిశాయి. ఈ క్రమంలో నిఫ్టీ ఐటీ, రియాల్టీ, ఫైనాన్షియల్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ 1 నుంచి 3% వరకు తగ్గిపోయాయి. ఈ క్రమంలో BSE లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.1.25 లక్షల కోట్లు తగ్గి రూ.411.62 లక్షల కోట్లకు చేరుకుంది.
కారణాలివేనా..
స్టాక్ మార్కెట్ సూచీలు పడిపోవడానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 'రెసిప్రొకల్ టారిఫ్' అని నిపుణులు చెబుతున్నారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే వారిపై చర్యలు తప్పవని చేసిన ట్రంప్ వ్యాఖ్యలు పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచాయి. దీంతో సూచీలు మొత్తం దిగువకు పయనించాయి. ఈ క్రమంలో హెచ్‌సీఎల్‌టెక్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ, భారత్ ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీల స్టాక్స్ ఎక్కువగా నష్టపోగా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ట్రెంట్, బజాజ్ ఆటో, జియో ఫైనాన్షియల్, హీరో మోటోకార్ప్ వంటి కంపెనీల స్టాక్స్ లాభాలతో ముగిశాయి.
మొత్తంగా స్టాక్ మార్కెట్..
ఈ నేపథ్యంలో నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు వరుసగా 0.86 శాతం, 0.70 శాతం తగ్గాయి. మొత్తంగా చూస్తే కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజున భారతీయ స్టాక్ మార్కెట్లు 1 శాతానికి పైగా క్షీణతను నమోదు చేశాయి. గత రెండు వారాల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) నికర కొనుగోలుదారులుగా కొనసాగడం మార్కెట్‌లో పెరుగుదలకు దారితీసింది. కానీ శుక్రవారం గ్లోబల్ ఫండ్స్ ఆరు రోజుల కొనుగోళ్ల పరంపరను బ్రేక్ చేసి రూ.4,352 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. ఇప్పుడు కూడా మళ్లీ అదే ట్రెండ్ కొనసాగుతుంది.
గ్లోబల్ మార్కెట్లు
ఆసియా మార్కెట్లు ప్రారంభ లాభాలను కోల్పోయి మిశ్రమంగా ట్రేడవగా, వాల్ స్ట్రీట్ ఫ్యూచర్స్ బలహీనంగా ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.01% తగ్గగా, దక్షిణ కొరియా కోస్పి 1.5% పెరిగింది. సోమవారం వాల్ స్ట్రీట్ క్షీణతతో ప్రారంభమైంది. కానీ S&P 500, డౌ జోన్స్ వరుసగా 0.55%, 1% పెరిగాయి. అయితే నాస్‌డాక్ 100 0.14% పడిపోయింది. ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వచ్చే సుంకాలను ట్రంప్ బుధవారం వైట్ హౌస్ రోజ్ గార్డెన్‌లో ప్రకటించే అవకాశం ఉంది. దీని దృష్ట్యా, మార్కెట్లలో మరింత అనిశ్చితి, అస్థిరత కొనసాగుతుంది. ఈ సుంకాల వల్ల ఏ రంగాలు, ఏ దేశాలు ప్రభావితమవుతాయనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి:
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..
Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..
Read More Business News and Latest Telugu News