Share News

సాక్ష్యాన్ని కౌగిలించుకోండి

ABN , Publish Date - Mar 31 , 2025 | 06:20 AM

అమ్మను పిలవడానికి, పాలు తాగడానికీ పెదవులు లేవు నవ్వులనూ లాలిపాటలనూ వినడానికి చెవులు లేవు కాసింత ప్రేమ శ్వాసను పీల్చడానికి దేహంలో జీవం లేదు బాంబు పొగలో చర్మం ఆవిరై... దేహం...

సాక్ష్యాన్ని కౌగిలించుకోండి

అమ్మను పిలవడానికి, పాలు తాగడానికీ

పెదవులు లేవు

నవ్వులనూ లాలిపాటలనూ వినడానికి

చెవులు లేవు

కాసింత ప్రేమ శ్వాసను పీల్చడానికి

దేహంలో జీవం లేదు

బాంబు పొగలో చర్మం ఆవిరై

దేహం ఛిన్నాభిన్నమై నేను దొరికితే

మా అమ్మ పెట్టిన ముద్దుల ఆనవాళ్ళు

కనిపించడం లేదని గుర్తు చేయకండి

అమ్మ వొడిలో వాల్చిన తల

ఇప్పుడు నా దేహానికి లేదని

గుర్తు చేయకండి

మా అమ్మింకా బతికే ఉందని గుర్తు చేయకండి

చూడ్డానికి కళ్ళు లేవు

స్పర్శించడానికి చేతుల్లేవు

ఆమె అడుగుల్లో అడుగేసి నడవటానికి

కాళ్ళు లేవు

మా అమ్మింకా బతికే ఉందని గుర్తు చేయకండి

నా కోసం పరిగెత్తుకుంటూ వస్తుందని నాతో చెప్పకండి

దోగాడుతూ ఎదురెళ్ళటానికి

నేనిప్పుడు పసిపాపను కాదు

మాంసం ముద్దనూ కాదు

ఒట్టి బొక్కల చూరను

మా అమ్మింకా బ్రతికే ఉందని గుర్తు చేయకండి

మళ్ళీ నా పేరును నాకే గుర్తు చేయకండి

చనిపోయిన నాతోటి పసిపిల్లల పేర్లను గుర్తు చేయకండి

ఇది బాల్యానికి చోటులేని దేశమని గుర్తు చేయకండి

రొట్టెముక్కలను బాంబులు లాక్కుంటాయని గుర్తు చేయకండి

అస్థిపంజరం అనే పేరుగాంచిన బొక్కలగూడు మాత్రమే నేను


కూల్చబడ్డ ఆసుపత్రి గోడల కింద

నేను అస్థిపంజరమై దొరికితే

నన్ను కౌగిలించుకోవడానికి నిరాకరించకండి

మరణించిన మానవీయతకు

బాల్యాన్ని రుచి చూడని ఈ అస్థిపంజరాలే సాక్ష్యం

సాక్ష్యాన్ని కౌగిలించుకోండి!

మనసారా సాక్ష్యాన్ని కౌగిలించుకోండి!

దొంతం చరణ్

Updated Date - Mar 31 , 2025 | 06:21 AM