Share News

కాంగ్రెస్ పునరుజ్జీవన పథమేమిటి?

ABN , Publish Date - Apr 09 , 2025 | 05:15 AM

‘ప్రజాస్వామ్యం రెండు చక్రాలపై నడుస్తుంది. ఒక చక్రం అధికార పార్టీ అయితే మరో చక్రం ప్రతిపక్షం. ప్రజాస్వామ్యం సరిగా సాగాలంటే బలమైన ప్రతిపక్షం అవసరం. అందుకే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలపడాలి. అది బలహీనపడితే దాని స్థానంలో ప్రాంతీయ పార్టీలు ప్రవేశిస్తాయి. ఇది ప్రజాస్వామ్యానికి...

కాంగ్రెస్ పునరుజ్జీవన పథమేమిటి?

‘ప్రజాస్వామ్యం రెండు చక్రాలపై నడుస్తుంది. ఒక చక్రం అధికార పార్టీ అయితే మరో చక్రం ప్రతిపక్షం. ప్రజాస్వామ్యం సరిగా సాగాలంటే బలమైన ప్రతిపక్షం అవసరం. అందుకే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలపడాలి. అది బలహీనపడితే దాని స్థానంలో ప్రాంతీయ పార్టీలు ప్రవేశిస్తాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.’ అని రెండేళ్ల క్రితం బీజేపీ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. ఒక బీజేపీ నేత నుంచి ఇలాంటి మాటలు వచ్చాయంటే ప్రతిపక్షం బలహీనంగా ఉన్నందువల్ల జరిగే పర్యవసానాల గురించి ఆయన అర్థం చేసుకునే ఉంటారు. దేశంలో కాంగ్రెస్ ఇప్పుడు కేవలం మూడు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉన్నది. బీజేపీతో ముఖాముఖి పోటీ జరిగే రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ ఆ పార్టీని ఎదుర్కోలేకపోతున్నదనే విషయం స్పష్టంగా నిరూపితమవుతూనే ఉన్నది. గుజరాత్‌లో మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోతోంది. ఈ పరిస్థితుల్లో గుజరాత్‌లో ఏఐసీసీ సమావేశాలను ఏర్పాటు చేసినంత మాత్రాన ఫలితాలు భిన్నంగా ఉంటాయా? గత నెలలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ గుజరాత్‌కు వెళ్లి దాదాపు రెండు రోజుల పాటు 500 మంది కాంగ్రెస్ నేతలతో విస్తృత సమాలోచనలు జరిపారు. ప్రజలు కాంగ్రెస్‌కు ఎందుకు దూరమయ్యారు అన్న విషయమై వాస్తవాలు తెలుసుకోవడంపై ఆయన తన దృష్టి కేంద్రీకరించారు. ప్రజా సమస్యలపై పోరాడడంతో పాటు జిల్లా, గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్ఠం చేస్తే కాని ఫలితాలు సాధించలేమనే అభిప్రాయానికి వచ్చారు.


కాంగ్రెస్ శిథిలావస్థలో ఉన్నదని, బలపడేందుకు ఏమీ చేయడం లేదని, రాష్ట్రాల్లో అంతర్గత కలహాలతో సతమతమవుతోందని విమర్శించడం సులభం. బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిషా, తమిళనాడు, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ అధికారంలో లేదని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఎవరైనా ఎత్తిపొడవచ్చు. అయితే కొంతకాలంగా కాంగ్రెస్ ఏదో రకంగా పోరాడుతూనే ఉన్నది. ఏదో ఒక అంశంపై ఆ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళుతూనే ఉన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతల మధ్య సైద్ధాంతిక అంశాలపై బలమైన వాగ్యుద్ధాలు జరిగాయి. పార్టీలో సంస్థాగత మార్పులు తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ నేతలు తీవ్ర యత్నాలు చేస్తూనే ఉన్నారు. రెండు నెలల క్రితం జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయినప్పటికీ, మొత్తం 70 స్థానాల్లో తన ఉనికిని నిలబెట్టుకోగలిగింది. దాదాపు పది స్థానాల్లో బీజేపీకి లభించిన ఆధిక్యత కంటే కాంగ్రెస్ ఎక్కువ ఓట్లు సాధించింది. మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ మూలంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 4 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ తన వ్యూహరచనను మార్చుకున్నదనడానికి ఇది నిదర్శనం. మిత్రపక్షాలు అవసరమైన చోట స్నేహంగా ఉంటూనే స్వతంత్రంగా బలోపేతం అయ్యేందుకు కాంగ్రెస్ చర్యలు తీసుకుంటోంది. కొత్త ముఖాలకు అవకాశం కల్పిస్తోంది. బీజేపీని ఢీకొనాలంటే దీర్ఘకాలిక వ్యూహంతో పనిచేయాలనే విషయం కూడా కాంగ్రెస్‌కు అర్థమయినట్లు కనిపిస్తోంది. అందుకే 2027లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అక్కడే తన ఏఐసీసీ సమావేశాలను నిర్వహిస్తోంది. ఆరు దశాబ్దాల తర్వాత మోదీ స్వంత రాష్ట్రంలోనే ఈ సమావేశాలను నిర్వహించడం ఒకరకంగా బీజేపీకి సవాలు విసిరినట్లే.


ప్రత్యర్థి ఎంత బలాఢ్యుడైనా ఆయన చేతుల్లో బలికావడం కంటే శాయశక్తులా పోరాడి కనీసం జీవించేందుకు కాంగ్రెస్ బలంగా యత్నాలు చేయడం హర్షణీయమే. ఎప్పటికైనా మోదీ రాజకీయాల్లోంచి నిష్క్రమిస్తారని, బీజేపీపై ప్రజా వ్యతిరేకత రాకమానదని కాళ్లు చాపుకుని విశ్రమించడం వల్ల కాంగ్రెస్ పూర్తిగా తెరమరుగవుతుందనే విషయం ఆ పార్టీ నేతలకు తెలుసు. కాంగ్రెస్ పునరుద్ధరణ కాంగ్రెస్‌కు మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి కూడా ముఖ్యమని ఆ పార్టీ నేతలు గ్రహిస్తున్నారు. కాని మోదీ నాయకత్వంలో అత్యంత బలోపేతమైన భారతీయ జనతా పార్టీ, దానికి అండగా నిలిచిన సంఘ్ పరివార్ సంస్థలను, ప్రజల్లో విస్తరిస్తున్న హిందూత్వ భావోద్వేగ వెల్లువలను గమనించిన తర్వాత కాంగ్రెస్ పూర్వవైభవాన్ని సంతరించుకోగలదా అన్న అపనమ్మకాలు మాత్రం ఇప్పట్లో దూరమయ్యే అవకాశాలు లేవు. కాంగ్రెస్ పుంజుకుంటుందా లేదా అన్న చర్చ కంటే కాంగ్రెస్ ఎక్కడ దారితప్పిందనే చర్చ చేయడం అవసరం. బలహీన వర్గాలు, మైనారిటీలు, దళితుల గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడడం ద్వారా కాంగ్రెస్ బీజేపీ కంటే భిన్నమైనదని, బీజేపీ సంపన్నవర్గాల పార్టీ అని తీర్మానించడం వినడానికి బాగానే ఉంటుంది. కాని ఇవే వర్గాలు కాంగ్రెస్‌కు ఎందుకు దూరమయ్యాయి, ఇప్పుడు కాంగ్రెస్‌ను అవి ఎందుకు విశ్వసించాలి అన్న విషయంపై కూడా ఆ పార్టీ నేతలు స్పష్టంగా ఆలోచించాల్సి ఉంటుంది.

రెండవది, కాంగ్రెస్ వారసత్వానికి సంబంధించిన విషయం. కాంగ్రెస్‌లో ఒకప్పుడు మహామహులైన, దేశ భక్తులైన నాయకులు ఉండేవారు. ఇదే గుజరాత్‌లో 1938లో జరిగిన ఏఐసీసీ సదస్సుకు సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత వహించి, బ్రిటిష్‌ వలస పాలకులపై రాజీలేని సంపూర్ణ పోరాటానికి పిలుపునిచ్చారు. ఇదే గుజరాత్‌లో సర్దార్‌ పటేల్‌ దాదాపు పాతికేళ్లు కాంగ్రెస్ శ్రేణులకు శక్తిమంతమైన నాయకత్వాన్ని అందించారు. సహాయ నిరాకరణ, పౌర ఉల్లంఘన, విదేశీ వస్త్ర దహనం, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాలతో పాటు కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చిన ప్రతి పిలుపు విజయవంతమయ్యేలా చూశారు. జాతీయ పతాకాన్ని నిషేధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి వేలాది కార్యకర్తలు నిషేధాజ్ఞలు ధిక్కరించి పతాకాన్ని ఆవిష్కరించేలా చేశారు. వీరే కాదు, రాజద్రోహ నేరంపై మాండలే జైలులో ఆరు సంవత్సరాలు గడిపిన బాలగంగాధర్ తిలక్, స్వయంపాలనకోసం పోరాడిన గోపాలకృష్ణ గోఖలే, సామాజిక సంస్కరణలను అభిలషించిన గోవింద్ రనడే లాంటి వారెందరో కాంగ్రెస్‌కు చెందినవారే. నాలుగుసార్లు కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న మదన్‌మోహన్ మాలవీయ చౌరీచోరా కేసులో ఉరిశిక్షపడిన వారిని నిర్దోషులుగా విడుదల చేయించారు. ప్రపంచంలోనే అతి పెద్ద బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. కాంగ్రెస్‌లో అతివాద, మితవాద శక్తులు సైద్ధాంతికంగా ఘర్షించేవి. కాని వారందరూ మెజారిటీ హిందువులను ఆకర్షించేవారు. మహాత్మాగాంధీ కూడా ప్రజాసమీకరణ చేస్తూనే హిందూ ప్రతీకల్ని ఉపయోగించుకునేవారు.


అయితే స్వాతంత్ర్యానంతరం స్వాతంత్ర్య పోరాట యోధుల విలువల్ని, వారసత్వాన్ని విస్మరించింది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు మహోన్నత చరిత్ర ఉన్నదా అని ప్రజలు అనుమానపడే పరిస్థితిని కల్పించారు. స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని దశాబ్దాల వరకూ స్వాతంత్ర్య పోరాట యోధులను స్మరించేవారు. పాఠశాలల్లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రభాత భేరీలను నిర్వహించేవారు. దేశభక్తి గీతాలతో వీధులు మారుమ్రోగిపోయేవి. కాని తర్వాతి కాలంలో ఈ వాతావరణం పూర్తిగా మారిపోయింది. బిహార్లో బాబూరాజేంద్ర ప్రసాద్ నివసించిన సదాకత్ ఆశ్రమ్ ఇప్పుడు ఒక పాడుబడ్డ భవనంగా మారడమే అందుకొక ఉదాహరణ. కాంగ్రెస్ ఈ వ్యవహారశైలి భారతీయ జనతా పార్టీకి ఎంతో ఉపయోగపడింది. బీజేపీని, నరేంద్రమోదీని ఇప్పుడు ఏ విషయంపై విమర్శించినా గతంలో కాంగ్రెస్ చేసిన తప్పిదాలు గుర్తుకు వచ్చేలా కాంగ్రెస్‌ నేతలు వ్యవహరించారు. మదన్ మోహన్ మాలవీయ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభ్ భాయి పటేల్, లాల్‌బహదూర్ శాస్త్రి నుంచి మహాత్మాగాంధీ వరకూ నరేంద్రమోదీ దేశభక్తులందర్నీ తన స్వంతం చేసుకోవడం ప్రారంభించారు. హిందువుల ఓటు బ్యాంకు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటు శాతం పడిపోయే విధంగా బీజేపీ తన విధానాలను రూపొందించుకుంది.


దీనివల్ల కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడిపోయింది. ఇప్పుడు గుజరాత్‌లో సర్దార్ వల్లభ్ పటేల్ స్మారక చిహ్నం వద్ద కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని, గాంధీజీ ఆశ్రమం ఉన్న సబర్మతీ నది వద్ద ఏఐసీసీ సమావేశాలను నిర్వహిస్తున్నారంటే కాంగ్రెస్ మళ్లీ తన పూర్వవైభవాన్ని గుర్తుచేసుకుంటున్నదన్నమాట. గుర్తుచేసుకోవడం మాత్రమే సరిపోదు, తాను ఎప్పుడు, ఎక్కడ దారి తప్పిందన్న విషయమై అంతర్మథనం చేసుకోవాలి. ఒకప్పటి స్వాతంత్ర్య సమరయోధుల స్మారక స్థలాల మధ్య సమావేశాలు నిర్వహించడం, వారి చిత్రపటాలకు పూలమాలలు వేయడంతోనే సరిపోదు. వారి నాయకత్వ మహోన్నత స్ఫూర్తిని ప్రజల్లో వ్యాప్తి చేసేందుకు తామేమి చేయగలమో కాంగ్రెస్ నేతలు ఆలోచించాలి. దేశభక్తి, జాతీయవాదం, హిందూత్వ ఈ మూడింటినీ కలగలిపి బీజేపీ తన స్వంతమే అన్నట్లుగా ప్రచారం చేసుకుంటుంటే తామెందుకు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయామో ఆలోచించాలి. అంతేకాదు, సైద్ధాంతికంగా భిన్న స్వరాలకు కాంగ్రెస్‌ మళ్లీ వేదికగా మారాలి. అతివాద, మితవాద స్వరాలకు ఆస్కారం కల్పించాలి. 1955లో హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు జేబీ కృపలానీ కేవలం హిందూ మతం కోసమే చట్టం చేయడం సరికాదని విమర్శించారు. షాబానో కేసు, అయోధ్య నుంచి రాజీవ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించడం నుంచి ఇప్పటి వరకూ మతం విషయమై కాంగ్రెస్‌ సైద్ధాంతికంగా డోలాయమాన పరిస్థితిలోనే ఉన్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ ఇటీవల ‘మెమోయిర్స్ ఆఫ్ మావెరిక్’ అనే పుస్తకంలో ఈ డైలమాల గురించి అభివర్ణించారు. విఎన్ గాడ్గిల్ లాంటి వారు కాంగ్రెస్‌లో విపరీత ఆలోచనా ధోరణిని విమర్శించారు. ఇది బీజేపీ ఎదుగుదలకు ఆస్కారం కల్పించిందనడంలో సందేహం లేదు. వర్తమాన పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ సంస్థాగతంగా పటిష్ఠం కావడమే కాదు, సైద్ధాంతిక స్పష్టత ఏర్పర్చుకోవడంపై దృష్టి పెట్టాలి.

ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Apr 09 , 2025 | 05:15 AM