వ్యవస్థీకృతమైన పోలీసు హింస
ABN , Publish Date - Apr 16 , 2025 | 05:53 AM
‘దేశంలో జైళ్లు 5.70 లక్షలమంది ఖైదీలతో నిండిపోయాయి. గత దశాబ్దంలో ఖైదీల సంఖ్య 50శాతం కంటే పెరిగిపోగా, అనేక రాష్ట్రాల్లో ఉండాల్సిన దాని కంటే 200 శాతం ఎక్కువగా ఖైదీలు జైళ్లలో...

‘దేశంలో జైళ్లు 5.70 లక్షలమంది ఖైదీలతో నిండిపోయాయి. గత దశాబ్దంలో ఖైదీల సంఖ్య 50శాతం కంటే పెరిగిపోగా, అనేక రాష్ట్రాల్లో ఉండాల్సిన దాని కంటే 200 శాతం ఎక్కువగా ఖైదీలు జైళ్లలో మగ్గిపోతున్నారు. నిద్రపోయేందుకు సరైన స్థలం కూడా దాదాపు 31శాతం ఖైదీలకు లభించడం లేదు. మొత్తంగా 20శాతానికి పైగా ఖైదీలు మూడేళ్లకు పైగా విచారణ లేకుండా మగ్గిపోతున్నారు. జైళ్లలో 30శాతం పైగా సిబ్బంది పోస్టులు ఖాళీలు ఉన్నాయి.’ మంగళవారంనాడు ఢిల్లీలో విడుదలైన ‘ఇండియా జస్టిస్’ రిపోర్ట్ సారాంశమిది. మాజీ న్యాయమూర్తులు, న్యాయనిపుణులు, పలు పౌర సంస్థలు కలిసి రూపొందించిన నివేదిక ఇది. దేశంలో నేర న్యాయవ్యవస్థ తీరుతెన్నులను అది వెల్లడించింది. రూల్ ఆఫ్ లా అమలు చేయడంలో భారతదేశం 142 దేశాల్లో 77వ స్థానంలో ఉన్నది! నేర న్యాయవ్యవస్థను అమలు చేయడంలో 89వ స్థానంలో ఉన్నది!!
భారతదేశంలో నేరాలను అదుపు చేయడంలో ఫోరెన్సిక్ సైన్స్, కృత్తిమ మేధ (ఏఐ) వంటి టెక్నాలజీలను సమర్థంగా ఉపయోగిస్తున్నామని, ప్రజలకు న్యాయాన్ని సకాలంలో సంతృప్తికరంగా అందించేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం నాడు అఖిల భారత ఫోరెన్సిక్ సైన్స్ సమ్మిట్‌లో ప్రసంగిస్తూ అన్నారు. కేంద్ర హోంమంత్రి మాటలకూ, ఆచరణలో కనిపిస్తున్న దానికీ పొంతన లేదు. తాను మాట్లాడిన ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలోనే 50శాతానికి పైగా ఖాళీలు ఉన్న విషయం ఆయనకు తెలియనిది కాదు.
జైళ్లు నిండిపోకుండా ఉండాలంటే, ప్రజలకు సకాలంలో న్యాయం అందాలంటే న్యాయ వ్యవస్థ సరిగా పనిచేయాలి. కాని దేశంలో హై కోర్టులు, జిల్లా కోర్టుల్లో 5.1 కోట్ల మేరకు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సగటున మూడేళ్లకు పైగా 61 శాతం కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. 1987లో లా కమిషన్ దేశంలో ప్రతి పదిలక్షల మందికి కనీసం 50 మంది న్యాయమూర్తులు ఉండాలని తెలిపింది. కాని ఏ రాష్ట్రంలోనూ ఈ పరిస్థితి లేదు. ప్రతి పదిలక్షల మందికీ కేవలం 15 మంది న్యాయమూర్తులే ఉన్నారు. జిల్లా కోర్టుల్లో ప్రతి జడ్జిపైనా 2200 కేసుల భారం ఉంది. ఈ పరిస్థితి మూలంగా క్రింది కోర్టుల్లో మూడేళ్లకు మించిన పెండింగ్ కేసులు 25 నుంచి 45 శాతానికి పెరిగిపోయాయి. బిహార్‌లో అయితే క్రింది కోర్టుల్లో 71 శాతం కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. హైకోర్టుల్లో ఈ పరిస్థితి ఇంతకంటే ఘోరంగా ఉన్నది. దేశంలోని 25 హైకోర్టుల్లో అయిదేళ్లకు మించి పెండింగ్‌లో ఉన్న కేసులు 51 శాతానికి పై మాటే. సుప్రీంకోర్టులో అయితే 81వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
దేశం అత్యాధునిక ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందాలంటే నేర న్యాయవ్యవస్థ, రూల్ ఆఫ్ లా సక్రమంగా ఉండడం ముఖ్యం. ఒక దేశం అభివృద్ధి చెందిందని చెప్పేందుకు కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే కొలమానం కాదు. సామాజిక శాంతి, అందరికీ సమాన న్యాయం కూడా అభివృద్ధికి కొలమానాలే. కాని ఇక్కడ ప్రజలకు సకాలంలో న్యాయం అందడం అనేది ఒక సుదూర స్వప్నంగా మిగిలిపోయింది. న్యాయం ఆలస్యం కావడం అంటే న్యాయాన్ని నిరాకరించడమే అన్నది ఒక నానుడి. కాని మన నేతలు ఎంత టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నా. కోర్టులు, పోలీసు స్టేషన్లకు వెళ్లిన వారికి మనం ఎన్ని దశాబ్దాలు వెనుకగా ఉన్నామో అర్థమవుతోంది. ప్రజలకు న్యాయం అందడమే కష్టమైనప్పుడు దళితులు, మైనారిటీలు, ఆదివాసీలు అన్న తేడా లేకుండా సమాన న్యాయం అందడానికి మనకు ఎంత కాలం పట్టాలి? దేశంలో పేరుకుపోయిన కేసులన్నీ పరిష్కారం కావాలంటే 324 సంవత్సరాలు పడుతుందని నీతీ ఆయోగ్ ఒక నివేదికలో పేర్కొంది. న్యాయవ్యవస్థలో మహిళలు, దళితులు, ఆదివాసీలు, బీసీల శాతం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. జిల్లా కోర్టుల్లో న్యాయమూర్తుల్లో కేవలం 14 శాతం మంది ఎస్‌సీలు కాగా హై కోర్టుల్లో ఎస్‌సీ, ఎస్‌టీలకు చెందినవారు అయిదు శాతం మంది మాత్రమే ఉన్నారు. బీసీలు కేవలం 25.6 శాతం మంది మాత్రమే.
న్యాయవ్యవస్థ వేగంగా న్యాయం అందించకపోవడానికి న్యాయమూర్తుల సంఖ్య, మౌలిక సదుపాయాలు లేకపోవడం కారణమైతే, ప్రజలు చట్టం, న్యాయం పట్ల నమ్మకం కోల్పోవడానికి పోలీసు వ్యవస్థ కూడా కారణం. భారతదేశంలో పోలీసింగ్ పరిస్థితిపై కామన్ కాజ్, లోక్‌నీతి–సీఎస్‌డీఎస్ వారం రోజుల క్రితం విడుదల చేసిన నివేదిక అనేక పచ్చి నిజాలను వెలికితీసింది. దేశంలోని 8వేల మంది పోలీసులను ఈ సంస్థలు ప్రశ్నించి నివేదికను రూపొందించాయి. దేశంలో నేరాలను పరిష్కరించాలంటే చట్టవ్యతిరేకంగా బలప్రయోగం చేయడమే సరైనదని పోలీసుల్లో అత్యధికులు భావిస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది. వారికి రూల్ ఆఫ్ లా అన్నా, నిబంధనలు పాటించడమన్నా లెక్కలేదని తెలిపింది. సమాచారం రాబట్టాలంటే హింస తప్పదని సగానికి పైగా పోలీసులు చెప్పారని వెల్లడించింది. వ్యవస్థ నేరస్థులను రక్షిస్తుందని ఈ నివేదిక తెలిపింది. ప్రజల్లో భయం ఉండాలంటే బలప్రయోగం తప్పదని 55 శాతం మంది పోలీసులు చెప్పారని, సీరియస్ కేసుల్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సిందేనని 30శాతం మంది సమర్థించుకున్నారని, చిన్ననేరాలకు కూడా హింసించకపోతే నిజాలు బయటకురావని 9శాతం మంది పోలీసులు చెప్పారని తెలిపింది. అరెస్టుకు నిబంధనల ప్రకారం వ్యవహరించాలంటే ప్రతిసారీ సాధ్యం కాదని 24శాతం మంది పోలీసులు అంగీకరించారని తెలిపింది. పోలీసుల ప్రతాపానికి గురైన వారిలో అత్యధికులు దళితులు, ముస్లింలు, ఆదివాసీలు, మురికివాడల్లో నివసించేవారే కావడం గమనార్హం. దీంతో చట్టాలు ఎవరికి అనుకూలంగా పనిచేస్తున్నాయో అర్థమవుతుంది. ఎలాంటి ఫోరెన్సిక్ నైపుణ్యం లేకుండానే డాక్టర్లు వైద్యపరీక్షలు చేయడం, మెజిస్ట్రేట్లు తరుచూ మౌన ప్రేక్షకులుగా ఉండిపోవడం సహజ పరిణామం. ఎన్‌సీఆర్‌బీ డేటా ప్రకారమే 2011–2022ల మధ్య పోలీసు కస్టడీలో 1107 మంది మరణించారు. కాని ఒక్క పోలీసు అధికారికి కూడా శిక్షపడలేదు అసలు భారత న్యాయవ్యవస్థనే పోలీసు హింస కమ్మి వేసిందని, టెక్నాలజీ, ఏఐ గురించి ఎంత మాట్లాడుకున్నా ఒక రకంగా పోలీసు హింస అనేది దేశంలో వ్యవస్థీకృతంగా మారిందని వ్యాఖ్యానించింది.
భారత రాజ్యాంగం పోలీసు కస్టడీలో హింసాకాండను పూర్తిగా నిషేధించింది. నాగరిక సమాజంలో న్యాయం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువలు ప్రధానం. హింస అనేది ఆటవిక సంస్కృతిని ప్రతిబింబించడమే కాదు, మానవ సంబంధాలను హరించివేస్తుంది. సమాజంలో అన్ని వర్గాలకు చట్టం సమరీతిలో వర్తించాలంటే పోలీసులు వృత్తి నైపుణ్యం, జవాబుదారీతనంతో వ్యవహరించాలి. హింసాకాండకు వ్యతిరేకంగా అనేక దేశాలు అంతర్జాతీయ ఒడంబడికలకు అనుగుణంగా చట్టాలు చేసినప్పటికీ మన దేశం మాత్రం ఈ విషయంలో పెద్ద పట్టింపు లేకుండా వ్యవహరిస్తోంది. హింస, చట్టవ్యతిరేక హత్యలకు రాజకీయ వ్యవస్థలు ప్రోద్బలం కలిగించడమే ఇందుకు కారణం. ఈ క్రమంలో మానవ హక్కుల సంఘాలు కూడా కోరలు లేని నామమాత్ర సంస్థలుగా మిగిలిపోయాయి.
1997లో డికె బసు వర్సెస్ ఆఫ్ స్టేట్ ఆఫ్ బెంగాల్ కేసులో సుప్రీంకోర్టు పోలీసు కస్టడీలో హింసాకాండ, మరణాలు పెరిగిపోతున్నాయని పేర్కొంది. పోలీసు కస్టడీలో హింసాకాండ మానవ హక్కులను పూర్తిగా హరించి వేసి మనిషి ఉనికికే ముప్పుగా మారిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు.
దాదాపు 19 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు పోలీసు సంస్కరణలపై సమగ్రమైన తీర్పు నిచ్చింది. కాని ఇంతవరకూ ఈ సంస్కరణలపై ఏ ప్రభుత్వమూ దృష్టి సారించలేదు. ఈ సంస్కరణలు కావాలని సుప్రీంకోర్టులో పోరాడిన ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ ప్రకాశ్‌సింగ్ పోలీసులు, రాజకీయ నాయకులు పరస్పరం ఆధారపడడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్యానించారు. పోలీసులు లేకుండా రాజ్యం కోరలు లేనిదవుతుందని అన్నారు. రాజకీయ నాయకులు పోలీసులు తమ అడుగులకు మడుగులొత్తాలని, తమ రాజకీయ ఎజెండా అమలు చేయాలని అనుకుంటారని, పోలీసులపై రాజకీయనేతల పెత్తనం లేకుండా కొంత స్వతంత్రత ఏర్పర్చడం అవసరమని అన్నారు.
పోలీసుల శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతల నుంచి దర్యాప్తు బాధ్యతలను వేరు చేయాలని చెప్పిన సుప్రీంకోర్టు, వారు జవాబుదారీగా వ్యవహరించేందుకు అనేక ప్రతిపాదనలూ చేసింది. డీజీపీలను తాత్కాలికంగా నియమించకుండా యూపీఎస్‌సీ ద్వారా నియమించాలని తెలిపింది. డీజీపీలకు నిర్దిష్టంగా రెండేళ్ల కాలపరిమితిని విధించి రాజకీయ జోక్యం లేకుండా చూడాలని, బదిలీలు, పోస్టింగులు పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డుకు అప్పగించాలని, పోలీసులపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, కేంద్ర స్థాయిలో జాతీయ సెక్యూరిటీ కమిషన్ నియమించి నియామకాల బాధ్యతలు అప్పగించాలని తెలిపింది. ఈ సూచనలేవీ ప్రభుత్వాలు పాటించడం లేదని, అనేక రాష్ట్రాల్లో నిబంధలను ఉల్లంఘించి పోలీసులను నియమిస్తున్నారని, ఈ నియామకాల్లో తీవ్రమైన అవినీతి జరుగుతోందని ఇటీవల ప్రముఖ న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, దుష్యంత్ దవే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తాము మే నెలలో పోలీసు సంస్కరణలపై దృష్టి సారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా చెప్పారు. అప్పటికి ఆయన పదవీవిరమణ చేస్తారు.
ఆ తర్వాత కొత్త సీజే ఈ తీర్పులపై దృష్టిసారిస్తారో కాలగర్భంలో కలిపివేస్తారో చెప్పలేం. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో కనీసం మూడో స్థానానికి చేరాలనుకుంటున్న భారతదేశం ఆ దేశాల్లో ఉన్న ప్రమాణాలకు అనుగుణంగా న్యాయ, భద్రతా వ్యవస్థలను సంస్కరించుకోకపోతే అభివృద్ధికి అర్థం లేనట్లే.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఈ వార్తలు కూడా చదవండి:
Aghori Srinivas: అఘోరీ శ్రీనివాస్‌పై సంచలన ఆరోపణలు.. తనను పెళ్లి చేసుకున్నాడంటూ..
MLC Kavitha: కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత.. పింక్ బుక్ పేరు చెప్తూ..
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..